1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
  4. Sunitha's son Akash Goparaju's 'Kotha Malupu' movie review.

Kotha Malupu review : సునీత కుమారుడు ఆకాష్ గోపరాజు కొత్త మలుపు మూవీ రివ్యూ

Akash, Bhairavi Ardhya
Akash, Bhairavi Ardhya
నటీనటులు: ఆకాష్, భైరవి ఆర్థ్యా, రఘుబాబు, పృథ్వీ, ప్రభావతి, సిద్ధు, మహేందర్, ఐశ్వర్య తదితరులు
సాంకేతికత: ఛాయాగ్రహణం:  జవహర్ రెడ్డి, సుమంత్ కచర్ల, సంగీతం: యశ్వంత్ నాగ్, నిర్మాత: తాటి బాలకృష్ణ, దర్శకత్వం: శివ కేసనకుర్తి, బ్యానర్: తథాస్తు క్రియేషన్స్
 
సర్కారు నౌకరి చిత్రంతో సునీత కుమారుడు ఆకాష్ గోపరాజు హీరోగా వెండితెరకు పరిచయం అయ్యారు. తాజాగా తన రెండో సినిమా కొత్త మలుపు తో ముందుకు వచ్చాడు. కోనసీమ నేపథ్యంలో రొమాంటిక్ లవ్ అండ్ సస్పెన్స్ గా తెరకెక్కిందని ట్రైలర్ ను బట్టి చూస్తే అర్థమయింది. ఈ సినిమాకు దర్శకుడు శివ వరప్రసాద్ కేశనకుర్తి  తెరకెక్కించారు. ఈ శుక్రవారబమే విడుదలైన ఈ సినిమా ఎలా వుందో తెలుసుకుందాం.
 
కథ:
ఈనాటి కుర్రాడి కథ ఇది. ఎంజాయ్ చేయడమే గోల్ గా భావించి స్నేహితులతో కలిసి హైదరాబాద్‌లో హ్యాపీగా వుంటాడు  కమల్ (ఆకాష్). ఓ వివాహ వేడుక కోసం తూర్పు గోదావరి జిల్లాలోని గ్రామానికి వెళ్తాడు. అక్కడ చలాకీగా కనిపించే వరలక్ష్మి (భైరవి ఆర్థ్యా) అనే యువతిని చూసి ఆకర్షితుడవుతాడు. ఇదిలా వుండగా, ఓ రాత్రి అనుకోని పరిస్థితుల్లో కమల్‌ను ఓ యువతి కాపాడుతుంది. ఆమె ఎవరో తెలియదు. తనను ఆదుకున్న ఆ అమ్మాయి కోసం కమల్ కు వరలక్ష్మి అతనికి తోడుగా నిలుస్తుంది. ఈ ప్రయాణంలో ఇద్దరి మధ్య ప్రేమ మొలకెత్తుతుంది.
 
ఈ ప్రేమ సాఫీగా సాగుతుండగా, తాను వెతుకుతున్న అమ్మాయి మరెవరో కాదనీ, తన వెంట వున్న వరలక్మి అనే రహస్యం తెలుసుకుంటాడు. పైగా ఆమె మరో వ్యక్తితో ప్రేమలో వుందని గ్రహిస్తాడు. దానితో కమల్ రకరకాలుగా ఆలోచనలో పడతాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ ఏమయింది? ఆమెతో ఫొటోలో వున్న యువకుడు ఎవరు? అనేది మిగిలిన సినిమా.
 
సమీక్ష:
ఇది సహజమైన ప్రేమకథే. అయితే తనవెంటే వున్న అమ్మాయి కోసం తెలీకుండా వెతకడం అనేది చిత్రంలోని ఆసక్తికర అంశం. దానితోపాటు ప్రేమికుల మధ్య అపార్థాలు, నమ్మకం, గతం-వర్తమానం మధ్య జరిగే భావోద్వేగ సంఘర్షణను దర్శకుడు శివ కేసనకుర్తి చక్కగా తెరపై ఆవిష్కరించారు. కథకు సరిపడా గ్రామీణ నేపథ్యం కాబట్టి జవహర్ రెడ్డి, సుమంత్ కచర్ల తన కెమెరా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చాలా నాచురల్ గా తెరకెక్కించారు. 
 
