'జన నాయగన్' నిర్మాతకు తమిళనాడు సీఎం విజయ్ నుంచి పిలుపు.. ఎందుకో తెలుసా?
విజయ్ హీరోగా నటించిన చివరి చిత్రం జన నాయగన్. ఈ చిత్రం ఆఖరిది కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, సెన్సార్ సర్టిఫికెట్ రానందున విడుదల వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్.. ఈ అడ్డంకులను తొలగించి త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారట.
ఈ పనుల కోసమే కేన్స్‌కు వెళ్లిన కేవీఎన్ బ్యానర్ నిర్మాత వెంకట్‌ను అక్కడినుంచి వెనక్కిరావాలని కోరారు. విజయ్ పిలుపుతో నిర్మాత తన పర్యటనను మధ్యలోనే ముగించుకుని చెన్నై బయల్దేరినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే 'జన నాయగన్' విడుదల తేదీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
సీఎంగా ఒకవైపు సంచలన నిర్ణయాలు తీసుకుంటోన్న విజయ్.. తన ఆఖరి చిత్రాన్ని వీలైనంత త్వరగా విడుదల చేయాలని ప్రయత్నాలు చేయడంతో ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. దీనిపై నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
