1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. megastar chiranjeevi special post on Sing Geetham Movie

సింగీతం శ్రీనివాస రావు చిత్రపరిశ్రమ ఆస్తి - నిధి : మెగాస్టార్ చిరంజీవి

chiranjeevi
దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు చిత్రపరిశ్రమ ఆస్తి, నిధి అంటూ మెగాస్టార్ చిరంజీవి కొనియాడారు. 94 యేళ్ల వయసులో సింగీతం శ్రీనివాస రావు 'సింగ్ గీతం' పేరుతో ఓ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ నెల 12వ తేదీన ఈ చిత్రం విడుదలకానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ ఓ పోస్ట్ పెట్టారు. 
 
'సింగీతం శ్రీనివాసరావు.. తెలుగు సినిమా పరిశ్రమకు ఆస్తి, ఒక నిధి. ద్రోణాచార్యుడు వంటివారు. దర్శకుడిగా ఎన్నో విజయవంతమైన చిత్రాలు అందించడమే కాకుండా, ఎంతోమంది కళాకారులకు అవకాశాలు కల్పించి వారి జీవితాలకు మార్గదర్శకుడయ్యారు. అలాంటి మహోన్నత వ్యక్తి దర్శకత్వంలో రూపొందిన 'సింగ్‌ గీతం' ఈనెల 12న విడుదలకానుంది. 
 
ఇది ఇండియన్ సినిమాలో మరొక మైలురాయిగా నిలవాలని, పెద్ద విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇలాంటి పెద్దలను గౌరవిస్తూ, వారి అనుభవాన్ని కొత్తతరానికి అందించే ఆలోచనతో ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత నాగ్ అశ్విన్‌ను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. 
 
ఒకవైపు ఆనాటితరానికి ప్రతినిధిగా నిలిచిన సింగీతం, మరోవైపు ఈతరం ఆలోచనలను ప్రతిబింబించే నాగ్‌ అశ్విన్‌.. వీరి కాంబో ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. అలాగే ఈ చిత్రానికి, నాకెంతో ఇష్టమైన దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందించడం మరింత ఉత్సాహాన్ని కలగజేస్తుంది' అని చిరంజీవి తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఇందులోభాగమైన అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 
About Writer
ఠాగూర్