గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By DV
Last Modified: శుక్రవారం, 29 మే 2015 (19:03 IST)

సూర్య కొత్త ప్రయోగం... దెయ్యాలతో స్నేహం చేసే 'రాక్షసుడు'... రివ్యూ రిపోర్ట్

రాక్షసుడు నటీనటులు : సూర్య, నయనతార, ప్రణిత.. తదితరులు; నిర్మాత : జ్ఞానవేల్‌ రాజా, మిర్యాల రాజబాబు, ఎం.ఎస్‌.ఆర్‌, సంగీతం : యువన్‌ శంకర్‌ రాజా, దర్శకత్వం : వెంకట్‌ ప్రభు.
 
తమిళ ఆడియన్స్‌కు తెలుగు ఆడియన్స్‌కు తేడా వుంటుంది. అక్కడ కొన్ని హిట్‌ అయినవి ఇక్కడ ఆడవు. ఇక్కడ ఆడనివి అక్కడ బాగుంటాయి. ఎక్కువగా సెంటిమెంట్‌, నమ్మకాలు, మూఢనమ్మకాలు, దెయ్యాలు, ఆత్మలు వంటి కాన్సెప్ట్‌లు అటూఇటూగా అక్కడా ఇక్కడా బాగానే వుంటాయి. గజనీ, యముడు, వంటి హిట్స్‌ తర్వాత సూర్య చేసిన ఏ ప్రయోగం సక్సెస్‌కాలేదు. మంచి ప్రమోగం అనే పేరు తెచ్చుకున్నాడు. సెవెన్త్‌ సెన్స్‌, సికందర్‌ కొద్దిగా నిరాశపర్చినా.. ఈసారి 'రాక్షసుడు'గా వచ్చాడు. అయితే థ్రిల్లర్‌ అంశాన్ని తీసుకోవడం ఈ చిత్రంలోని ప్రత్యేకత. మరి ఇందులో ఏం చెప్పాడో చూద్దాం.
 
కథగా చెప్పాలంటే...
మధుసూదన్‌ అలియాస్‌ మాస్‌(సూర్య) అతని చిన్ననాటి ఫ్రెండ్‌ జెట్టు(ప్రేంజీ అమరెన్‌) కలిసి చిన్నచిన్న మోసాలు, దొంగతనాలు చేసుకుంటూ లైఫ్‌‌ని ఎంజాయ్‌ చేస్తుంటారు. పెద్దమొత్తంలో డబ్బు దొంగిలించి పారిపోతుండగా కారు ఏక్స్‌డెంట్‌ జరిగి.. మాస్‌ స్నేహితుడు చనిపోతాడు. అయితే తను వెంటే వున్నట్లు కన్పిస్తాడు. ఆయనతో పాటు మరో పదిమంది కన్పిస్తారు. వీరంతా చనిపోయిన వారే. ఆత్మలుగా వచ్చి మాస్‌ సాయం అడుగుతారు. వారి కోరికలు తీరిస్తే మాస్‌ కోరిక వీరు తీరుస్తారు. 
 
అయితే ముందుగా మాస్‌ కోరికను వారు తీర్చేక్రమంలో మాస్‌లాగా వుండే వ్యక్తి సడన్‌‌గా శివ కుమార్‌(సూర్య) ఎంటర్‌ అవుతాడు. అక్కడి నుంచి మాస్‌ లైఫ్‌ మొత్తం మారిపోతుంది. తెలియకుండానే మాస్‌ పలు మర్డర్‌ కేసుల్లో, ఒక రాబరీ కేసులో ఇరుక్కుంటాడు. ఆ తర్వాత తను ఏంచేస్తున్నాడో అంటూ అందరినీ నిలదీస్తారు. వారు మాస్‌కు తెలీని నిజాన్ని చెబుతారు. అది ఏమిటి? తర్వాత మాస్‌ ఏంచేశాడు? అన్నది కథ.
 
పెర్‌ఫార్మెన్స్‌....
సూర్య  రెండు డిఫరెంట్‌ రోల్స్‌ చేసాడు. మాస్‌ పాత్రలో పూర్తి మాస్‌ లుక్‌‌లోకనిపిస్తూ, దొంగ అయిన తన పాత్ర స్వభావాన్ని కళ్ళలో బాగా పలికించాడు. యాక్షన్‌ ఎపిసోడ్స్‌ చాలా బాగా చేసాడు. సెకండాఫ్‌‌లో ఎమోషనల్‌ సీన్‌లో తను చూపిన పెర్ఫార్మన్స్‌ ఆడియన్స్‌‌కి బాగా కనెక్ట్‌ అవుతుంది. ఇకపోతే శివగా సీరియస్‌ రోల్లో మెప్పించాడు. ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌‌లో శివ చాలా స్టైలిష్‌‌గా కనిపించాడు. నయనతార పాత్ర సినిమాకి పెద్ద హెల్ప్‌ కాదు. నయనతార లుక్స్‌ పరంగా మాత్రం చాలా బాగుంది. 
 
ప్రణీత చేసింది చాలా చిన్నపాత్ర అయినా ఆ పాత్ర సినిమాకి ముఖ్యం. ఉన్నంతలో మంచి నటనని కనబరిచింది. ఇక సినిమాలో మేజర్‌‌లో చేసిన ప్రేంజీ అమరెన్‌ సినిమా అంతా మాస్‌ పాత్రతో ట్రావెల్‌ అవుతూ మంచి పెర్ఫార్మన్స్‌ ఇచ్చాడు. ఇక పోలీసు ఆఫీసర్‌గా పార్తీబన్‌ కన్పిస్తాడు. చకచకా తన పని తాను చేసుకుపోతుంటాడు. విలన్లుగా దర్శకుడు, నటుడు అయిన సముద్ర ఖని, శరత్‌ నటన బాగుంది. సినిమాలో ఆత్మలుగా నటించిన పలువురు నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.  దెయ్యాలను వెళ్ళగొట్టే ఎపిసోడ్‌లో బ్రహ్మానందం బాగా నవ్విస్తాడు. 
 
సాంకేతిక విభాగం :
సాంకేతిక విభాగంలో ఫర్వాలేదనిపించిన అంశాలు కొన్ని ఉన్నాయి. అందులో ముందుగా యువన్‌ శంకర్‌ రాజా మ్యూజిక్‌. యువన్‌ అందించిన పాటలు తెలుగులో పెద్దగా వర్కవుట్‌ అవ్వలేదు. కానీ బ్యాక్‌‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ మాత్రం బాగుంది. సినిమాకి బాగా హెల్ప్‌ అయ్యింది. ఇక రాజశేఖర్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. ఇచ్చిన ప్రతి లొకేషన్‌‌ని కథకి తగ్గట్టు బాగా చూపించాడు.

నటీనటుల్ని కూడా బాగా ప్రెజెంట్‌ చేసాడు. పాటల్ని బాగా రిచ్‌‌గా గ్రాండ్‌ విజువల్స్‌‌తో షూట్‌ చేసాడు. ఎడిటర్‌ ప్రవీణ్‌ ఇంకాస్త కేర్‌ తీసుకొని వుంటే ఫస్ట్‌ హాఫ్‌‌లో చాలా వరకూ కట్‌ చేసి ఉండొచ్చు. రెండున్నర గంటల సినిమాగా కాకుండా, 2 గంటల 10 నిమిషాలలో కంప్లీట్‌ చేయగలిగి ఉంటే ఇంకాస్త బెటర్‌‌గా ఉండేది. శశాంక్‌ వెన్నలకంటి డైలాగ్స్‌ డీసెంట్‌‌గా ఉన్నాయి. సెల్వ కంపోజ్‌ చేసిన యాక్షన్‌ ఎపిసోడ్స్‌ చాలా బాగున్నాయి.
 
విశ్లేషణ:
సూర్య చేసిన రెండు పాత్రలు ప్రేక్షకుల్ని థ్రిల్‌ చేస్తాయి. ఆఖరి అరగంట బాగుంటుంది. అలాగే మొదట్లో అరగంట పాత్రల్ని పరిచయం చేయడంతో సరిపోతుంది. వచ్చిన సన్నివేశాలు అందరినీ బాగా ఆకట్టుకోవడమే కాకుండా, ఆడియన్స్‌‌ని కథలోకి తీసుకెళ్తాయి. ఆ తర్వాత ఇంటర్వెల్‌ బాంగ్‌‌లో శివ పాత్రని పరిచయం చేసే విధానం, అక్కడ వచ్చే థ్రిల్స్‌ బాగున్నాయి. సెకండాఫ్‌‌లో డైరెక్టర్‌ రివీల్‌ చేసిన రెండు, మూడు థ్రిల్స్‌ బాగానే పేలాయి. ముఖ్యంగా ఇంటర్వెల్‌ వరకూ ఆడియన్స్‌‌కి బోర్‌ కల్గించాడు. కథ ఎటు వెళుతుందో అర్థంకాదు. 
 
ఓ ఆంగ్ల సినిమా చూసినట్లుంటుంది. ఆత్మలు, కోరికలు నెరవేర్చడం అనేవి ఆ ట్రెండ్‌కు తగినట్లుగా చాలా చిత్రాలు వచ్చాయి. వాటిని తమిళంలో చూపించడం కొత్తగా చేసేలా దర్శకుడు ట్రీట్‌ చేసుకున్నాడు. సెకండాఫ్‌‌లో కూడా అక్కడక్కడా కొన్నికొన్ని ఎలిమెంట్స్‌ ఆకట్టుకుంటూ ఉంటాయి తప్ప ఆద్యంతం ఆసక్తికరంగా ఉండదు. ఆత్మలు అనే పాయింట్‌‌ని కలిపి చెప్పాలనుకున్నారు. ఇటీవలే తెలుగులో కొరియన్‌ సినిమా స్పూర్తితో 'వారధి'తో ఈ సినిమా పోలి ఉంటుంది. అదేమో లవ్‌ స్టోరీ, ఇదేమో రివెంజ్‌ స్టోరీ. అంతే తేడా.. ఆత్మల కాన్సెప్ట్‌కు గ్రాఫిక్స్‌ కీలకం. పిల్లల కోసమనేమోకానీ సినిమాలో భయపెట్టడానికి వాడిన గ్రాఫిక్స్‌ భయపట్టెలేకపోయాయి.
 
రేటింగ్: 2.5/5