"గుక్కెడు నీళ్లు చాలు..."అనే రోజు వస్తుందట... ఏం చేద్దాం!!?

FILE
భవిష్యత్తులో నీటికోసం యుద్ధాలు తప్పవని నీటి లభ్యతపై సుదీర్ఘంగా అధ్యయనం చేస్తున్న ఒక పరిశోధకుడు ఆందోళన వెలిబుచ్చాడు. ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగితే గుక్కెడు నీళ్లకోసం ప్రజలు కాట్లాడకునే సంఘటనలు ఎంతో దూరంలో ఉండబోవని ఆయన భయాందోళనలు వ్యక్తం చేశాడు. నిజమే...

ఇదివరకు వేసవి కాలంలో నీటి కొరత సమస్య ఎదురయ్యేది. ఇప్పుడు కాలాలతో సంబంధం లేకుండా నీటి కొరత సమస్య వెంటాడుతోంది. పట్టణాలు, నగరాలు నీటికోసం విలవిలలాడుతున్నాయి. నీటి కొరతకు అసలు కారణం విచ్చలవిడిగా పెరుగుతున్న జనాభా పెరుగుల. వీటన్నికీ మించి నీరు వృధాకాకుండా చూడాల్సిన ప్రభుత్వాలే ఉదాశీనంగా వ్యవహరిస్తున్న సంఘటనలు కోకొల్లలు.

ఉదాహరణకు దేశరాజధాని ఢిల్లీలో మంచి నీటి పంపులకు ఆయా ప్రదేశాలలో లీకేజీల వల్ల 40% నీరు వృధా పోతోందని ఆ రాష్ట్రంలోని ఒక స్వచ్చంద సంస్థ ఇటీవల తన నివేదికలో తెలిపింది. దేశ రాజధానిలోనే నీటి పొదుపు ఇలా ఉంటే.... ఇక మిగిలిన రాష్ట్రాల్లో పరిస్థితి గురించి వేరే విడమరిచి చెప్పనక్కరలేదు.

దీనితోపాటు ప్రజలలో నీటిని పొదుపుగా వాడే అలవాటు లేకపోవడం. ప్రభుత్వాలు ఓట్లకు నోట్లు పంచుతుంటాయి తప్ప ప్రాణాధారమైన ఇటువంటి వనరులను ఎలా కాపాడుకోవాలో చెప్పిన పాపాన పోవడం లేదు.

ఒకవైపు ప్రజలలో నీటి వినియోగం ఇలా ఉంటే... మరోవైపు వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు వర్షపాతంపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. అసమానతలు చోటుచేసుకు వర్షాకాలం సైతం వేసవిని తలపిస్తోంది. గ్లోబల్ వార్మిగ్ ఫలితమే దీని వెనుక ఉన్న మూల కారణమని శాస్త్రజ్ఞులు చెవినిల్లు కట్టుకుని ఘోషిస్తున్నా పట్టించుకునేవారెవరు.

ఇప్పటికే నగర ప్రజలు రోజువారీ 10 లీటర్ల నీటి బాటిళ్లను ఒక్కోటి రూ.20 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. అంటే నీటికోసం నెలకు రూ.600 ఖర్చు చేస్తున్నారు. ఇక మధ్యతరగతి, పేద ప్రజల స్థితి వర్ణనాతీతం. కలుషిత నీళ్లను త్రాగుతూ వ్యాధులబారిన పడుతున్న సందర్భాలు అనేకం చోటుచేసుకుంటున్నాయి.

మరోవైపు ప్రజల ఆహారపు అలవాట్లలోనూ గణనీయమైన మార్పులు వచ్చాయి. మాంసాహారాన్ని అధికంగా తీసుకోవడం పెరుగుతోంది. ఇది కూడా నీటిని హరించే అంశమే. ఎలాగంటే... మాంసాహారాన్ని తయారు చేసేందుకు అవసరమయ్యే నీరు శాకాహారానికంటే ఆరు నుంచి ఏడు రెట్లు ఎక్కువ. ఇలా అన్నీ కలిసి నీటి కొరతలో ప్రధాన భూమికను పోషిస్తున్నాయి.

వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT|
ముందు తరాలకు నీటి ఉపద్రవం ముంచుకు రాకుండా ఉండాలంటే ప్రస్తుతం ప్రతి ఒక్కరు ప్రతి నీటి బొట్టును ప్రాణంతో సమానంగా చూసి ఖర్చు చేసినప్పుడే సాధ్యం. మరి నేటి నుంచే మొదలుపెడదామా... నీటి పొదుపును...


దీనిపై మరింత చదవండి :