భారతీయ సినిమా గతిని మార్చిన ప్రయోగశీలి సింగీతం
భారతీయ సినిమా గతిని మార్చిన ప్రయోగశీలి సింగీతం శ్రీనివాస రావు. దక్షిణాది వెండితెరపై సాహసోపేత చిత్రాలకు చిరునామాగా నిలిచిన దర్శకుడు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఏడు దశాబ్దాల పాటు తనదైన ముద్ర వేసిన ఈ సినీ మేధావి మృతితో చిత్ర పరిశ్రమలో ఒక స్వర్ణయుగం ముగిసినట్లయింది.
కన్నడలో సంచలనం రేపిన 'సంస్కార' చిత్రానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సింగీతం, తెలుగులో 'నీతి నిజాయితీ'తో దర్శకుడిగా తన జర్నీ మొదలుపెట్టారు. తొలినాళ్లలో ఆయన చిత్రాలు వాణిజ్యపరంగా పెద్దగా విజయం సాధించకపోయినా, ఆయన కథన శైలి, సంగీత అభిరుచి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి.
1975లో తమిళంలో తీసిన 'దిక్కట్ర పార్వతి' జాతీయ పురస్కారం గెలుచుకోవడంతో ఆయన ప్రతిభ దేశవ్యాప్తమైంది. ఆ తర్వాత తెలుగులో వచ్చిన 'అమెరికా అమ్మాయి' ఘనవిజయంతో ఆయన వెనుదిరిగి చూసుకోలేదు.
సింగీతం సినీ ప్రస్థానంలో విశ్వనటుడు కమల్ హాసన్‌తో బంధం ఒక సువర్ణాధ్యాయం. మాటలు లేని మూకీ చిత్రం పుష్పక విమానం'తో అంతర్జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టించారు. కమల్‌ను మరుగుజ్జుగా చూపిస్తూ తీసిన విచిత్ర సోదరులు సాంకేతిక అద్భుతంగా నిలిచిపోయింది.
చూపులేని వ్యక్తి ప్రేమకథతో 'అమావాస్య చంద్రుడు', నలుగురు కమల్‌తో తీసిన 'మైకేల్ మదన కామరాజు' వంటి చిత్రాలు ఆయన సృజనాత్మకతకు నిలువుటద్దాలు. జోనర్‌తో సంబంధం లేని దర్శక మేధావి. ఏ జోనర్‌కైనా ప్రాణం పోయగల నేర్పు సింగీతం సొంతం. ప్రమాదంలో కాలు కోల్పోయిన నర్తకి సుధాచంద్రన్ జీవిత కథతో 'మయూరి' చిత్రాన్ని స్ఫూర్తిదాయక కావ్యంగా మలిచారు.
నందమూరి బాలకృష్ణతో తెలుగులో తొలి సైన్స్ ఫిక్షన్ చిత్రంగా 'ఆదిత్య 369'ను, జానపద వైభవానికి ప్రతీకగా 'భైరవద్వీపం'ను అందించారు. రాజేంద్రప్రసాద్‌ను మహిళగా చూపించిన 'మేడమ్', ఉద్యోగినుల సమస్యలపై వినోదాత్మకంగా తీసిన 'ఆడవాళ్లకు మాత్రమే, పౌరాణిక చిత్రం 'శ్రీకృష్ణార్జున విజయం'.. ఇలా ప్రతి చిత్రంలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు.

