ఈ రోజు మళ్లీ అదే నిజమని మీరు నిరూపించారు: మన శంకరవరప్రసాద్ గారు చిత్రంపై మెగాస్టార్
సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుని అత్యంత వేగంగా రూ. 300 కోట్ల వసూళ్లను రాబట్టిన చిత్రంగా మన శంకరవరప్రసాద్ గారు చిత్రం రికార్డ్ సృష్టించింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో చిత్రం విజయం పట్ల తన భావాలను పంచుకున్నారు.
ఆయన X లో పేర్కొంటూ... మన శంకరవరప్రసాద్ గారు చిత్రంకి ప్రేక్షక దేవుళ్లు చూపిస్తున్న ఆదరణ మరియు అపూర్వమైన విజయాన్ని చూస్తుంటే నా మనసు కృతజ్ఞత భావనతో నిండిపోతోంది. నేను ఎప్పుడూ చెప్పేది నమ్మేది ఒక్కటే. నా జీవితం మీ ప్రేమాభిమానాలతో ముడిపడింది. మీరు లేనిదే నేను లేను. ఈ రోజు మళ్లీ అదే నిజమని మీరు నిరూపించారు.
ఈ విజయం పూర్తిగా నా ప్రియమైన ప్రేక్షకులది, నా ప్రాణ సమానమైన అభిమానులది, నా డిస్ట్రిబ్యూటర్లది, సినిమాకు ప్రాణం పెట్టి పనిచేసిన ప్రతి ఒక్కరిది మరియు ముఖ్యంగా దశాబ్దాలుగా నా వెంట నిలబడి వున్నవారందరిది.
వెండితెర మీద నన్ను చూడగానే మీరు వేసే విజిల్స్, చప్పట్లే నన్ను నడిపించే నా శక్తి. రికార్డులు వస్తుంటాయి పోతుంటాయి. కానీ మీరు నాపై కురిపించే ప్రేమ మాత్రం శాశ్వతం.
ఈ బ్లాక్ బస్టర్ విజయం వెనకు ఎంతో కృషి చేసిన మా దర్శకుడు హిట్ మెషీన్ అనిల్ రావిపూడికి, నిర్మాతలు సాహు,సుస్మితలకు, అలాగే మొత్తం టీం అందరికీ నాపై మీరందరూ చూపిన అచంచలమైన నమ్మకానికి ధన్యవాదాలు. ఈ సంబరాన్ని అలాగే కొనసాగిద్దాం. మీ అందరికీ ప్రేమతో లవ్ యూ ఆల్ అని పేర్కొన్నారు.