ఇలాంటి గ్రామీణ ప్రేమ కథు గతంలో వచ్చినా హీరో హీరోయిన్ల మధ్య సాగే సన్నివేశాలు సరికొత్తగా అనుభూతినిస్తాయి. పల్లెటూరి వాతావరణం, పెళ్లి సందడి, స్నేహితుల సరదా సంభాషణలు, హీరో-హీరోయిన్ల మధ్య నడిచే సన్నివేశాలు సహజంగా అనిపించాయి.  మొదటి భాగం అంతా సరదాగా సాగుతుంది. గ్రామీణ శైలి సంభాషణలు సరదాగా అనిపిస్తాయి.
 
ఇక ద్వితీయ భాగంలో కథ మలుపు తిప్పాలి కాబట్టి భావోద్వేగాల వైపు మలుపు తిరుగుతుంది. ప్రేమలో అనుమానం ఎంత ప్రమాదకరమో, ఒకరి గతాన్ని పట్టుకుని తీర్పు చెప్పడం ఎంత తప్పో చెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే సందేశం నేటి యువతకు ఎంతో అవసరమైన అంశాన్ని స్పృశిస్తుంది. "ప్రతి ఒక్కరికీ ఒక గతం ఉంటుంది. కానీ మన జీవితంలోకి వచ్చిన వ్యక్తి వర్తమానాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. గతాన్ని తవ్వుకుంటూ భవిష్యత్తును పాడు చేసుకోవద్దు" అనే భావాన్ని దర్శకుడు హృద్యంగా చెప్పగలిగారు.
 
కమల్ పాత్రలో ఆకాష్ ఈజీగా నటించేశాడు. ఆల్ రెడీ సర్కారి నౌకరి లో తన నటన కనబరిచాడు. ఇక ఈ సినిమా మొదటి భాగంలో ఎనర్జిటిక్ యువకుడిగా, రెండో భాగంలో ప్రేమలో తడబడే యువకుడిగా భావోద్వేగాలను సమర్థంగా పలికించాడు. స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటుంది. నాయికపరంగా చూసుకుంటే, పాత్రకు సరిపడా భైరవి నటనలో సహజత్వం కనిపిస్తుంది. గ్రామీణ యువతిగా అమాయకత్వం, ప్రేమలోని భావోద్వేగాలను ఎంతో సహజంగా వ్యక్తపరిచింది. క్లైమాక్స్‌లో ఆమె నటన ప్రత్యేకంగా నిలుస్తుంది.
 
అలాగే మిగిలిన నటీనటుల్లో  రఘుబాబు, పృథ్వీ:  గోదావరి యాసలో వచ్చే డైలాగులు, టైమింగ్ ప్రేక్షకులను నవ్విస్తాయి. గోపి పాత్రలో సిద్ధు మంచి నటన కనబరిచాడు. కథకు అవసరమైన మలుపును తీసుకొచ్చే పాత్రను సమర్థంగా పోషించాడు.
 
సాంకేతికపరంగా చూస్తే, సన్నివేశాలపరంగా  యశ్వంత్ నాగ్ అందించిన పాటలు కథకు తగ్గట్టుగా ఉన్నాయి. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ భావోద్వేగ సన్నివేశాలను మరింత బలపరిచింది. ఇక నిర్మాణసంస్థ తథాస్తు క్రియేషన్స్ పరిధిమేరకు రిచ్ నెస్ గా మలిచారు. మొత్తంగా చూస్తే,  గోదావరి ప్రాంతం అందాలు, విజువల్స్,  కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే కథనంతోపాటు  క్లైమాక్స్ సందేశం ఆక్టుటకుంది. 
ఇంత సినిమాలో ఎక్కడో చోట లోపాలుండడ సహజం. కొన్నిచోట్ల సాగదీత సన్నివేశాలున్నాయి. అదే విధంగా  అపార్థాల చుట్టూ తిరిగే డ్రామా కొంతవరకు ఊహించదగ్గదిగా ఉంటుంది. కొంచెం ట్విస్ట్ మెయింటేన్ చేస్తే బాగుండేది. ఫైనల్ గా  ప్రేమలో నమ్మకం ఎంత ముఖ్యమో ఇప్పటి తరానికి తెలియజేసే ప్రయత్నం బాగుంది. 
రేటింగ్: 3/5
About Writer
దేవీ
తర్వాతి కథనం
Deva Katta : ఇతర సినిమాకు పనిచేయడంలేదంటూ దర్శకుడు దేవా కట్టా స్పష్టత