చెన్నైలో బుల్లితెర నటి ఆత్మహత్య - భర్తతో వీడియో కాల్ చేసిన తర్వాత...
చెన్నై నగర శివారు ప్రాంతమైన అయ్యప్పన్ తాంగల్లోని ఓ అపార్టుమెంట్‌లో బుల్లితెర నటి సుభాషిణి ఆత్మహత్య చేసుకుంది. ప్రముఖ తమిళ టీవీ చానెల్‌లో ప్రసారమయ్యే కయల్ అనే టీవీ సీరియల్ షూటింగ్ కోసం బెంగుళూరు నుంచి చెన్నైకు వచ్చిన ఆమె.. అయ్యప్పన్ తాంగల్లోని ఓ అపార్టుమెంటులో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి బెంగుళూరులో ఉంటున్న తన భర్తతో వీడియో కాల్‌లో మాట్లాడిన తర్వాత ఆమె బలవన్మరణానికి పాల్పడినట్టు సమాచారం.
భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఉన్నాయని, ఈ విషయంపైనే ఆదివారం రాత్రి వారిద్దరి మధ్య మళ్లీ గొడవలు జరిగినట్టు దీంతో తీవ్ర మనస్తాపం చెందిన సుభాషిణి ఆత్మహత్య చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, పోలీసులు మాత్రం సుభాషిణి నిజంగానే ఆత్మహత్య చేసుకున్నారా లేక ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
ఇదిలావంటే, శ్రీలంక పూర్వీకం కలిగిన సుభాషిణి, సినిమాలు, టీవీ సీరియల్స్‌లో నటించాలన్న ఆశతో భారత్‌కు వచ్చారు. తన భర్తతో కలిసి బెంగుళూరు ఉంటున్న ఆమె.. కయల్ సీరియల్ షూటింగ్ నిమిత్తం చెన్నైకు వచ్చిన అయ్యప్పన్ తాంగల్లోని ఓ ప్రైవేటు అపార్టుమెంటులో ఉంటూ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అయితే, ఆమె అర్థాంతరంగా తనువు చాలించడం బుల్లితెర వర్గాలు దిగ్భ్రాంతికి లోనయ్యాయి.
