'నాన్నకు ప్రేమతో...' జూ.ఎన్టీఆర్‌తో సుకుమార్ మైండ్ గేమ్... సంక్రాంతి సినిమా రివ్యూ

ntr
DV| Last Updated: బుధవారం, 13 జనవరి 2016 (19:14 IST)
నాన్నకు ప్రేమతో... నటీనటులు: ఎన్టీఆర్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ భారీ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, సితార, అమిత్‌, తాగుబోతు రమేష్‌, గిరి, నవీన్‌ తదితరులు.
 
టెక్నికల్‌ టీమ్‌- సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఫోటోగ్రఫీ: విజయ్‌ చక్రవర్తి, ఆర్ట్‌: రవీందర్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, పాటలు: చంద్రబోస్‌, డాన్స్‌: రాజు సుందరం, శేఖర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సుధీర్‌, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్‌.
 
సుకుమార్‌, ఎన్‌టిఆర్‌ కాంబినేషన్‌ అనగానే ఏదో బ్రహ్మాండం బద్దలవుతుందని భావిస్తే పొరపాటే. నాన్నకు ప్రేమతో... అనే టైటిల్‌ పెట్టినప్పుడే ఈ చిత్రం నాన్న సెంటిమెంట్‌తో తీశాడని తేల్చిచెప్పాడు. అయితే ఈ సినిమా ఇద్దరికీ ప్రెస్టీజియస్‌ మూవీ. దర్శకుడిగా సుకుమార్‌ '1' తర్వాత డిజాస్టర్‌ దర్శకుడిగా.. అంటే.. ఎవరికీ అర్థంకానివాడిగా కన్పించాడు. అలాగే ఎన్‌టిఆర్‌కు టెంపర్‌ తర్వాత ముందు.. ఏమీ కెరీర్‌ బాగోలేదు. ఇద్దరికీ హిట్‌ కావాల్సి ఉంది. అయినాసరే.. ఆ సక్సెస్‌ కోసం పామరుడికి నచ్చే విధంగా తీయకుండా.. మైండ్‌ గేమ్‌తో సినిమా తీశాడు. ఆల్‌రెడీ.. ఆర్యతోనే సుకుమార్‌ మైండ్‌గేమ్‌ ఏమిటో అందరికీ తెలిసింది. అందులో అల్లు అర్జున్‌ వుండటంతో చలాకీగా.. యూత్‌కు కనెక్ట్‌ అయ్యాడు. అయితే ఇక్కడ ఎన్‌టిఆర్‌తో మైండ్‌ గేమ్‌.. ఇది అందరికీ నచ్చుతుందో లేదో తర్వాత సంగతి. నాన్న సెంటిమెంట్‌ వుంది అది చాలు అన్నట్లుగా తీశామని చెప్పడం విశేషం. నటుడిగా 25 చిత్రాలు పూర్తిచేసుకున్న ఎన్‌టిఆర్‌కు.. సుకుమార్‌ ఎలాంటి సినిమా ఇచ్చాడో చూద్దాం. 
 
కథ : అభిరామ్‌ (ఎన్‌.టి.ఆర్‌) లండన్‌లో వ్యాపారవేత్త రమేష్‌ చంద్ర ప్రసాద్‌ (రాజేంద్ర ప్రసాద్‌) కొడుకు. రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌ అన్నయ్యలు. ఆఫీసు పనిమీద స్పెయిన్‌లో ఉన్న అభిరామ్‌కు తండ్రి ఆరోగ్యం బాలేదని తెలియగానే ఉన్నపళంగా బయలుదేరి వస్తాడు. అప్పటికే నెలల మనిషి అని డాక్టర్లు ధృవీకరిస్తారు. ఈలోగానే తన 20 ఏళ్ళ పగను తీర్చుకోవాలనుందని అభిరామ్‌కు అతని తండ్రి చెబుతాడు. వ్యాపారంలో నమ్మిన వ్యక్తే మోసం చేసి, తనను రోడ్డునకీడ్చాడని అది జీర్ణించుకోలేకపోతున్నానంటూ చెప్పగానే.. ఆ పనిమీద అభిరామ్‌ వుంటాడు. అయితే.. పగ తీర్చుకోవాల్సిన మనిషి ఆషామాషీ వ్యక్తికాదు. లండన్‌లో పలు వ్యాపారాలున్న బిలియనీర్‌ కృష్ణమూర్తి(జగపతిబాబు). అతనితో బిజినెస్‌ చేసేవారే.. ఆపాయింట్‌మెంట్‌ కోసం ఏడాదిపాటు వెయిట్‌ చేస్తుంటారు. అలాంటి వ్యక్తిని ఒక్క నెలలో జీరో చేసేస్తానని తండ్రి వద్ద శపథం చేసి.. తన మైండ్‌గేమ్‌తో అతని కుమార్తె ద్వారా ఎలా తండ్రి కోరిక నెరవేర్చాడనేది మిగిలిన సినిమా. 
 
