ఆహ్వానించేందుకు వచ్చినపుడు షూటింగ్‌లో డ్యాన్స్ చేస్తున్నా : చిరంజీవి
రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కు తనను ఆహ్వానించేందుకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వచ్చినపుడు తాను సినిమా షూటింగులో డ్యాన్స్ చేస్తున్నానని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రెండు రోజుల పాటు నిర్వహించిన రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముగింపు వేడుకల్లో చిరంజీవి పాల్గొని ప్రసంగించారు. తన మీద గౌరవంతో ఈ సమ్మిట్‌కు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారని చెప్పారు.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తన దగ్గరకు వచ్చినప్పుడు తాను సినిమా షూటింగ్ డ్యాన్స్ చేస్తూ ఉన్నట్టు చెప్పారు. ఇది గొప్ప సమ్మిట్ అని అన్నారు. తెలంగాణ రైజింగ్ కొత్త ఇనిషియేటివ్ అని, చాలా ఆనందంతో ఇక్కడికి వచ్చినట్టు తెలిపారు.
చిరంజీవిని ఒక్కడినే ఈ వేదికపై కూర్చోబెట్టారని ఎవరు అనుకోవద్దన్నారు. సినిమా సొసైటీ తెలిసిన వ్యక్తిగా తనను ఆహ్వానించారని, పరిశ్రమ మనిషిగా ఇక్కడికి వచ్చినట్టు తెలిపారు. హైద్రాబాద్‌ను ఫిలిం గ్లోబల్ హబ్‌గా చేయాలని ముఖ్యమంత్రి చెప్పారని తెలిపారు.
ఈ అంశాన్ని ముఖ్యమంత్రి ఎంతో ధైర్యంతో చెప్పారు. అన్ని రకాల సెక్టార్లను ఫ్యూచర్ సిటీకి ఆహ్వానించడం రేవంత్ రెడ్డి ఒక్కడికే సాధ్యమైంది. తెలంగాణలో అన్ని వనరులు ఉన్నాయి. ప్రపంచానికి హైదరాబాద్ సినిమా హబ్‌గా మార్చేందుకు మేమంతా మీ వెంట ఉంటాం. యువతను ఎంటర్టైన్మెంట్ వైపు మళ్ళిస్తే వ్యసనాలకు దూరం అయ్యే అవకాశం ఉంది. మౌలిక వసతులు కల్పిస్తే సినిమా ఇండస్ట్రీ గ్లోబల్ హబ్‌గా మారుతుంది. ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూసేలా మేము సహకరిస్తాం అని మెగాస్టార్ చిరంజీవి హామీ ఇచ్చారు.