సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 జనవరి 2021 (08:34 IST)

అమెరికా ప్రతిష్టను పెంచేలా నడుచుకుందాం : మెలానియా

అమెరికా ఫస్ట్ లేడీ హోదాను కోల్పోనున్న ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ తమ దేశ ప్రజలకు ఓ వీడ్కోలు సందేశాన్ని ఇచ్చారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు.
 
అమెరికా కొత్త అధ్యక్షుడుగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో డోనాల్డ్ ట్రంప్ మాజీ అధ్యక్షుడు అవుతారు. ఈ క్రమంలో ట్రంప్ భార్య... అమెరికా వైట్‌హౌస్ సంప్రదాయాన్ని పాటిస్తూ మెలానియా అమెరికా ప్రజలకు వీడ్కోలు సందేశాన్ని వెలువరించారు. 
 
అమెరికా ప్రతిష్టను మరింత పెంచేలా ప్రజలందరూ ఒకే కుటుంబంలా వ్యవహరించాలని, భవిష్యత్ తరాలకు మార్గదర్శనం చేయాలని పిలుపునిచ్చారు. అమెరికాను ఒక్కతాటిపై నిలిపే అంశాలపై దృష్టి సారించాలని మెలానియా యువతకు ప్రత్యేకంగా సూచించారు. 
 
తాను హింసకు వ్యతిరేకం అని, హింస దేనికీ సమాధానం కాదని స్పష్టం చేశారు. అమెరికా ప్రథమ మహిళగా ఉండడం తన జీవితంలో లభించిన అత్యంత గొప్ప గౌరవం అని పేర్కొన్నారు.
 
కరోనా వేళ వెలకట్టలేని సేవలు అందిస్తున్న వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, సైనికులు, న్యాయసిబ్బంది, తల్లులు, చిన్నారులు... ప్రతి ఒక్కరికీ తన హృదయంలో సముచిత స్థానం ఉందని ఆమె ఉద్ఘాటించారు.