పెర్‌ఫార్మెన్స్‌
సెటిల్‌ పెర్‌ఫార్మెన్స్‌ అంటుంటారు. అలా ప్రతి పాత్రను పరిమితమైన నటనతో సింపుల్‌గా వుండేలా దర్శకుడు జాగ్రత్త తీసుకున్నాడు. అటు ఎన్‌టిఆర్‌, ఇటు జగపతిబాబు కూడా అందులో ఒదిగిపోయారు. ఎన్‌ఆర్‌ఐ లుక్‌ కోసం ఆయనకు గెడ్డం, హెయిర్‌స్టయిల్‌ పెట్టారు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ గ్లామర్‌తో పాటు నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలో మెప్పించింది. ఎన్నారై పాత్ర కావడంతో మోడ్రన్‌ అండ్‌ స్టైలిష్‌ లుక్‌లో కనిపించడమే కాకుండా, చాలా కష్టపడి తన పాత్రకి తను డబ్బింగ్‌ చెప్పుకొని తన పాత్రకి పూర్తి న్యాయం చేసింది. ఇక ఎన్‌.టి.ఆర్‌‌కి సపోర్ట్‌ గా రాజీవ్‌ కనకాల, శ్రీనివాస్‌ అవసరాల తమ పాత్రలకి న్యాయం చేసారు. తాగుబోతు రమేష్‌, నవీన్‌‌లు ఓకే అనిపించారు. ఆశిష్‌ విద్యార్థి, మధుబాల కూడా పాత్రకు న్యాయం చేశారు.
 
 
సాంకేతిక విభాగం :
ఇలాంటి మైండ్‌గేమ్‌ చిత్రానికి సాంకేతిక నైపుణ్యం కూడా అలానే వుండాలి. లేదంటే తేలిపోతుంది. దర్శకుడి ఊహాల్లోని విజువల్స్‌‌ని తెరపైన ఒక ఫీల్‌‌గుడ్‌ పెయింటింగ్‌లా ఆవిష్కరించడంలో కెమెరామెన్‌ విజయ్‌ కె చక్రవర్తి పనితనం బాగుంది. నటీనటులను ప్రెజంట్‌ చేసిన విధానం, లొకేషన్స్‌ని చూపిన విధానం, ఎమోషనల్‌ సీన్స్‌లో మూడ్‌ ఇన్వాల్వ్‌ మెంట్‌ని కాప్చ్యూర్‌ చేసిన విధానం నేత్రానందాన్ని కలిగిస్తుంది. సంగీతపరంగా పాతవే కొట్టినా.. దేవీశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ పర్వాలేదు.   ఎస్‌. రవీందర్‌ ఆర్ట్‌ వర్క్‌ బాగుంది. లండన్‌లో వేసిన స్పెషల్‌ ఆఫీస్‌ సెట్‌ సందర్భాలకు సింక్‌ అయ్యేలా ఉంది. ఇక నవీన్‌ నూలి ఎడిటింగ్‌ ఫస్ట్‌ హాఫ్‌ పరంగా భలే ఉంది అనిపిస్తే, సెకండాఫ్‌‌ని మాత్రం బాగా సాగదీసాడు అనే ఫీలింగ్‌ ఉంటుంది. కానీ చివరి ప్రీ క్లైమాక్స్‌, ఎమోషనల్‌ సీన్స్‌‌ని మాత్రం బాగా ఎడిట్‌ చేసి కనెక్ట్‌ చేసాడు.
 
విశ్లేషణ:
ఒకరాజు ఏడుగురు కొడుకులు కథ.. అయినా.. దాన్ని చూపించే విధానం కొత్తగా వుండాలనేది సుకుమార్‌ లాంటి మేథావుల ఆలోచన. అందుకే తన మైండ్‌లోని కొత్తకొత్త ఆలోచనలకు పదును పెట్టాడు. నాన్న కోరిక కొడుకు తీరుస్తాడు. సన్నాఫ్‌ సత్యమూర్తిలో ఒక దర్శకుడు ఒకలా చెబితే... దూకుడులో.. మరో దర్శకుడు మరోలా చెప్పాడు. సుకుమార్‌ కూడా ఇంచుమించు అవే కాన్సెప్ట్‌ను కొత్తగా చెప్పాడు. అంతే తేడా. అయితే ఆ చెప్పే విధానం కామన్‌మ్యాన్‌కు కనెక్ట్ చేయగలడా? లేదా? అనేది ఆయన ఆలోచించలేదు. మల్టీప్లెక్స్‌ ప్రేక్షకులు, ఎన్‌ఆర్‌ఐలకు మాత్రమే కనెక్ట్‌ అయ్యేవిధంగా తీశాడు. అందుకే బ్యాక్‌డ్రాప్‌ కూడా లండన్‌నే ఎంచుకున్నాడు. సినిమా 95 శాతం అక్కడే షూటింగ్‌. నాన్న సెంటిమెంట్‌కు లండన్‌ అవసరమా? అనిపించవచ్చు. ఇక్కడే తీసి మెప్పించనూవచ్చు. శ్రీమంతుడులో మహేష్ బాబు కూడా ఇండియాలోనే చూపించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వుంటాయి.
 
