1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Will Dhanush enter politics one day? Father Kasthuri Raja's comments trigger fresh speculations

విజయ్ తర్వాత ధనుష్ రాజకీయాల్లోకి వస్తారా? కస్తూరి రాజా ఏమంటున్నారు?

dhanush
కోలీవుడ్ హీరో విజయ్ రెండేళ్ల క్రితం తమిళగ వెట్రి కళకం (టీవీకే)ను స్థాపించి, 2026 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయభేరీ మోగించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. చిత్రపరిశ్రమకు చెందిన దివంగత నేతలైన ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రులు అయిన వారి జాబితాలో విజయ్ చోటు దక్కించుకున్నారు. 
 
ఈ నేపథ్యంలో మరో కోలీవుడ్ స్టార్ ధనుష్ భవిష్యత్‌లో రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు లేకపోలేదని ఆయన తండ్రి, దర్శక నటుడు కస్తూరి రాజా అభిప్రాయపడ్డారు. కోయంబత్తూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, 'రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఎవరికైనా ఆ హక్కు ఉంటుంది. భవిష్యత్తులో నా కుమారులు మాత్రమే కాదు, నా మనవళ్లు కూడా ఆ మార్గాన్ని ఎంచుకోవచ్చు' అని అన్నారు. దీంతో ఆయన సమాధానం ధనుష్ అభిమానుల్లో, రాజకీయ వర్గాల్లో సరికొత్త ఊహాగానాలకు తావిచ్చింది.
 
ఇదే వేదికపై తన కుటుంబ సినీ ప్రయాణాన్ని, పడిన కష్టాలను కస్తూరి రాజా గుర్తుచేసుకున్నారు. ధనుష్ అసలు పేరు వెంకటేష్ ప్రభు అని, సినిమాల్లోకి వచ్చిన తర్వాతే ఆ పేరు మార్చుకున్నాడని తెలిపారు. 'విమానాశ్రయాల్లో లేదా ఇతర బహిరంగ ప్రదేశాల్లో మా అబ్బాయిని అందరూ 'ధనుష్ కె. రాజా' అని పిలుస్తుంటే నాకు ఎంతో గర్వంగా, ఆనందంగా అనిపిస్తుంది' అని చెప్పారు. ప్రస్తుతం రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో ధనుష్ తన 55వ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. 
About Writer
ఠాగూర్