విడుదలకు ముందే సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్'
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ చిత్రం విడుదలకు ముందే సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ఈ నెల 19వ తేదీన విడుదల కానుంది.
సినిమాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని అంటుతుండగా, విడుదలకు ముందు వస్తున్న అప్‌డేట్స్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో ఈ చిత్రం సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోలకు ఇంకా సమయం ఉండగానే, అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఏకంగా 250 వేల డాలర్ల (సుమారు రూ.2.31 కోట్లు) మార్కును దాటేసింది. ఈ ట్రెండ్ చూస్తుంటే ప్రీమియర్లతోనే భారీ వసూళ్లు ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
మరోవైపు దర్శకుడు హరీశ్ శంకర్ సినిమా ఫైనల్ అవుట్ పుట్ పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ... సినిమా ఫైనల్ వెర్షన్ చూశాను. చాలా సంతోషంగా ఉంది. అభిమానులకు కావాల్సిన మాస్ ఎంటర్‌టైన్మెంట్ ఖచ్చితంగా లభిస్తుంది" అని ధీమా వ్యక్తం చేశారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.
కాగా, ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. పవన్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. సినిమాలో పవన్ మాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండగా, కీలక పాత్రల్లో పార్తిబన్, గౌతమి, రావు రమేశ్ వంటి ప్రముఖ నటులు నటించారు. నేపథ్య సంగీతం థమన్ అందించగా, పాటలకు దేవీశ్రీ ప్రసాద్ అందించారు.
