రజనీకాంత్ చిత్ర నిర్మాతకు మద్రాస్ హైకోర్టు స్ట్రాంగ్ వార్నింగ్
సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్ర నిర్మాతకు మద్రాస్ హైకోర్టు గట్టి వార్నింగ్ ఇచ్చింది. చెక్ బౌన్స్ కేసులో "కొచ్చడియాన్" చిత్ర నిర్మాత నాలుగు వారాల్లో రూ.2.5 కోట్లు చెల్లించాలని లేదా ఆరు నెలల పాటు జైలుశిక్ష అనుభవించాలని ఆదేశించింది.
రజనీ కుమార్తె సౌందర్య రజనీకాంత్ దర్శకత్వంలో గత 2014లో 3డీ మోషన్ క్యాప్చర్ మూవీగా 'కొచ్చడియాన్'ను తెరకెక్కించారు. ఈ చిత్ర నిర్మాణం కోసం బెంగుళూరు చెందిన యాడ్ బ్యూరూ అడ్వర్‌టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మీడియా వన్ గ్లోబల్ ఎంటర్‌టైన్మెంట్ లిమిటెడ్ డైరెక్టర్లలో ఒకరైన మురళీ మనోహర్ రుణం తీసుకున్నారు. తిరిగి చెల్లింపులో భాగంగా 2014లో మురళీ మోహన్ యాడ్ బ్యూరోకు ఇచ్చిన రూ.5 కోట్ల చెక్ బౌన్స్ అయింది.
దీంతో యాడ్ బ్యూరో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లలో ఒకరైన అబిర్ చంద్ సహర్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన ట్రయల్ కోర్టు మురళీ మనోహర్‌కు ఆరు నెలల జైలుశిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆయన మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఇచ్చిన గడువులోగా రూ.2.5 కోట్లు చెల్లించాలని లేనిపక్షంలో ఆరు నెలల జైలుశిక్ష అనుభవించాలని ఆదేశించింది.