మంగళవారం, 21 ఏప్రియల్ 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

పవర్ స్టార్ హీరో అనగానే కథ కూడా వినలేదు : రాశీఖన్నా

Rashi Khanna
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో అనగానే 'ఉస్తాద్ భగత్ సింగ్' కథ కూడా వినలేదని ఆ చిత్రంలో నటించిన ఇద్దరు హీరోయిన్లలో ఒకరైన రాశీఖన్నా అన్నారు. పవన్ - రాశీఖన్నా - శ్రీలీలలు జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం ఈ నెల 19వ తేదీన విడుదలకానుంది. ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా రాశీఖన్నా మీడియాతో మాట్లాడారు. 
 
'నా తొలి చిత్రం చేస్తున్నప్పటి నుంచే పవన్ కల్యాణ్ గారి స్టార్డమ్, పవనిజం గురించి ఎంతో విన్నాను. ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలని అప్పటినుంచే అనుకున్నాను. అందుకే హరీశ్ శంకర్ ఈ అవకాశం ఇవ్వగానే, కథ కూడా వినకుండానే వెంటనే ఓకే చెప్పేశాను' అని రాశీఖన్నా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్‌తో పనిచేయాలనే కోరికతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె స్పష్టంచేశారు.
 
ఈ సినిమా కోసం తాను ఎంతో కష్టపడ్డానని రాశీ తెలిపారు. పవన్ కల్యాణ్ బిజీ షెడ్యూల్స్ కారణంగా తన డేట్స్‌ను సర్దుబాటు చేసుకున్నానని, కొన్నిసార్లు పగలు, రాత్రి తేడా లేకుండా 24 గంటల పాటు కూడా పనిచేశానని గుర్తుచేసుకున్నారు. ఈ చిత్రంలో తాను 'శ్లోక' అనే ఆధునిక యువతి పాత్రలో కనిపిస్తానని, తనపై చిత్రీకరించిన ఒక మాస్ పాట అభిమానులను ఉర్రూతలూగిస్తుందని ఆమె వివరించారు.