యెంకి వంటి పిల్ల లేదోయ్.. లేదోయ్..!!

FILE
నండూరి సుబ్బారావు రచించిన "యెంకి పాటలు" ప్రధానంగా ప్రణయానికి సంబంధించిన పాటలు. తొలి వలపులు, దాంపత్య జీవితానురాగాలు, కలిసిన ఊసులు, బాసలు, వేదనలు, విరహాలు ఈ పాటల్లో చక్కని పదాలలో కూర్చబడ్డాయి. నండూరి వారి యెంకి పల్లె పడుచు. కల్లా కపటం ఎరుగనిది.

జానపద సౌందర్యానికి ప్రతీక అయినట్టిది, ధర్మబద్ధమైన హద్దులలోనే ప్రేమించే నండూరి ఎంకి, ఆమె ప్రేమకు దాసుడైన నాయుడు బావలు .. ఈనాటి నిజమైన ప్రేయసీ ప్రియులకు ఆదర్శనీయులు. అందుకే నండూరి, యెంకి వంటి పిల్ల లేదోయ్... లేదోయ్ అంటున్నారు...

యెంకి వొంటి పిల్ల లేదోయ్ లేదోయ్..
యెంకి నా వొంకింక రాదోయ్ రాదోయ్...
మెళ్లో పూసల పేరు తల్లో పూవుల పేరు
కళ్ళెత్తితే సాలు కనకాబి సేకాలు...!

యెంకి వొంటి పిల్ల లేదోయ్ లేదోయ్..
యెంకి నా వొంకింక రాదోయ్ రాదోయ్...
సెక్కిట సిన్నీ మచ్చ సాపితే సాలదు లచ్చ
వొక్క నవ్వే యేలు వొజ్జిరవొయిడూరాలు...!

యెంకి వొంటి పిల్ల లేదోయ్ లేదోయ్..
యెంకి నా వొంకింక రాదోయ్ రాదోయ్...
పదమూ పాడిందంటె పాపాలు పోవాల
కతలూ సెప్పిందంటె కలకాలముండాల...!

యెంకి వొంటి పిల్ల లేదోయ్ లేదోయ్..
యెంకి నా వొంకింక రాదోయ్ రాదోయ్...
తోటంతా సీకట్లె దొడ్డీ సీకటిమయమె
కూటీకెళితే గుండె గుబగుబమంటూ బయిమె..!

యెంకి వొంటి పిల్ల లేదోయ్ లేదోయ్..
యెంకి నా వొంకింక రాదోయ్ రాదోయ్...
రాసోరింటికైన రంగుదెచ్చే పిల్ల
నా సొమ్ము నా గుండె నమిలి మింగిన పిల్ల...!

యెంకి వొంటి పిల్ల లేదోయ్ లేదోయ్..
యెంకి నా వొంకింక రాదోయ్... రాదోయ్...!!

నండూరి వెంకట సుబ్బారావు రచించిన "యెంకి పాటలు" అనే గేయ సంపుటి... "యెంకి వంటి పిల్ల లేదోయి లేదోయి", "వయ్యారమొలికించు నా యెంకి, వనలచ్చిమనిపించు నా యెంకి" అనే రెండు భాగాలుగా వెలువడ్డాయి. "పాత పాటలు" తరువాత చాలా కాలానికి "కొత్తపాటలు" వెలువడ్డాయి.

Ganesh|
కల్మషం లేని ప్రేమకు సాక్షీభూతాలుగా నిలిచిన యెంకి-నాయుడుబావల పాటలు ఆనాడు ప్రతిఒక్కరినోళ్లనూ నానాయంటే.. అతిశయోక్తి కాబోదు.


దీనిపై మరింత చదవండి :