1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
  4. Did Rao Bahadur (produced by Mahesh Babu) impress? or not?- Rao Bahadur Review

Rao Bahadur Review: మహేష్ బాబు నిర్మించిన రావు బహదూర్ మెప్పించాడా? లేదా? - రావు బహదూర్ రివ్యూ

Rao Bahadur  poster
Rao Bahadur poster
సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్‌ జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్, ప్రముఖ దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వంలో, వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ కథానాయకుడిగా నటించిన సైకాలజికల్ డ్రామా 'రావు బహదూర్. వెంకటేష్ మహా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి & శరత్ చంద్ర నిర్మించారు. ఈ చిత్రం జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయింది. మరి ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ
ఆంగ్లేయుల కాలంలో రాజ కుటుంబానికి చెందిన వారికి రావు బహదూర్ బిరుదుతో గౌరవిస్తారు. ఆ పరంపంరలో రామప్ప రావు బహదూర్ (సత్య దేవ్) మందీ మార్బల్యం వున్నా ఒక్కడే ఎనిమిదేళ్ల పాటుగా ఒకే గదికి పరిమితమై చిత్రవిచిత్రమైన ఆలోచనలతో తనలోతానే ప్రశ్నించుకుంటుంటాడు. అతని భార్య రేణుక (దీపా థామస్) కూడా మరో గదిలో బంధీగా ఉంటుంది. రామప్ప పెద్ద కొడుకు లవనప్ప ఇంటినీ, తండ్రిని చూసుకుంటుంటాడు. తండ్రి ప్రవర్తనకు తట్టుకోలేక విదేశాలకు వెళ్ళాలని డిసైడ్ అవుతాడు. 
 
ఇదిలా వుండగా, రామప్పకు స్నేహితుడు  వైద్యుడు అయిన ఆచారి ట్రీట్ మెంట్ చేసేక్రమంలో రామప్పకు ప్రతీదీ అనుమానం అనే పెనుభూతంతో బాధపడుతుండడం తెలుసుకుని తనదైనశైలిలో ట్రీట్ మెంట్ చేస్తుంటాడు.అయితే ప్రతీసారి తన చిన్న కొడుకు కుసుమ గురించే కలవరిస్తుంటాడు రామప్ప. దానికి కారణం రెండో కొడుకు తనకు పుట్టలేదనేది గట్టి నమ్మకం. దానితో చనిపోయిన కుసుమ డి.ఎన్.ఎ. చేయించాలని లేదంటే..సమాధి చేసిన అతని ఎముకలు సేకరించి పోలీసు పర్యవేక్షణలో ఏది నిజం? ఏది అబద్దమో తేల్చాలని చూస్తాడు. ఆ తర్వాత ఏమయింది? అసలు ఇలా రామప్ప ప్రతీదానికి అనుమానం పెనుభూతంగా ఎందుకు మారాడు? చివరికి ఏమయింది? అనేది మిగిలిన సినిమా.
 
సమీక్ష:
పాండవులు ఎవరికి పుట్టారో తెలీదు. కానీ వారు రాజ్యం ఏలారు. కౌరవులు ఏలలేకకపోయారు. ఎందుకు? అనే పాయింట్ తో రావు బహదూర్ ప్రశ్నిస్తూ, తనతో తాను మాట్లాడుకుంటూ ప్రేక్షకుడిని కూడా ఇన్ వాల్వ్ చేసేలా కథను దర్శకుడు రాసుకున్నాడు. అలా ఓ రాజవంశానికి చెందిన వారసులకు చెందిన పాయింట్ బేస్ చేసుకుని కథను అల్లాడు. దానికితో పుట్టిన పిల్లలలో నలుపు, తెలుపు అనే తేడాలను కూడా పోల్చాడు. ఈ క్రమంలో సాగే కథ పాతదే అయినా ఒకే బిల్డింగ్, వ్యక్తి చుట్టూ కథనం నడపడం దర్శకుడి ప్రతిభకు నిదర్శనంగా చెప్పవచ్చు. 
 
ఈ క్రమంలో బ్యాక్ డ్రాప్, తీసిన విధానం మాత్రం సామాన్యుడికి ఏ మాత్రం అర్థంకాదు. మెచ్చూర్డ్ గా ఆలోచించే వారికి ఈ కథ చూస్తే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అందుకే భారతంలో కర్ణుడు కులం గురించి ప్రస్తావన వస్తే, దుర్యోధనుడి పాత్రచేత పలికించిన కులం.. గురించి చెప్పే డైలాగ్ లు అందరికీ తెలిసిందే. పైగా పెద్దవాళ్ళ పుట్టుక రహస్యం అంటూ సామెతలు కూడా వున్నాయి. ఈ సినిమాను అదే కోణంలో దర్శకుడు ముగింపు ఇస్తాడు.
 
