గురువారం, 19 ఫిబ్రవరి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : శుక్రవారం, 16 జనవరి 2026 (16:07 IST)

Nagavamsi: ఆరేళ్ళ తర్వాత నాకు సంతృప్తిని ఇచ్చిన సంక్రాంతి ఇది: సూర్యదేవర నాగవంశీ

Naveen Polishetty, Meenakshi Chaudhary, Suryadevara Naga Vamsi
Naveen Polishetty, Meenakshi Chaudhary, Suryadevara Naga Vamsi
భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'అనగనగా ఒక రాజు' చిత్రం.. మొదటి ఆట నుంచే అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుంది. కడుపుబ్బా నవ్వించడమే కాకుండా, భావోద్వేగ సన్నివేశాలతో హృదయాలను హత్తుకొని.. అసలు సిసలైన పండగ సినిమాలా ఉందని.. 'అనగనగా ఒక రాజు' చూసిన ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.41.2 కోట్ల భారీ వసూళ్లతో సంచలనం సృష్టించింది ఈ చిత్రం. ప్రేక్షకుల సంపూర్ణ మద్దతుతో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురుస్తున్న నేపథ్యంలో.. తాజాగా చిత్ర బృందం థాంక్యూ మీట్ ని నిర్వహించి, ప్రేక్షకులకు కృతఙ్ఞతలు తెలిపింది.
 
నవీన్‌ పొలిశెట్టి మాట్లాడుతూ.. త్రివిక్రమ్ గారు, చినబాబు గారు ఈ సినిమా విషయంలో మమ్మల్ని నమ్మి ఎంతగానో ప్రోత్సహించారు. మేము చెప్పింది నమ్మి ఏ ఎపిసోడ్లు అయితే సినిమాలో ఉంచడానికి వారు అంగీకరించారో.. ఇప్పుడు ఆ ఎపిసోడ్లకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఫస్ట్ హాఫ్ లో మొదటి సన్నివేశం నుంచి ఇంటర్వెల్ వరకు ప్రేక్షకులు ఆగకుండా నవ్వుతున్నారు. సెకండ్ హాఫ్ లో పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ కి కూడా అద్భుతమైన స్పందన లభిస్తోంది. నా సినిమాలలో వినోదానికి పెద్ద పీట వేస్తుంటాను. అయితే ఇందులో వినోదంతో పాటు మంచి భావోద్వేగాలను కూడా అందించాలి అనుకున్నాము. నాకు రాజ్‌కుమార్ హిరానీ గారి సినిమాలంటే ఇష్టం. తెలుగులో అలాంటి సినిమా చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేశాము. శ్రీరాములు లాంటి ఒక మాస్ థియేటర్లో ఈ సినిమా చూశాం. ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ ని ఎంతలా ఎంజాయ్ చేశారో, ఎమోషనల్ సీన్లకు అదే స్థాయిలో చప్పట్లు వర్షం కురిపించారు. మా కథ అన్ని వర్గాలు ప్రేక్షకులకు చేరువ అయిందని మాకు అప్పుడే అనిపించింది. 
 
కథానాయకుడిగా నాకిది కేవలం నాలుగో సినిమా. నా మొదటి సంక్రాంతి సినిమా. పోటీలో పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ మా సినిమాని బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు. త్రివిక్రమ్ గారి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. మీ వెనకాల ఏదో శక్తి ఉందని. నా వెనకున్న శక్తి ప్రేక్షకులే. నా సినిమాలను మోసేది ప్రేక్షకులే. ఒక్క ఛాన్స్ అంటూ తిరిగే నాకు.. వరుసగా నాలుగు విజయాలు అందించిన ప్రతి తెలుగు కుటుంబానికి పేరుపేరునా కృతఙ్ఞతలు. ఇక ముందు కూడా మిమ్మల్ని అలరించడానికి నా శక్తికి మించి కృషి చేస్తాను. 
 
దర్శకుడిగా మారి సహకారం మరువలేనిది. రచనలోనూ తనదైన సహకారం అందించాడు. యాక్సిడెంట్ అయిపోయి ఈ కథ రాస్తున్న సమయంలో నేను కాస్త నిరుత్సాహంతో ఉన్నాను. ఆ సమయంలో మా కో-రైటర్ చిన్మయి నాలో ప్రేరణ నింపింది. మీనాక్షి చౌదరి, రావు రమేష్ గారు అద్భుతంగా నటించారు. అద్భుతమైన సంగీతం అందించిన  మిక్కీ జే మేయర్ గారికి ధన్యవాదాలు. 
 
ఒక రైటర్ కి కానీ, ఆర్టిస్ట్ కి కానీ, డైరెక్టర్ కి కానీ నమ్మి క్రియేటివ్ ఫ్రీడమ్ ఇస్తే అవుట్ పుట్ ఇలా ఉంటుంది. మమ్మల్ని నమ్మి మాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చిన నాగవంశీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతఙ్ఞతలు. సంక్రాంతికి మంచి సినిమా ఇచ్చారు, సినిమా అద్భుతంగా ఉందని.. ఎందరో సినీ ప్రముఖులు మాకు శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా 'అనగనగా ఒక రాజు' చూడనివారు వెంటనే టికెట్ బుక్ చేసుకొని చూడండి. అందరూ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు." అన్నారు.
 
నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. "ఆరేళ్ళ తర్వాత నాకు సంతృప్తిని ఇచ్చిన సంక్రాంతి ఇది. 2020లో వచ్చిన 'అల వైకుంఠపురములో' సినిమా తర్వాత ఆ స్థాయి తృప్తిని ఇచ్చిన సంక్రాంతి ఇది. ఈ సంక్రాంతికి ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు. ఈ సినిమా విషయంలో మీడియా నుంచి వచ్చిన అపారమైన మద్దతుకు ధన్యవాదాలు. ఎందరో సినీ నిర్మాతలు కూడా ఈ సినిమా ఆడాలని కోరుకున్నారు. అందరి ఆశీస్సులతోనే ఈ స్థాయి విజయం లభించింది. అలాగే, అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా ఎంతగానో మద్దతు తెలుపుతున్నారు. ఆ అభిమానులంతా సంతోషపడే భారీ ప్రకటన త్వరలోనే రాబోతుంది. 
 
ఈ సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు విడుదలైనప్పటికీ.. మా డిస్ట్రిబ్యూటర్లు అందరూ తగినన్ని థియేటర్లను మాకు కేటాయించి ఎంతో అండగా నిలిచారు. అందుకే రెండు రోజుల్లోనే రూ.41 కోట్ల గ్రాస్ రాబట్టగలిగింది ఈ చిత్రం. నన్ను, నవీన్ ని నమ్మి మా కోసం థియేటర్లు ఉంచిన డిస్ట్రిబ్యూటర్లకు కృతఙ్ఞతలు. 
 
సంక్రాంతి సమయంలో సినిమా విడుదల చేసి హిట్ కొట్టడం నాకు ప్రత్యేకమైనది. ఈ ప్రత్యేకమైన విజయంలో భాగమై, తన పూర్తి మద్దతు ఇచ్చిన నవీన్ కి ధన్యవాదాలు. ఏడాది పాటు వేరే సినిమాలు ఒప్పుకోకుండా.. మా సినిమాకు పూర్తి సమయం కేటాయించిన మీనాక్షి చౌదరికి కృతఙ్ఞతలు. స్క్రిప్ట్ పరంగా నాకు ఎలాంటి సందేహాలు ఉన్నా క్రియేటివ్ డైరెక్టర్ చిన్మయితో చర్చించేవాడిని. ఈ సినిమా విజయం సాధిస్తే.. మా బ్యానర్ లో దర్శకురాలిగా పరిచయం చేస్తానని మాట కూడా ఇచ్చాను. 
 
త్రివిక్రమ్ గారు ముందే ఈ సినిమా చూసి, బాగుందని చెప్పారు. ఆయన స్టాంప్ పడటం నాకెంతో ధైర్యాన్ని ఇచ్చింది. అయితే విడుదలకు ముందు కొంత ఒత్తిడికి లోనయ్యాను. ఆ సమయంలో మా బాబాయ్ రాధాకృష్ణ గారు నాకు మానసిక ధైర్యాన్ని ఇచ్చారు. పదేళ్లుగా నా సినీ ప్రయాణంలో వెన్నెముకగా నిలిచిన సుధీర్ కి, అలాగే నేనున్నానని భరోసా ఇచ్చిన మా వ్యాపార భాగస్వామి రామ్ గారికి ప్రత్యేక కృతఙ్ఞతలు. 
 
కథానాయిక మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. "మా సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. అందరూ మమ్మల్ని ప్రశంసిస్తున్నారు. టీమ్ లోని ప్రతి ఒక్కరి కృషి వల్లనే ఇది సాధ్యమైంది. ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు. నాకు ఈ సినిమా ప్రత్యేకమైనది. నన్ను ఇందులో భాగం చేసిన నాగవంశీ గారికి, నవీన్ గారికి కృతఙ్ఞతలు." అన్నారు.
 
దర్శకుడు మారి మాట్లాడుతూ.. సినిమా చూసినవారు.. వాళ్ళ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ కి ఈ సినిమా చూడమని చెబుతున్నారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న ఈ స్పందన.. మా అందరి కష్టాన్ని పూర్తిగా మర్చిపోయేలా చేసింది. నవీన్ గారికి వరుసగా నాలుగో విజయం దక్కడం సంతోషంగా ఉంది. ఆయన వల్లే నేను ఈ ప్రాజెక్ట్ లో భాగమయ్యాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన నాగవంశీ గారికి కృతఙ్ఞతలు. మా చిత్ర బృందం అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇది మా టీమ్ అందరికీ మరిచిపోలేని సంక్రాంతి." అన్నారు.
 
రచయిత్రి, క్రియేటర్ డైరెక్టర్ చిన్మయి మాట్లాడుతూ.. "మా కష్టాన్ని గుర్తించి, మాకు ఇంతటి విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు. కష్టపడితేనే విజయం వస్తుంది. కష్టపడకుండా విజయం రాదు. అదే ఈ చిత్ర కథ ద్వారా చెప్పాము. ఈ సినిమా కోసం మేమందరం ఎంతో కష్టపడ్డాను. ఆ కష్టమే ఇంతటి విజయానికి కారణమైంది." అన్నారు.
 
ఈ కార్యక్రమంలో ఛాయాగ్రాకుడు యువరాజు, కళా దర్శకుడు గాంధీ, నటుడు చంద్ర తదితరులు పాల్గొని చిత్ర విజయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ప్రేక్షకులకు కృతఙ్ఞతలు తెలిపారు.