థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్
నందమూరి బాలకృష్ణ, బోయపాడి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం అఖండ-2. ఈ చిత్రం ఈ నెల 5వ తేదీన విడుదల కావాల్సివుండగా, ఆర్థిక కష్టాల్లో చిక్కుకుని విడుదలకు నోచుకోలేదు. ఈ పరిస్థితి తనను బాధించిందంటూ నిర్మాత విశ్వ ప్రసాద్ తాజాగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అలాగే, తాను నిర్మిస్తున్న 'ది రాజాసాబ్' రిలీజ్‌పై వచ్చిన రూమర్స్‌పైనా ఈ సందర్భంగా వివరణ ఇచ్చారు.
'విడుదలకు సిద్ధమైన సినిమాలు కొన్ని గంటల ముందు వాయిదా పడుతుండటం దురదృష్టకరం. ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండించాలి. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు.. ఇలా ఎంతోమందిపై అది ప్రభావం చూపుతుంది. థర్డ్ పార్టీలు చివరి క్షణంలో సినిమా విడుదలకు అంతరాయం కలిగించకుండా చట్టపరమైన మార్గదర్శకాలు రూపొందించడం చాలా ముఖ్యం అన్నారు.
అదేసమయంలో 'ది రాజాసాబ్' రిలీజ్‌పై రూమర్స్ వచ్చాయి. ఈ సినిమా కోసం సేకరించిన పెట్టుబడులను మేం క్లియర్ చేశాం. వడ్డీని కూడా త్వరలోనే చెల్లిస్తాం. 'అఖండ 2'తోపాటు డిసెంబరులో విడుదల కానున్న చిత్రాలు, 2026 సంక్రాంతికి రానున్న 'ది రాజాసాబ్', 'మన శంకర వరప్రసాద్ గారు', 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', 'అనగనగా ఒక రాజు', 'నారీ నారీ నడుమ మురారి', 'జన నాయగన్', 'పరాశక్తి' తదితర సినిమాల కోసం ఎదురుచూస్తున్నా. అన్నీ విజయాలు అందుకోవాలని ఆశిస్తున్నా' అని పేర్కొన్నారు.
కాగా, ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న చిత్రమే 'ది రాజాసాబ్'. ఈ మూవీ జనవరి 9న విడుదల కానుంది. బాలకృష్ణ హీరోగా బోయపాటి తెరకెక్కించిన 'అఖండ 2' ఈ నెల 5న విడుదల కావాల్సి ఉండగా.. ఆర్థిక పరమైన సమస్యల కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాని 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట - గోపి ఆచంట నిర్మించారు. త్వరలోనే మరో విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.