భువనాలయం అనే రాజ కోట.. అందులో రామప్ప ఒకే గదిలో 8 ఏళ్ల పాటుగా ఉండటం.ఆయన చుట్టూ కథంతా తిరిగడం ఆ పాత్రలో వేరియేషన్స్ సత్యదేవ్ బాగా పండించాడు. కథ ఒసారి ఫ్లాష్ బ్యాక్ చూపుతూ మరోవైపు వర్తమానంకు మారుతుంది. కొంత మందికైనా ఇంట్రెస్టింగ్ ఫీల్ కలగొచ్చు. కుసుమప్ప, రామప్ప, రేణుక, ఆచారి, లవణప్ప, అచ్చమ్మ పాత్రలతో ఫస్ట్ హాఫ్ అంతా కాస్త గందరగోళంగానే సాగుతుంది. రేణుకతో రామప్ప ఉన్న సీన్లు కాస్త రిలీఫ్‌గానే అనిపిస్తాయి. 
 
ఈ ప్రాసెస్ లో రామప్పకు కలలో పూర్వీకులు కనిపించడం కుసుమ ఎవడికి పుట్టాడో కనుక్కోవడంతో సాంగ్ పరంగా చూపించాడు. ఇలా చిత్ర విచిత్రమైన పద్ధతిలో సినిమా కొనసాగుతుంది. ఇక క్లైమాక్స్‌లో మాత్రం ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ వస్తుంది. దర్శకుడు తన ట్విస్టులతో అందరినీ ఆశ్చర్యపరుస్తాడు.
 
సత్య దేవ్ వన్ మెన్ షో అని చెప్పుకోవచ్చు. రకరకాల గెటప్స్, లుక్స్ వాటికి తగ్గట్టుగా డబ్బింగ్‌లో వేరియేషన్స్.. ఇలా అన్నీ కలిపి సత్య దేవ్‌ తన టాలెంట్‌ను మరోసారి చూపించినట్టు అనిపిస్తుంది. ఆ తరువాత హీరోయిన్‌గా రేణుక పాత్రలో దీపా థామస్ ఓకే అనిపిస్తుంది. ఆమెకు అంత స్పేస్ దక్కలేదనిపిస్తుంది. ఇక మిగిలిన పాత్రల్లో ఆచారి, లవణ, కుసుమ, అచ్చమ్మ ఇలా అందరూ తమ పరిధి మేరకు ఆకట్టుకుంటారు. చివర్లో పోలీస్ ఆఫీసర్‌గా వచ్చిన నటుడు ఆనంద్ కూడా మెప్పిస్తాడు. మిగిలిన వారంతా కూడా తమ తమ పాత్రల వరకు ఓకే అనిపిస్తారు.
 
టెక్నికల్ గా.. విజువల్స్ చాలా కొత్తగా అనిపిస్తాయి. దాదాపు ఒకే సెట్‌లో, ఒకే చోటలో తీసినా కూడా చాలా వరకు డిఫరెంట్‌గా చూపించారు. కొన్ని యాంగిల్స్, చూపించిన తీరు కూడా చాలా కొత్తగా కనిపిస్తాయి. మ్యూజిక్ బాగుంటుంది. ఫైనల్ గా భ్రమలు, భయాలు, అనుమానాలు అంటూ రకరకాల పేర్లు పెట్టి ఓ సింపుల్ కథను తన నాలెడ్జ్‌ను, పైతాన్ని వెంకటేష్ మహా తెరకెక్కించాడు. ఇక నిర్మాతగా మహేష్ బాబు నిర్మించాడు కాబట్టి ఇప్పటివరకు రాని కొత్త ప్రయోగంగా ఆయన కితాబిచ్చాడు. సినిమా చూశాక ఆయన చెప్పింది నిజమే అనిపిస్తుంది. కానీ ఈ సినిమాను మూడు గంటలపాటు ఓపిగ్గా చూడగలిగితే ఫలితం దక్కుతుంది. లేదంటే ఇదొక వినూత్న ప్రయోగాత్మక చిత్రంగా నిలిచిపోతుంది.
రేటింగ్:2/5
About Writer
దేవీ
తర్వాతి కథనం
బాలన్ - ది బాయ్ సినిమాపై ప్రశంసలు కురిపించిన మణిరత్నం