బుధవారం, 18 ఫిబ్రవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 17 డిశెంబరు 2025 (15:11 IST)

మా తండ్రిని ఇకపై ప్రాణాతో చూడలేం : ఇమ్రాన్ కుమారులు

imran khan
మా తండ్రి ఇమ్రాన్ ఖాన్‌ను ఇకపై ప్రాణాలతో చూడలేం అని ఆయన కుమారులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ తండ్రిని జైలులో నిర్బంధ గదిలో వుంచి మానసికంగా చిత్రహింసలకు గురి చేస్తున్నారని వారు ఆరోపించారు. తాజాగా ఇమ్రాన్ కుమారులైన ఖాసీం, సులేమాన్‌లు ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. 
 
ఇందులో వారు మాట్లాడుతూ, 'ఆయన్ను రెండేళ్లకు పైగా నిర్బంధ గదిలో ఉంచారు. మురుగు నీరు ఇస్తున్నారు. హెపటైటిస్‌తో చనిపోతున్న ఖైదీల మధ్య ఆయన ఉన్నారు. అక్కడి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఎవరితో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా.. ఏకాంతంగా ఉంచారు. ఆయన్ను బయటకు తీసుకొచ్చేందుకు ఏ మార్గం కన్పించడం లేదు. అయినా మా నమ్మకం ఇంకా అలానే ఉంది. ప్రస్తుతం పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. ఆయన్ను మళ్లీ ఎప్పటికీ చూడలేమేమో అని ఆందోళన చెందుతున్నాం' అని అన్నారు. 
 
'రోజులో ఎక్కువసేపు తన తండ్రి నిర్బంధ గదిలోనే గడుపుతున్నారని ఆరోపించారు. ఇమ్రాన్‌ ఇప్పుడు పూర్తిగా ఒంటరిగా ఉన్నారని ఇటీవల సైనికాధికారులు ప్రకటించినట్లు చెప్పారు. అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా.. ఆయన జైలు జీవితం ఉందన్నారు. ఇదిలాఉండగా ఇమ్రాన్‌ జైలులోనే మృతి చెందారంటూ ఇటీవల పెద్దఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.