శరీరం చెప్పే ప్రతి మాటనూ అందరూ వినాలి : చిరంజీవి
శరీరం చెప్పే ప్రతి మాటను అందరూ శ్రద్ధగా వినాలని మెగాస్టార్ చిరంజీవి సూచించారు. ప్రపంచ కేన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శరీరంలో వచ్చే మార్పులు గమనించాలని.. నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు. కేన్సర్‌పై అందరిలోనూ అవగాహన రావాలన్నారు.
'గతంలో నా స్నేహితుడు ఒకరు కేన్సర్ బారిన పడితే వెంటనే గమనించి వైద్యం తీసుకున్నాడు. దాన్ని నివారించగలిగాం. ఇప్పుడు పదేళ్ల నుంచి హాయిగా ఉంటున్నాడు. శరీరం చెప్పే మాట అందరూ వినాలి. నాకు కేన్సర్ రాదులే అని నిర్లక్ష్యం చేయకూడదు. మన అలవాట్లు, వాతావరణం, వంశపారంపర్యంగా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.
మొదటి దశలోనే దాన్ని గుర్తిస్తే 90 శాతం తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయి. అమ్మాయిలకు చిన్న వయసులోనే వ్యాక్సిన్‌లు వేయిస్తే కొన్నిరకాల క్యాన్సర్ల బారిన పడకుండా కాపాడొచ్చు. మహిళలు కూడా జాగ్రత్తగా ఉండాలి. వ్యాక్సిన్‌లు తీసుకోవాలి. అందరూ జీవనశైలిలో మార్పులు చేసుకుని ఆరోగ్యకరమైన వాటిని తినాలి' అని చిరంజీవి అన్నారు.
భవిష్యత్తులో కేన్సర్‌పై అవగాహన కోసం తాను షార్ట్‌ఫిల్మ్‌లు తీయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు చిరంజీవి చెప్పారు. అది తన బాధ్యత అని అన్నారు. అందరూ జాగ్రత్తగా ఉంటూ ఈ మహమ్మారిని తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.