సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 ఏప్రియల్ 2021 (15:45 IST)

కరోనా కేంద్రాలుగా మద్యం షాపులు : తెలంగాణ హైకోర్టు ఆగ్రహం

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం ఎన్నో రకాలైన చర్యలు చేపడుతున్నప్పటికీ.. పెద్ద ఫలితం కనిపించడం లేదు. దీంతో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ కేసుల పెరుగుదలపై తెలంగాణ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. 
 
రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా, కరోనా మార్గదర్శకాల అమలుపై హైకోర్టుకు రాష్ట్ర డీజీపీ నివేదిక అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. మార్గదర్శకాల ప్రకారం ఆర్టీపీసీఆర్ పరీక్షలను 70 శాతం పెంచాలని హైకోర్టు ఆదేశించింది.
 
రాష్ట్రంలోని మద్యం దుకాణాలు కరోనా కేంద్రాలుగా మారాయని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి తప్పనిసరిగా కరోనా పరీక్షలను నిర్వహించాలని సూచించింది. కరోనా కట్టడికి నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 
 
మరోవైపు, కరోనా నిబంధనలను ఉల్లంఘించిన ఘటనల్లో 22 వేల కేసులు నమోదు చేసినట్టు నివేదికలో డీజీపీ పేర్కొన్నారు. సోషల్ డిస్టెన్స్ పాటించని వారిపై 2,416 కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.
 
ఇదిలావుంటే, తెలంగాణలో గత 24 గంటల్లో కొత్త‌గా 2,055 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ గురువారం ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... ఒక్క‌రోజులో కరోనాతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అదేసమయంలో 303 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,18,704కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,03,601 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,741గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 13,362 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 8,263 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు.