Soumith Rao, Shreyasi Sen
నటీనటులు: సౌమిత్ రావు, శ్రేయాసి సేన్, హర్ష చెముడు, సుప్రియా ఐసోలా, రూపేష్ మారాపు, జీవన్ కుమార్, గురురాజ్, సిద్ధార్థ్ గొల్లపూడి, అనాల సుశ్మిత తదితరులు
సాంకేతికత: సినిమాటోగ్రఫీ: దిలీప్ కే కుమార్, సంగీతం: కళ్యాణ్ నాయక్, నిర్మాతలు: రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పోలాడి, సాయి కే వెన్నం, దర్శకత్వం - సౌమిత్ పోలాడి, సాయి కే వెన్నం.
నటుడిగా మెగాస్టార్ చిరంజీవిని స్పూర్తిగా తీసుకుని హీరోతోపాటు దర్శకుడిగా, రచయితగా కూడా అనుభవం సంపాదించిన సౌమిత్ రావు నిలవే చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యాడు. శ్రేయాసి సేన్ నాయికగా నటించింది. అందరూ కొత్తవాళ్లతో చేసిన ఈ సినిమా ప్రేమకథలో కె.జి.ఎప్. లాంటిదని స్టేట్ మెంట్ ఇచ్చారు. మరి ఈ సినిమా నేడే విడుదలైంది. ఎలా వుందో చూద్దాం.
కథ:
అర్జున్ (సౌమిత్ రావు) ఓ అనాథ. ఓ యాడ్ ఏజెన్సీలో స్టిల్ ఫొటోగ్రాఫర్ గా పనిచేస్తుంటాడు. అతని సహచరుడు స్నేహితుడు(వైవా హర్ష). హర్షకు పెళ్లయి కుటుంబం వున్నా తనకు ఓ కుటుంబం ఎందుకు దొరకడంలేదనే బెంగతో ఒంటరిగా ఫీలయి ఆత్మహత్యకు ప్రిపేర్ అవుతాడు. సరిగ్గా ఆ టైంలోఅపార్ట్ మెంట్ లో అవతల ఎదురు ఫ్లాట్ లో అతిథి(శ్రేయాసి సేన్) చూసి బతకాలనుకుంటాడు. అతని నీడద్వారా సుసైడ్ చేసుకుంటున్నాడని తెలిసి ఆమె ఇతన్ని కాపాడుతుంది. అందుకు కారణం ఆమె కూడా ఒంటరితనం అనుభవిస్తుంది. అలా ఇద్దరి ఒంటరివాళ్ళు ఒక్కటవుతారు. పెండ్లిచేసుకోకుండా సంసారం చేస్తారు. గర్భిణీగా వున్నప్పుడు ఆమె తల్లిదండ్రుల్ని రమ్మని లెటర్ రాస్తాడు అర్జున్. ఇది తెలిసిన అథితి సైకోలా మారిపోతుంది. తన గర్బాన్నే వదులుకోవాలను చూస్తుంది. ఆ తర్వాత ఏమి జరిగింది? అసలు అతిథికి తల్లిదండ్రులంటే ఆమెకు ఎందుకు ద్వేషం. సైకోలా ఆమె ఎందుకు బిహేవ్ చేసింది. ఆమె గతం ఏమిటి? అనేది మిగిలిన కథ.
సమీక్ష:
కథగా ఒక్క ముక్కలో చెప్పాలంటే. తల్లిలా చూసుకునేలా భార్యకావాలనుకునే ఓ అనాథ. తల్లిదండ్రులున్నా అనాథగా బతకాలనుకునే అమ్మాయి కథే ఈ సినిమా. వీరిద్దరి ఎమోషన్స్ మధ్య చక్కటి ప్రేమకథను రాసుకుని దర్శకుడు చేసిన ప్రయోగం. ఎక్కడా హంగులూ ఆర్భాటాలు లేకుండా. సౌండ్ పొల్యూషన్ లేకుండా చక్కటి సాహిత్యం, సంగీతం కలగలిపి, పొందికగా అర్థవంతమైన సంభాషణలతో కూడిన సినిమా ఇది. దీనికి స్నేహితులైన సౌమిత్ రావు, సాయి వెన్నం దర్శకులు.
హీరో నటుడిపరంగా అన్ని ఎమోషన్స్ బాగా చూపించాడు. అమాయకత్వంతోపాటు విషాదం, కోపం, ఆశ్చర్యం, బాధ, హ్యపీనెస్ అన్ని కలగలిపి ఒకే సినిమాలో తను చూపించాడు. తెలుగు తెరకు మరో నటుడు పరిచయం అయ్యాడనే చెప్పాలి. అదే సందర్భంలో కొన్ని సార్లు హీరోను చూస్తుంటే, వర్ధమాన కథానాయకులు అఖిల్, నిఖిల్ కూడా గుర్తుకు వస్తారు. సాంగ్ లో వచ్చే రాజరికం గెటప్ లో పురాణకథలకు మంచి నటుడు దొరికాయడనిపిస్తుంది.
నాయిక గురించి చెప్పాలంటే, జీవితంలో తాను అనుకున్నవారి చేతిలో మోసపోయిన భావాలకు అనుగుణంగా ఆమె మొఖకవళికలు, నటన వున్నాయి. ఆ క్రమంలో ఇప్పటి కాలంపు జెంజీ తరహా మెంటాలటీని ఆమె పాత్రలో దర్శకుడు చూపించాడు. హీరోయిన్ సంగీత ట్రూప్ లో సంగీత దర్శకుడు కళ్యాణ్ నాయక్ తోపాటు పలువురు నటించారు. ఎక్కడా కొత్తవారిని నటన తెలియని వారిని చూశామనే ఫీలింగ్ కనిపించదు. అందరూ న్యాయం చేశారు.
ఇక ద్వితియార్థం కథనం ఎమోషనల్‌గా సాగుతుంది. అతిథి ప్లాష్‌బ్యాక్ స్టోరీ గుండెను బరువెక్కిస్తుంది. అయితే ఈ క్రమంలో వచ్చే కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాపై అంచనాలు లేవు కానీ థియేటర్స్‌కి వెళ్లి చూసిన వారికి మాత్రం గొప్ప అనుభూతిని అందిస్తుసింది.
మాటలు, సంగీతం, పాటలు గురించి వేలెత్తి చూపించడానికి లేవు. ఇంచుమించు 11 పాటలున్నా అవి వున్నట్లు ప్రేక్షకుడు కూడా గమనించడు. అలా సన్నివేశపరంగా తీశారు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. మొత్తంగా చూస్తే కొత్తవారితో చేసిన ప్రయోగం అభినందించదగిందే. అయితే ఇలాంటి సంగీతభరిత ప్రేమకథను చూడాలంటే ఇప్పటి తరానికి కాస్త ఓపికకావాలి. అది మొదటి భాగంలో కనిపిస్తుంది. ఇక ద్వితీయార్థం నుంచి కథలో లీనమైపోతారు కాబట్టి చిన్నపాటి లోపాలున్నా అందరూ చూడతగ్గ చిత్రంగా చెప్పవచ్చు.
రేటింగ్: 2.75/5