ప్రేమ భావానికి అక్షరాభిషేకం

WD
భావానికి భాష వస్తే... అవును భావానికి భాష వస్తే మీ మనసులోని ప్రేమ ఉప్పెనలా పొంగుతుంది. గుండెల్లో గూడు కట్టుకున్న ప్రేమ భావం అక్షర రూపమై వెలికి వచ్చి మేఘమై వర్షిస్తుంది. మీ హృదయపు తీరాన సేద తీరుతున్న మీ ప్రియురాలిని నిలువెల్లా తడిపేసి ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది. ఊహించని ఆ పరిణామం మీ ప్రియురాలి మనసులోనూ గిలిగింతలు పెడుతుంది.

ఇంకేముంది... సిగ్గుల మొగ్గైపోయిన ఆ చిన్నది కాస్తా మీ బుగ్గలపై ముద్దుల కుంపటి రాజేస్తుంది. అదిగో అప్పుడే మీ ప్రేమ రాజ్యంలోకి వసంతం వచ్చి చేరుతుంది. ఆ వసంతం సాక్షిగా మొక్కై ఉన్న మీ ప్రేమ మహా వృక్షమై వికసిస్తుంది. అందుకే ఈ వాలంటైన్స్ డే రోజున మీలోని భావాలను కాస్త తట్టిలేపండి. ఎప్పుడో నిద్రలోకి జారుకున్న మీలోని కవిగారిని కాసేపు బయటకు పిలవండి.

ఇన్నాళ్లూ మీ ప్రియురాలిపై మీ మనసులో గూడుకట్టుకున్న ప్రేమ భావాన్ని సదరు కవిగారు అక్షరబద్దం చేసి అందిస్తారు. అపురూపమైన ఆ కావ్యాన్ని మీ ప్రియురాలి దోసిళ్లలో పూల వర్షంలా కురిపించండి. ఇన్నాళ్లూ మీలోని ప్రేమను కళ్లలో మాత్రమే చూచిన మీ ప్రేయసి ఒక్కసారిగా మీలోని కవిని కూడా చూసి తప్పకుండా ఆశ్చర్యపోతుంది.

అంతేనా మీలోని భావుకతను మెచ్చుకుంటూ మీకో గొప్ప బహుమతిని సైతం ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అలా మీ ప్రేయసినుంచి మీరు తీసుకున్న ఆ బహుమతి మరో వాలంటైన్స్ డే వరకు తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుంది. రోజువారీ ఎస్‌ఎంఎస్‌లు, షాపుల్లో దొరికే గ్రీటింగ్ కార్డులు ఖరీదైన బహుమతులు ఎన్ని ఉన్నా... మనసు తెరచి మీరు రాసిన ఆ నాలుగు అక్షరాలు ఎంతగా ఆమెను అల్లుకుంటాయో ఒక్కసారి ప్రయత్నించి చూడండి.

అంత తీరిక మాకెక్కడిదీ ఈ స్పీడు కాలంలో అంటారా...? అబ్బే అంత నిరాశ వద్దు బాసూ... మదిలోని భావాన్ని చెప్పేందుకు మీరేమీ కవులు కానక్కరలేదు. కంటికి నచ్చిన ఓ గ్రీటింగ్ కార్డు తీసుకోండి... దాన్ని అలాగే కవర్లో పెట్టి మీ ప్రేయసికి ఇచ్చేయకుండా... మనసు దోచిన ప్రేయసికి... నను గెలిచిన నెచ్చెలికి... నేనిస్తున్న చిరు బహుమతి... అంటూ ఏదైనా ఓ వాక్యం రాసే ప్రయత్నం చేయండి. అప్పుడు ఆ రంగుల గ్రీటింగ్ కార్డుకు సైతం ఓ నిండుదనం వస్తుంది.

చెప్పే వాక్యం ముఖ్యం కాదు... చెప్పాలనుకున్న మీ మనసు ఆమెకు తప్పకుండా నచ్చుతుంది. అందరిలా ఐలవ్యూ అని చెప్పేస్తేనో... హ్యాపీ వాలంటైన్స్ డే అని పలికేస్తోనో... మీకంటూ ఏం ప్రత్యేకత ఉంటుంది. అందుకే అద్భుతమైన ఈరోజున అంతకంటే అద్భుతమైన మీ ప్రేమకు అక్షరరూపం ఇవ్వండి. ఎందుకంటే బహుమతులు ఎప్పటికై పాతబడవచ్చు. కానీ అక్షరం నిత్య యవ్వనం. దాన్ని చూచిన ప్రతిసారీ అది అప్పుడే విచ్చుకున్న మల్లెలా మనసుకు ఆనందాన్ని ఇస్తుంది. మనిషికి ఆహ్లాదాన్ని పంచుతుంది.

Munibabu|
సో... ఈ వాలంటైన్స్ డే వేళ మీలోని భావుకతకు కాస్త పదును పెట్టండి. మీ అక్షర కుసుమాలతో మీ ప్రేయసికి అభిషేకం చేయండి. మీ కవితలు మెచ్చిన మీ ప్రేయసి అంతులేని ఆనందంతో మిమ్మల్ని చుట్టేసిందనుకోండి... ఇక ఆ సంతోషం గురించి వేరే చెప్పక్కరలేదు. అలాకాక మీ కవితలు చదివి మిమ్మల్ని ఆటపట్టించిందనుకోండి... కాసేపు బుంగమూతి పెట్టి చిన్నబుచ్చుకున్నట్టు నటించండి. ఇంకేముంది మీ విచార వదనాన్ని చూచి మంచులా కరిగిపోయిన మీ ప్రేయసి మిమ్మల్ని నిలువెల్లా అల్లుకోవడం గ్యారంటీ... సో... ఎలా చూచినా మీకు ఓ గొప్ప అనుభూతి మాత్రం సొంతం. కాబట్టి ఓ పెన్నూ, పేపరూ తీసుకుని అలా ఊహల్లోకి వెళ్లిపోండి... బెస్టాఫ్ లక్.


దీనిపై మరింత చదవండి :