1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
  4. Review of the movie 'Nagabandham': A film made for Sanatana Dharma that failed to impress.

Nagabandham Review: సనాతన ధర్మం కోసం తీసినా ఆకట్టుకోని నాగబంధం మూవీ రివ్యూ

Nagabandham poster
Nagabandham poster
పెదకాపు` ఫేమ్‌ విరాట్‌ కర్ణ హీరోగా నటించిన చిత్రం నాగబంధం. కార్తికేయ చిత్ర నిర్మాత అభిషేక్‌ నామా దర్శకుడిగా మారిన చిత్రమిది. నభా నటేష్‌, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటించగా, నిక్‌ స్టూడియోస్‌, అభిషేక్‌ పిక్చర్స్ పతాకాలపై  కిశోర్‌ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి  నిర్మించారు. జగపతిబాబు, మహేష్‌ మంజ్రేకర్‌, రిషభ్‌ సావ్నీ, రామచంద్రరాజు, అనసూయ తదితరులు నటించారు. నేడు శుక్రవారం (జులై 3న) సినిమా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా వుందో తెలుసుకుందాం.
 
కథ
పూర్వకాలంనుంచీ మరణాన్ని జయించేందుకు రాక్షసులు చేస్తున్న మారణహోమం గురించి కథలు విన్నాం. ఇప్పుడు కలికాలంలోనూ అలాంటివారు మనిషి రూపంలో వుంటే ఎలా వుంటుందనేది క్లుప్తంగా కథ. అలా మరణాన్ని శాసించే స్థాయికి వెళ్ళాలంటే ఇండియాలోని రంగనాథ స్వామి ఆలయంలోని విష్ణువు నాభిలో వున్న బ్రహ్మ కమలాన్ని దక్కించుకోవాలి. ఆ క్రమంలో ఆర్కియాలజిస్ట్ లయిన ఇద్దరు విదేశీయులు 1962లో ఇండియాలో శోధిస్తారు. అందులో ఒకరు బ్రహ్మకమలం గురించి వున్న బుక్ ను తీసుకువస్తాడు. దానిని ఢిల్లీలోని ఆర్కియాలజిస్ట్ ప్రభాకర్(జగపతిబాబు) కు అందజేస్తారు. అది తెలిసిన మరో ఆర్కియాలజిస్ట్ తన టీమ్ తో వచ్చి బుక్ దక్కించుకోవడం కోసం మారణ హోమం చేస్తాడు.
 
ఇక ఆ తర్వాత కథ రంగనాథ స్వామి ఆలయం ప్రాంతంలో పూజారీ, ప్రజల కథగా మారిపోయింది. ఆ ఊరిలో అనాథ అయిన రుద్ర (విరాట్ కర్ణ)కి తనను చేరదీసిన కుటుంబంలోని చెల్లి అంటే ప్రాణం. ఆమె పెళ్లి విషయంలో మేనత్త(అనసూయ) తన కొడుకుతో వివాహం చేయాలనుకుంటుంది. కానీ ఆమె వేరే వ్యక్తిని ప్రేమించడం పెండ్లివరకు వెళుతుంది. ఇది సహించని అనసూయ కొడుకు శత్రువర్గంతో చేతులు కలిపి ఆ కుటుంబాన్ని పెండ్లి మండపంలో ఊచకోత కోస్తాడు. ఆ తర్వాత గుడిలో వుండే బ్రహ్మ కమలాన్ని ఛేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తాడు. దానిని విరాట్ కర్ణ ఎదుర్కొంటాడు. ఆ తరుణంలో పూజారి కుటుంబానికి చెందిన పార్వతి(నభా నటేష్‌) మోసం చేసి కమలాన్ని దక్కించుకుంటుంది. అది ట్విస్ట్. ఆ తర్వాత ఏమి జరిగింది? అనేది మిగిలిన సినిమా.
 
సమీక్ష:
ఈ సినిమా మొత్తంగా చూస్తే, చాలా రిచ్ నెస్, భారీ తారాగణం కనిపిస్తుంది. పద్మనాభఆలయం పోలిన సెట్ వేసి కళ్ళకు ఇంపుగా చూపించారు. అయితే కథలో సరైన బలం లేక నిస్సత్తువగా అనిపిస్తుంది. కథానాయకుడి పాత్రలో బలం కనిపించదు. రంగస్వామి (పద్మనాభ) ఆలయంలో ప్రత్యేకంగా పూజలుచేసే కుటుంబానికి చెందిన వ్యక్తి. కానీ తన అత్త అనసూయ కుటుంబానికి బాకీ వున్నాడని చెప్పడం, దానితో చెల్లి పెండ్లి తన కొడుక్కు చేసుకోవాలనుకోవడం, నువ్వు మా కులానికి చెందినవాడివి కాదని అనడం వంటి సన్నివేశాలు సరిగ్గా పండలేదు.
 
సనాతన ధర్మం పేరుతో ప్రజల్లో దేవుడిపై ఉన్న నమ్మకాన్ని కలిగించాలని చెప్పే క్రమంలో కొన్ని సార్లు తప్పడగులు వేస్తున్నారు దర్శక నిర్మాతలు. సరిగ్గా ఈ సినిమాలోనూ అదే జరిగింది. చాలా వరకూ సన్నివేశాలు ఇరికించినట్లుగా వున్నాయి. పద్మకలమం కోసం రక్షణగా వుండే  నాగబంధం ఛేదించి శత్రువులు దక్కించుకోవడం అనేది ప్రధాన పాయింట్. అయితే ఈ కథలోకి హీరో ఎలా వచ్చాడు? ఎలా బ్రహ్మకమలానికి రక్షణగా నిలిచాడనేది సినిమా. ప్రారంభం నుంచి కథ విషయంలో ఒక క్లారిటీ లేదు. ఎక్కడా ప్రేక్షకుడు ఫీలయ్యే అంశాలే వుండవు. ఎంత పెద్ద కథఅయినా ఎమోషన్స్ ముఖ్యం. అది ఇందులో లోపించింది. అందుకు దర్శకుడు లోపం స్పష్టంగా కనిపిస్తుంది.
 
