Meenakshi Chaudhary: సినీ ప్రయాణం ముగింపు లేని పరుగు పందెం లాంటిది : మీనాక్షి చౌదరి
Meenakshi Chaudhary - Meenakshi Chaudhary
గుంటూరు కారం, సంక్రాంతికి వస్తున్నాం, అనగనగా ఒక రాజు ఇలా వరుసగా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావడం ఎలా ఉంది?
చాలా చాలా సంతోషంగా ఉంది. గతేడాది 'సంక్రాంతికి వస్తున్నాం'తో మరిచిపోలేని సంక్రాంతి విజయాన్ని అందుకున్నాను. ఇప్పుడు 'అనగనగా ఒక రాజు'తో మరోసారి ప్రేక్షకుల మనసు దోచుకుంటాననే నమ్మకం ఉంది.
మీ పాత్ర ఎలా ఉండబోతుంది?
ఈ సినిమాలో నా పాత్ర పేరు చారులత. సంపన్న కుటుంబంలో పుట్టిన తండ్రి గారాల పట్టి లాంటి పాత్ర. ఇంట్లో యువరాణిలా పెరుగుతుంది. చాలా మంచి అమ్మాయి. అమాయకంగా, సున్నితమైన మనసు కలిగి ఉంటుంది. క్యూట్ గా బిహేవ్ చేస్తుంది. నన్ను పూర్తి కామెడీ పాత్రలో చూడబోతున్నారు.
నవీన్ గారితో కలిసి పని చేయడం ఎలా ఉంది?
నవీన్ గారితో వర్క్ చేయడం అనేది.. సినిమా టీచింగ్ స్కూల్ లా ఉంది. సంక్రాంతికి వస్తున్నాంలో కామెడీ ఒకలా ఉంటే, నవీన్ కామెడీ మరోలా ఉంటుంది. పైగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా కామెడీగా ఉన్నా.. నా పాత్ర కాస్త సీరియస్ గా ఉంటుంది. కానీ, ఇందులో పూర్తిగా కామెడీగా ఉంటుంది. ఇందులో టైమింగ్ అనేది చాలా ముఖ్యం. పంచ్ డైలాగ్స్ ని కరెక్ట్ టైమింగ్ లో చెప్పడం అనేది ఛాలెంజింగ్ గా అనిపించింది. ఇప్పటివరకు నేను చేసిన పాత్రల్లో ఇదే ఎక్కువ ఛాలెంజింగ్ అని చెప్పవచ్చు. కామెడీ అనేది చాలా కష్టం. పైగా ఇందులో కామెడీ కామెడీ కొత్తగా ఉంటుంది. ఈ సినిమాలో భాగం కావడం సంతోషంగా ఉంది.
గోదావరి ప్రాంతంలో చిత్రీకరణ అనుభూతి ఎలా ఉంది?
చాలా బాగుంది. అక్కడి ప్రజలు బాగా చూసుకున్నారు. ఎన్నో వంటకాలు తిన్నాను. ఆలయాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను సందర్శించాను. అక్కడి ప్రజలు సినిమా అంటే ప్రత్యేక అభిమానం చూపిస్తుంటారు. గోదావరి ప్రాంతంలో షూటింగ్ అనుభూతిని ఎప్పటికీ మరిచిపోలేను.
సినిమాలలో నాయిక పాత్ర ప్రాధాన్యతపై మీ అభిప్రాయం?
ఇప్పుడు సినిమాలలో హీరోయిన్ పాత్రలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి ప్రాధాన్యత ఉన్న పాత్రలు లభించడం సంతోషంగా ఉంది. లక్కీ భాస్కర్ ఒక బాబుకి తల్లిగా కనిపించాను. సంక్రాంతికి వస్తున్నాంలో ఐపీఎస్ గా కనిపించాను. ఇప్పుడు పూర్తి భిన్నమైన పాత్రలో కనిపించనున్నాను. నటిగా నన్ను మరో కోణంలో చూపించే పాత్ర ఇది.
కథల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
నా దృష్టిలో కథే హీరో. కథ ఎలా ఉంది?, దర్శకుడు ఆ కథను, అందులోని పాత్రలను ఎలా చూపించబోతున్నారు అనేది ఆలోచిస్తాను. హీరో ఎవరనేది ముఖ్యం కాదు. కథకు, పాత్రకు ప్రాధాన్యం ఇస్తాను. ఈ పాత్ర నా కెరీర్ కి ఎలా ఉపయోగపడుతుంది అనేది చూస్తాను.
సినీ ప్రయాణం ఎలా ఉంది? సెటిల్ అయ్యాను అనుకుంటున్నారా?
నా దృష్టిలో సినీ ప్రయాణం అనేది ముగింపు లేని పరుగు పందెం లాంటిది. కొత్త కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. కాబట్టి విభిన్న పాత్రలు చేస్తూ నిరంతరం పరుగెడుతూనే ఉండాలి. నా వరకు సెటిల్ అయ్యాను, ఫలానా స్థానానికి చేరుకున్నాను లాంటి లెక్కలు ఉండవు. చేతిలో పని ఉండటం ముఖ్యమని భావిస్తాను.
తదుపరి ప్రాజెక్ట్ లు?
నాగ చైతన్య గారితో వృషకర్మ సినిమా చేస్తున్నాను. మరికొన్ని ఆసక్తికర కథలు కూడా ఉన్నాయి. ఆ చిత్రాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు త్వరలో వస్తాయి.
