1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
  4. Purushah Movie Review: An Entertaining Portrayal of a Married Couple's Struggles

Purushah Review: భార్యాభర్తల కష్టాలను వినోదాత్మకంగా చెప్పిన పురుషః చిత్రం రివ్యూ-

Prushaha relese poster
Prushaha relese poster
కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల సరస్వతి సమర్పణలో బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘పురుష:’. పవన్ కళ్యాణ్‌ బత్తుల హీరోగా పరిచయం అయ్యారు. ఇంకా, సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌ ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమాను మే 22 విడుదల. అయితే ఒక రోజు ముందే పురుషః స్పెషల్ ప్రీమియర్ షోలు పడ్డాయి. వీరు వులవల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి పురుష: అనే టైటిల్ తో ఆసక్తి కలిగించిన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
 
కథ:
గోవింద్ (పవన్ కల్యాణ్), సత్తిబాబు (సప్తగిరి), శ్రీను (కసిరెడ్డి రాజ్ కుమార్) చిన్ననాటి స్నేహితులు. అలాంటి వారు పెండ్లిచేసుకున్నాక వారి భార్యలు కమల (రాయంచ), లక్ష్మి (హాసిని), గీత (విషిక) తమకు విడాకులు కావాలని కోర్టును ఆశ్రయిస్తారు. కానీ వారి భార్యలు కోర్టు విచారణకు హాజరుకారు. ఇక విసుగుచెందిన జడ్జి అసలు గొడవ ఏంటో చెప్పమని భర్తలను అడుగుతాడు. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళతారు.
 
ఈ ముగ్గురు కలిసి తమ చిన్ననాటి దోస్త్ కిస్సు (వెన్నెల కిషోర్) పెళ్లికి వెళ్తారు. అక్కడ కిస్సు రాసుకున్న పాత డైరీలో వీరి చిన్ననాటి చిలిపి పనులు, పాత ప్రేమకథలు చూసి భార్యలు అనుమానంతో గొడవపడతారు. ఆ పెళ్లికి వచ్చిన దేవిక (అనైరా గుప్తా) అనే అమ్మాయితో కూడా తమ భర్తలు గడిపారని భార్యలు నమ్ముతారు. ఇది విన్న జడ్జి ఏం తీర్పు ఇచ్చాడు. అసలు డైరీ వారి భార్యలు ఎలా చూడగలిగారు. చివరికి ఏమయింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 
సమీక్ష:
ఇలాంటి చిలిపి కథలు గతంలో వచ్చినా ఈ పురష: మాత్రం ఇప్పటితరానికి కనెక్ట్ అయ్యేట్లు దర్శకుడు తీయగలిగాడు. భార్యాభర్తలు అన్నాక వారి కష్టాలు చూసేవాడికి వినోదాన్ని కలిగిస్తాయి. ఈ పాయింట్ ను డైరెక్టర్ వీరు వులవల పట్టుకుని సినిమా తీశాడు. ప్రథమార్ధం భార్యాభర్తల ఇగోలు, కోర్టు సీన్లు, స్నేహితుల మధ్య వచ్చే కామెడీ ట్రాక్‌లతో చకచకా సాగిపోతుంది.
 
అయితే ఇటువంటి కథలోని పాత్రలు వర్తమానంలో జరుగుతున్నట్లుగా కనిపిస్తాయి. ప్రధానంగా  కిస్సు పెళ్లిలో అసలు నిజాలు తెలిశాక ప్రేక్షకుడికి ఇంట్రెస్ట్ కలిగిస్తుంది.  అదేవిధంగా పమ్మి సాయి పాత్ర చెప్పే డైలాగులు నవ్విస్తూనే సమాజంలో వాస్తవాలను చూపించినట్లు వుంటుంది. అయితే పాయింట్ బాగున్నా చిన్ననాటి సంగతులు చిలిపిపనులు భార్యబర్తల ఇగోలతో విడాకుల అంశం అనేదానిని ఇంకా బలంగా చూపించాల్సింది. 
 
యాక్షన్ సన్నివేశాలు కూడా కొత్తదనం కోసం చేసినా పారడీ సీన్లు అంతగా పారలేదనే చెప్పాలి. సినిమాలో వచ్చే ఐటెమ్ సాంగ్ పర్వాలేదనిపిస్తుంది. కొన్ని సీన్లు సూడో ఫెమినిస్టుల భావాలను నొప్పించేలా ఉన్నా, సాధారణ ప్రేక్షకుడికి మాత్రం నవ్వులు పూయిస్తాయి. క్లైమాక్స్ ట్విస్ట్ ఊహించని విధంగా ఆకట్టుకుంటుంది.
 
అంతా కొత్త వారితో దర్శకుడు చేసిన ప్రయోగం అభినందనీయమే. ఈ చిత్రంతో పరిచయమైన పవన్ కల్యాణ్ పాత్రకు సూటయ్యాడు. నటనలో ఈజీనెస్ కనిపించింది. ఇక మిగిలిన పాత్రల గురించి చెప్పాల్సిన పనిలేదు. వెన్నెల కిషోర్, కసిరెడ్డి రాజ్ కుమార్ టైమింగ్‌తో నవ్వుల పువ్వులు పూయించారు. ఇంకోవైపు సప్తగిరి, విటివి గణేష్ తమ సన్నివేశాలకు రక్తికట్టించారు. కథానాయికగా నటించిన రాయంచ ఎమోషన్స్ చక్కగా ఆవిష్కరించింది. ఇక బ్రెజిల్ నటి గ్యాబి రాక్ క్యూట్ నటనతో మెప్పిస్తుంది.
 
సాంకేతికంగా చూస్తే, సినిమాటోగ్రఫీ విజువల్స్ ఆకట్టుకున్నాయి. పాటలు వినసొంపుగా వున్నాయి. అయితే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్మరింత బాగా వుంటే సరిపోయేది. ఎడిటింగ్ లో కొన్ని సరిచేసుకోవాల్సింది. కొత్త బేనర్ అయినా నిర్మాణ విలువలు స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. డైరెక్టర్ గా తన సత్తాను నిరూపించుకున్నాడు. చిన్నపాటి లోపాలను సరిచేసుకుంటే పెద్దస్థాయి దర్శకుడు కాగలడు. కొత్త వారితో తీసిన ఈ సినిమా నచ్చి నిర్మించిన నిర్మాణ సంస్థను అభినందించాల్సిందే. ఎటువంటి వల్గారిటీ లేకుండా తీసిన సినిమా ఇది. యువతకు కనెక్ట్ అవుతుందని చెప్పాలి.
రేటింగ్ : 3/5
About Writer
దేవీ
తర్వాతి కథనం
ఏవండీ నాకు కేన్సర్ అని డాక్టర్ చెప్పారు: భార్య మాటకు కుప్పకూలిన Family man నటుడు షరీబ్ హష్మి