ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్‌లోనే ఎందుకు ముగియాలి? కమల్ హాసన్
పశ్చిమాసియాలో సంక్షోభం నేపథ్యంలో దేశ ప్రజలకు పొదుపు మంత్రం పాటించాలని సూచించిన ప్రధాని మోదీ.. స్వయంగా వాటిని పాటిస్తున్నారు. తాజాగా ప్రముఖ నటుడు కమల్‌హాసన్ నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకుందామంటూ చిత్ర పరిశ్రమకు పిలుపునిచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియాలో లేఖ విడుదల చేశారు.
'పశ్చిమాసియాలో సంక్షోభం కారణంగా ఇంధనం, వాణిజ్యం, రవాణా, ఆర్థిక స్థిరత్వంపై ప్రపంచం ఒత్తిడిని ఎదుర్కొంటోంది. భారతీయ చిత్ర పరిశ్రమ కూడా ప్రభావితమవుతోంది. పెరుగుతున్న ఖర్చులు సినిమా నిర్మాణాన్ని మాత్రమే ప్రభావితం చేయవు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల కారణంగా మరికొన్ని నెలల్లో వినోదం కోసం వినియోగదారులు ఖర్చు చేసే విధానాలు కూడా మారొచ్చు. ఆ భారం అనివార్యంగా నిర్మాతలు, కార్మికులు, థియేటర్లు, పంపిణీదారులు, ఫైనాన్షియర్లు, ఇలా మొత్తం వ్యవస్థపై పడుతుంది. సినిమా రంగం అభివృద్ధి చెందాలంటే.. ఖర్చు చేసే ప్రతి రూపాయీ కేవలం భారీ స్థాయి ప్రదర్శనకే కాకుండా, సినిమాకే ఉపయోగపడేలా మనం జాగ్రత్తపడాలి.
సినిమా ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి సవరణ అయినా.. కార్మికుల వేతనాలు, భద్రత, గౌరవం, ఆహారం, రవాణా, వసతికి ఇబ్బంది కలిగించేలా ఉండకూడదు. ప్రతి ప్రేమకథ పారిస్‌లోనే ఎందుకు పుట్టాలి?ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్‌లోనే ఎందుకు ముగియాలి? అదృష్టవశాత్తూ ప్రేమకు విదేశీ మారకద్రవ్యం అవసరం లేదు. భారతీయ సినిమా పరిశ్రమంతా ఏకాభిప్రాయానికి రావడానికి ఇదే సరైన సమయం. ఆర్థిక సవాళ్లను ఎలా ఎదుర్కోవాలనే దానిపై చర్చ జరగాలి. నిర్మాతలు, నటీనటులు, దర్శకులు, యూనియన్లు, స్టూడియోలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు చర్చించాలి అని కమల్‌హాసన్ సూచించారు.
