మహిళగా పుట్టినందుకు గర్వంగా ఉంది : జాన్వీ కపూర్
తాను మహిళగా పుట్టినందుకు గర్వంగా ఉందని, మనల్ని మనం ప్రశంసించుకుంటూ ముందుకుసాగాలి అని బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ అన్నారు. పైగా, సమానత్వం గురించి ఎప్పుడూ మాట్లాడాల్సిందేనని ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలను మరో బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా మద్దతిచ్చారు.
ఇటీవల ముంబై వేదికగా జరిగిన వీ ది విమెన్ ఆసియా కార్యక్రమంలో జాన్వీ మాట్లాడుతూ మహిళగా పుట్టడాన్ని గౌరవంగా భావిస్తున్నానన్నారు. 'సమానత్వం అనేది సంభాషణలతో, చర్చలతోనే మొదలవుతుంది. మనం ఈ అంశం గురించి ఇప్పటికైనా ఓపెన్‌గా మాట్లాడితే మన తర్వాత తరానికైనా దీనిపై పూర్తి అవగాహన వస్తుంది. మహిళలు శక్తిమంతులు. వారిని ప్రోత్సహించాలి. నేను మహిళగా పుట్టినందుకు గర్వంగా ఉంది. మనల్ని మనం ప్రశంసించుకుంటూ ముందుకుసాగాలి' అని జాన్వీ అన్నారు. ఈ వీడియోను ప్రియాంక చోప్రా షేర్ చేశారు.. 'ఇలా మాట్లాడేవారిని కూడా ప్రోత్సహించాలి..' అని ప్రియాంక పేర్కొన్నారు.
గతంలోనూ జాన్వీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలపై మాట్లాడిన విషయం తెలిసిందే. 'ఇండస్ట్రీలో కొనసాగాలంటే పురుష అహంకారాన్ని ఎదుర్కోవాలి. నలుగురు మహిళలు ఉన్న ప్రదేశంలో నేను ధైర్యంగా నా అభిప్రాయాన్ని వ్యక్తం చేయగలను. కానీ, అదే ప్రదేశంలో నలుగురు పురుషులు ఉంటే మాత్రం నేను నా అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేను. ఎందుకంటే వారు నొచ్చుకోకుండా వెల్లడించాల్సి ఉంటుంది. దీనికి చాలా నేర్పు ఉండాలి. నేను ఈ విషయంలో ఎన్నో పోరాటాలు చేశాను' అని అన్నారు.