జ్యోతికను పెళ్లాడలేకపోతే జీవితాంతం ఒంటరిగా వుంటానన్నాడు: సూర్య తండ్రి
కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో లవ్లీ కపుల్స్ అంటే సూర్య-జ్యోతిక, అజిత్-షాలిని టక్కున గుర్తుకు వస్తారు. హీరో సూర్య వివాహం విషయం గురించి, అతడి ప్రేమ గురించి తండ్రి శివకుమార్ పలు విషయాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ... నా కుమారుడు సూర్య, నటి జ్యోతికను ప్రేమిస్తున్నానని నాతో చెప్పినప్పుడు వద్దు అన్నాను. ఐతే సూర్య మాత్రం తను జ్యోతికను తప్ప మరే అమ్మాయిని వివాహం చేసుకోలేను అని చెప్పాడు.
ఒకవేళ జ్యోతికను వివాహం చేసుకోలేకపోయినట్లయితే జీవితాంతం ఒంటరిగా వుండిపోతాను అని మొండికేశాడు. దాంతో నా కెరీర్లో నేను నటించిన 150 ప్రేమకథలు నాకు గుర్తుకు వచ్చాయి. ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా సూర్య కోరిక ప్రకారం వివాహం జరిపించాను. సూర్య జీవితంలోకి జ్యోతిక భార్యగా అడుగుపెట్టాక అతడిలో మార్పులు గమనించాను. మొదట్లో బిడియంగానూ, ఒంటరిగా వుండేవాడు. అలాంటి సూర్య ఇప్పుడు ఇద్దరు పిల్లల తండ్రిగా ఎంతో పరివర్తన కలిగినవాడిలా కనిపిస్తుంటాడు. అదంతా ప్రేమమహిమ అని అన్నారు.