మొదటి భాగంలో హీరోహీరోయిన్‌ ద్వారా తన మైండ్‌గేమ్‌తో ఆడుకోవడం బాగున్నా.. కొన్నిచోట్ల లాజిక్కులు కన్పించవు. హీరోయిన్‌ను కిడ్నాప్‌ చేసిన బ్యాచ్‌ నుంచి తప్పించుకుంటే హీరోయిన్‌ షూ పడిపోతుంది. దాన్ని ఉత్తరం వైపు పెట్టు అని అనడం.. ఆమె అలా వుంచడం.. ఆ బ్యాచ్‌ వచ్చి ఒకరికి తెలీకుండా ఒకరు తన్నుకుని పడిపోవడం.. వంటివి టూమచ్‌గా అనిపిస్తాయి. ఆ తర్వాత  సెకండాఫ్‌ ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ఒక గేమ్‌ మాత్రమే బాగుంటుంది. క్లైమాక్స్‌ సీన్‌లో ఎన్‌టిఆర్‌ అరగంట ఏడ్చాడు.. అని దర్శకుడు బయట చెప్పినా.. సీన్‌ పరంగా అంత సీన్‌లేదనిపిస్తుంది. 
 
సంగీతపరంగా దేవీశ్రీ ప్రసాద్‌ కొత్తబాణీలు లేకపోయినా.. రెండు పాటలు పర్వాలేదనిపిస్తాయి. లవ్‌ ట్రాక్‌, పాటలతో సాగిపోతుంది మొదటిభాగం. సింపుల్‌ స్టోరీ లైన్‌ మొదటి మైనస్‌గా చెప్పుకోవాలి.  రెగ్యులర్‌ అండ్‌ రొటీన్‌గా అనిపిస్తుంది. కథ ఇదే అని తెలిసిపోవడం వలన సినిమా ఇలానే ఉంటుంది అని ఆడియన్స్‌ ఆశిస్తారు. ప్రేక్షకులు అనుకున్న ఊహల మాదిరిగానే కథనం జరగడం కూసింత బోర్‌ కొడుతుంది. ముఖ్యంగా సెకండాఫ్‌‌ని ఎక్కువ సేపు నడపడం వలన, కథనంలో కొత్తగా చెప్పేదేమీ లేక, హీరోయిన్‌ ట్రాక్‌‌ని ఎక్కువ పెట్టడం వలన బాగా సాగదీస్తున్నారు అనే ఫీలింగ్‌ ఆడియన్స్‌‌కి ఎక్కువ కలుగుతుంది.
 
దర్శకుడిగా సుకుమార్‌ తను ఇంటలెక్చువల్‌ అనే విషయం తెలిసిందే. అతను అంచనాలను విదేశీ ఆడియన్స్‌ అందుకోగలరు. ఆంధ్ర ప్రేక్షకులు చాలామంది కనెక్ట్‌ కారు. పప్పుసాంబారు, చికెన్‌, మటన్‌ తినే వారికి బర్గర్లు.. బ్రీచర్లుతో గడపటం ఎంత కష్టమో.. కామన్‌మేన్‌కు ఈ సినిమా చూడటం అంతే కష్టం. తన తండ్రి చనిపోయాక.. కథను రాసుకుని చెప్పానన్న సుకుమార్‌.. అతని తండ్రి కథేమోనని అనుమానం కూడా వస్తుంది. కథలో పట్టు లేకపోయినా.. కథనంతో ఆకట్టుకోవాలని చూశాడు. 
 
అది పూర్తిస్థాయిలో సక్సెస్‌ అవ్వలేదు. సినిమాలో ఆకట్టుకునే లవ్‌ ట్రాక్‌తో పాటు అందరూ వావ్‌ అనేలా కొన్ని థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ కూడా ఉన్నాయి. వాటన్నిటినీ ఒక ఎమోషనల్‌ క్లైమాక్స్‌ సీన్‌‌కి మిక్స్‌ చేసి చెప్పడం సినిమాకి హైలైట్‌. అయితే ఒక్కమాట చెప్పుకోవచ్చు.. తెలుగు సినిమా అంటే.. హీరో, విలన్లు అరుపులు కేకలు. కమేడియన్‌ల గోల లేకుండా హాయిగా ఇంగ్లీషు సినిమా చూసిన ఫీలింగ్‌ కలిగే వారికి ఈ సినిమా నచ్చుతుంది. వారుకూడా ఓపిగ్గా చివరివరకు వుంటే. సో.. సంక్రాంతి బరిలో వచ్చిన తొలి సినిమా ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాల్సిందే.
 
 
రేటింగ్‌: 3/5దీనిపై మరింత చదవండి :