జీవితంలో కొత్త కాంతులను నింపే ఉగాది

WD
తెలుగువారి మొదటి పండుగ ఉగాది. దీనితో మన నూతన సంవత్సరం ఆరంభమవుతుంది. ఇది మనకేకాక చాంద్రమానం అనుసరించే కన్నడీయులకు, మహారాష్ట్రులకు కూడా సంవత్సరాది. ఇది చైత్రశుద్ద పాడ్యమినాడు వస్తుంది.

నిజానికి ఉగాదికి యుగాది అనేది పేరు. యుగాది అంటే నూతన యుగానికి, నూతన కాలానికి ఆది అని అర్ధం. అయితే ఈ యుగాది క్రమంగా ఉగాది అని వాడుకలోకి వచ్చింది. కర్నాటకులు, మహారాష్ట్రులు దీనిని యుగాది అనే వ్యవహరిస్తారు. యుగం అంటే ఒక కాల విభాగము. వైశాఖ శుద్ద తృతీయనాడు కృతయుగము, కార్తిక శుద్ద నవమినాడు త్రేతాయుగము, భాద్రపద బహుళ త్రయోదశినాడు ద్వాపరయుగము, మాఘ బహుళ అమావాస్యనాడు కలియుగము ప్రారంభమవుతాయని, చంద్ర సూర్య గురువులకు కొన్ని నక్షత్రములతో సంబంధము కలిగినప్పుడు యుగాదులు ఏర్పడుతాయని విష్ణు పురాణ భారతాదులు చెపుతున్నాయి.

ఈ యుగాదులలో మానవులు పుణ్యస్నానం చేసి, భగవంతునికి పూజ చేసి, పేదలకు దానధర్మాలు చేసి, జప తపాదులు చేసి పుణ్యఫలం పొందాలని మహాభారతం చెబుతున్నది. ఇక ఈ సంవత్సరాది నిర్ణయమూ మన పురాణేతిహాసాలలో అనేక విధాలుగా ఉంది.

ఒకప్పుడు ఆశ్వయుజ పూర్ణిమ, ఆశ్వయుజ అమావాస్య, కార్తీక పూర్ణిమ, మార్గశిర సంక్రాంతి, పుష్య సంక్రాంతి, మాఘ పూర్ణిమ, మాఘ బహుళాష్టమి, వసంత పంచమి, పాల్గుణ పూర్ణిమ - హూలి పండుగ, చైత్రవుద్ద పాడ్యమి, వైశాఖ పూర్ణిమ- ఇలా పెక్కు విధాలుగా ఉంది. దీనికి కారణము ఋతు పరివర్తనము. వసంత కాలమున ప్రకృతిలో నవచైతన్యము మోసులెత్తుటను బట్టి, ఈ కాలమే నూతన సంవత్సరారంభమని పూర్వులు అభిప్రాయపడినారు.

వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT|
క్రీస్తుశకం నాల్గవ శతాబ్దంలో ఉన్న జ్యోతిర్వేత్త వరాహమిహిరాచార్యుడు వసంత విషువత్కాలము వివిధ నక్షత్రములకు చలించి అశ్వినీ నక్షత్రాదిలో సంభవించుట గ్రహించి, మన ప్రాచీన దేవమానదిన ప్రారంభకాలమైన ఉత్తరాయణ పుణ్యకాలాదే వసంత కాలమని వసంత విషువత్కాలం నిర్ణయించి మాస ఋతు సామరస్యం సాధించి సంవత్సరాది వసంతకాలంలోనే అని నిర్ణయించినాడు. అప్పటి నుంచి చైత్రమాసమే సంవత్సరాదిగా పరిగణిస్తున్నాము.


దీనిపై మరింత చదవండి :