సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : గురువారం, 11 మార్చి 2021 (10:14 IST)

దేశంలో విజృంభిస్తోన్న కరోనా.. తెలుగు రాష్ట్రాల్లోనే అదే తంతు

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గురువారం కరోనా కేసులు 22వేలకుపైగా నమోదయ్యాయి. దీంతో ఆందోళన వ్యక్తమవుతోంది. గడిచిన 24 గంటల్లో 22,854 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,12,85,561కు చేరింది. 18,100 మంది వైరస్‌ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 
 
ఇప్పటి వరకు 1,09,38,146 మంది కోలుకోగా.. ప్రస్తుతం దేశంలో 1,89,226 యాక్టివ్‌ కేసులున్నాయని చెప్పింది. 24 గంటల్లో 126 మంది మృత్యువాతపడగా.. మొత్తం మృతుల సంఖ్య 1,58,189కు పెరిగింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 1.68శాతం, రికవరీ రేటు 96.92 శాతానికి చేరుకుందని, డెత్‌ రేటు 1.40శాతం ఉందని మంత్రిత్వశాఖ వివరించింది.  
 
అలాగే తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా విజృంభిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 37,904 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 194 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,00,536కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ గురువారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న కరోనాతో ముగ్గురు మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 1649కి చేరింది.  
 
ఇకపోతే ఏపీలో కరోనావైరస్ కేసులు పెరుగుతున్నాయి. వారం నుంచి నిత్యం వందకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో కొత్తగా 120 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ బుధవారం సాయంత్రం హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో కోవిడ్‌-19 కేసుల సంఖ్య 8,91,004 కి చేరగా.. మరణించిన వారి సంఖ్య 7177 కి పెరిగింది.