నాగసాధువుగా హీరోని చూపించే విధానంలోనూ సెకండాఫ్ లో సరైన క్లారిటీ లేదు. కథ చెప్పాలి కనుక 17వ శతాబ్దంలో ముస్లింలు ఆలయంపై దాడిచేసి కమలాన్ని దక్కించుకునే క్రమంలో చనిపోవడం. అప్పుడు ఆ కమలాన్ని కాపాడిన వారు మళ్ళీ ఈ కాలంలో పుట్టి దానికోసం పోరాడటం వంటివి కట్టుకథలా అనిపిస్తాయి. ఈ విషయంలో మరింత అవగాహన దర్శకుడికి లోపించింది. ఇక ప్రధాన విలన్ బ్రహ్మకమలం కోసం ఎంట్రీ ఇచ్చి ఫ్యామిలీ మొత్తాన్ని చంపేయడంతోపాటు క్లయిమాక్స్ లో నాగబంధాన్ని ఛేదించే క్రమంలో ఊచకోత కోయడం అనేది టూ మచ్‌ గా అనిపిస్తాయి.
 
ఫస్టాఫ్‌లో కథగా పెద్దగా లేదు, కానీ విజువల్స్ బాగున్నాయి. పాటలు బాగున్నాయి. కానీ హీరో పాడే పాటలో క్లారిటీ లేదు.  హీరో ఫ్లాష్‌ బ్యాక్‌ ఉంటుంది. అది ఎప్పుడు జరిగిందో క్లారిటీ లేదు. ఇక క్లైమాక్స్ యాక్షన్‌ ఎపిసోడ్‌ అరగంటకు పైగానే ఉంటుంది. దాని చుట్టూనేకథని నడించాడు. ఫ్లాష్‌ బ్యాక్‌, ప్రజెంట్‌ సీన్లు మిక్స్ అయి వస్తుంటాయి. అవి ఆడియెన్స్ కి ఏమాత్రం కనెక్ట్ కాలేదు. మొత్తంగా చూస్తే, కార్తికేయ, అఖండ సినిమాలను స్పూర్తిగా తీసుకుని చేసినట్లుగా వుంది.
 
యాక్షన్ సన్నివేశాల్లో సతాతన ధర్మం గురించి చిన్నపిల్ల సైతం మాట్లాడేవిధానం క్లాస్ పీకినట్లుగా వుంది. అదే విధంగా జగపతిబాబు పాత్ర కూడా వుంటుంది. అటువంటి డైలాగ్స్, యాక్షన్ సీన్స్ నిడివి తగ్గించాల్సింది.
 
నటనపరంగా, రుద్రగా విరాట్‌ కర్ణ నటన బాగుంది.యాక్షన్‌ సీన్లలో బాగా చేశాడు. పార్వతిగా నభా నటేష్‌ ద్విపాత్రాభినయం చేసి మెప్పించింది. ఆమె పాత్రలోని ట్విస్ట్ బాగుంది. ఆర్కియాలజిస్ట్ గా జగపతిబాబు పాత్ర బాగుంది. ఆయన పాత్రలోని ట్విస్ట్ కూడా మెప్పించింది. బైరాగీగా గరుడ రామ్‌ అదరగొట్టాడు.  ఐశ్వర్య మీనన్‌, అనసూయ, మురళీ శర్మ వంటి వారు తమ పాత్ర పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విలన్‌గా రిషబ్‌ కొత్తగా కనిపించాడు.
 
సాంకేతికంగా చూస్తే, సినిమాకి మ్యూజిక్‌ ప్లస్‌గా నిలుస్తుంది. జునైడ్‌ కుమార్‌, అభిషిక్త్, కొత్తపల్లి అందించిన పాటలు, బీజీఎం తో పాటు. సౌందర్‌రాజన్‌ కెమెరా వర్క్ విజువల్స్ గ్రాండియర్‌గా ఉన్నాయి. వీఎఫ్‌ఎక్స్ కూడా బాగున్నా కొన్ని చోట్లు తేలిపోయాయి. అశోక్‌ కోరలత్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌ కూడా బాగుంది. సినిమా గ్రాండియర్‌ గా ఉంది. దర్శకుడు అభిషేక్‌ నామా ఎంచుకున్న కథలో క్లారిటీ మిస్‌ అయ్యింది. ఏం చెప్పాలనుకున్నారనేది క్లారిటీ లేదు. స్క్రీన్‌ ప్లే పరంగానూ మిస్టేక్స్ ఉన్నాయి. ఒక సీన్‌కి, మరో సీన్‌కి సంబంధం లేదు, మొత్తంగా సినిమా పరంగా ఏమాత్రం ఆకట్టుకోలేదనే చెప్పాలి.
రేటింగ్‌ : 2/5
About Writer
దేవీ
తర్వాతి కథనం
మళ్లీ పెళ్లి చేసుకోనున్న బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్