నాది ప్రేమపెళ్ళి కాదు: "మిస్టర్ మేధావి"
ఓ "చినదానా" చిత్రంలో సెకండ్ హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన కుర్రాడు రాజా. ఈ చిత్రానికి ముందు ప్రముఖ కంపెనీల యాడ్స్‌లోనూ... మ్యూజిక్ ఆల్బమ్స్‌లోనూ నటించాడు. తొలి చిత్రంతోనే నటునిగా చక్కటి పేరు సంపాదించుకున్న రాజాకు గుర్తింపు వచ్చిన చిత్రం "ఆనంద్". తర్వాత కొన్ని చిత్రాలు చేసినా అంతగా గుర్తింపు రాకపోయినా... అడపాదడపా సపోర్టింగ్ క్యారెక్టర్లు చేశాడు. అలా చేయడం బతుకు తెరువుకోసమేనని నిర్మొహమాటంగా చెబుతున్నాడు.తాజాగా నీలకంఠ దర్శకత్వంలో "మిస్టర్ మేధావి" చిత్రంలో నటిస్తున్నాడు. ఇది ఆనంద్‌కు మంచి గుర్తింపును సాధించి పెడుతుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నాడు. తన పుట్టినరోజును ఎప్పుడూ చాలా సరదాగా జరుపుకుంటాననీ, తానేకాకుండా లోకమంతా ఆనందంగా జరుపుకుంటుందని చలోక్తి విసిరాడు. ఎందుకంటే తాను పుట్టింది దీపావళినాడని చెప్పాడు. ఈ ఏడాదిలో తన సినీకెరీర్‌లో ఆరు సంవత్సారాలు పూర్తయి ఏడవ అడుగు వేస్తున్నానని తెలిపాడు. ఈ సందర్భంగా రాజాతో కాసేపు... ప్రశ్న: ఈ ఆరేళ్ళు బేరీజు వేసుకుంటే ఎలా అనిపిస్తుంది?జ: 2001 నవంబర్‌లో నా సినీ కెరీర్ ప్రారంభమైంది. ఇంతకాలం ఉన్నానంటే ప్రేక్షకుల ఆశీర్వాదమే కారణం. మంచి చెడుల్లో కూడా వారు నాకు సపోర్ట్‌గా ఉన్నారు. కొన్ని సినిమాలు ప్లాప్ అయినా నా పాత్రపరంగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా ఎంపికలో కొన్ని తప్పులు చేసినా ఇండస్ట్రీ చాలా సపోర్ట్ ఇచ్చింది. అయినా ఇప్పటికీ నటునిగా స్ట్రగుల్ ఫేస్ చేస్తూనే ఉన్నాను.
ప్రశ్న: ఏవిధమైన తప్పులు చేశారని భావిస్తున్నారు?జ: చాలామంది కథ బాగా చెప్పగలరు. కానీ ప్రజెంటేషన్ సరిగ్గా ఇవ్వలేరు. దీనివల్ల కొన్ని చిత్రాలు ఫెయిల్ అయ్యాయి. అవి ఏమిటనేవి మీకూ తెలుసు. అయినా నా పాత్రపరంగా బాగా చేశాననే అనిపించుకున్నా. ప్రశ్న: "ఆనంద్" లాంటి విజయవంతమైన చిత్రంలో నటించి కూడా ఆ తరువాత మీకు ఎక్కువగా గ్యాప్ రావడానికి కారణం?జ: నేను ఆశించినంత మంచి అవకాశాలు రాకపోవడంతో దేనినీ ఒప్పుకోలేను. దీర్ఘకాలం ఈ పరిశ్రమలో ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే తొందరపడి సినిమాలు చేయాలనుకోవట్లేదు. మంచి అవకాశాల కోసం వేచి చూద్దామనే ఉద్దేశంతోనే ఆచితూచి అడుగులేస్తున్నాను.ప్రశ్న: మీరు ఎలాంటి క్యారెక్టర్లు చేయాలని ఆశిస్తున్నారు?జ: ఎలాంటి పాత్రలైనా చేయడానికి నేను సిద్ధమే. దాంతో పాటు ప్రేక్షకులు నన్ను నటుడిగా గుర్తు పెట్టుకునే పాత్రలు చేయాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఏది చేయాలన్నా అది ఈ వయస్సులోనే... 40 ఏళ్ళ తర్వాత ఎవ్వరు ఇవ్వరు కదా. ప్రశ్న: హీరోగా చేస్తూ సపోర్టింగ్ పాత్రలు చేయడానికి కారణం?జ: ఒక్కటే... మనీ... ఒక సమయంలో నా చేతిలో సినిమాలు లేవు. కుటుంబ బాధ్యతలు నిర్వర్తించాలి. పోషణకు చాలా ఖర్చవుతుంది. ఆ సమయంలో ఎలా? అనే ఆలోచనలో పడ్డ సమయంలో ఓసారి దర్శకుడు గుణశేఖర్ ఫోన్ చేసి మహేష్‌బాబు పక్కన నటించే పాత్ర ఉంది అన్నారు. వెంటనే "థ్యాంక్ గాడ్" అనుకున్నాను. ఆ తర్వాత "బంగారం" ఇలా కొన్ని చిత్రాల్లో చేశాను. ప్రస్తుతం శ్రీహరి సినిమాలో కూడా చేస్తున్నాను. నా సంతోషమే కాదు. నన్ను నమ్ముకున్నవారిని కూడా సంతోషపెట్టాలి.ప్రశ్న: మీ లక్ష్యం?జ: సినిమా చరిత్రలో చక్కటి నటుల్లో నేను ఒకడని అనిపించుకోవాలనేదే..
ప్రశ్న: పెండ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయని వార్తలొస్తున్నాయి?జ: త్వరలో చేసుకుంటాను. ప్రేమపెళ్ళికాదు. పెద్దలు కుదిర్చిన సంబంధం. అది ఎప్పుడనేది చెప్పలేను. వచ్చేనెల కావచ్చు. లేదా వచ్చే ఏడాది కావచ్చు.ప్రశ్న: నటునిగా ఎంతవరకు చేరువయ్యారు?జ: ఎ.బి సెంటర్లవారికి చేరువయ్యాను. కానీ ఇంకా "సి" సెంటర్ వారికి చేరువకాలేదు. వారికి తెలిసేలా పలుమాస్ పాత్రలను పోషించాల్సివస్తుంది.
ప్రశ్న: దీపావళి పండుగ ప్రత్యేకత ఏమైనా ఉందా?జ: గత ఏడాది "వెన్నెల" నా పుట్టినరోజు గిఫ్ట్‌గా భావించాను. ఈ ఏడాది "మిస్టర్ మేథావి" అని భావిస్తున్నా.ప్రశ్న: "మిస్టర్ మేధావి" గురించి చెప్పండి?జ: జాతీయ అవార్డు గ్రహీత నీలకంఠతో చేయడం ఒక కారణమైతే జెనీలియా సరసన నటించడం మరో విశేషం. ఇందులో పాత్ర ఊహించని విధంగా ఉంటుంది. అందరూ ఆదరిస్తారనే నమ్మకముంది. "ఆనంద్" ఏవిధంగా గుర్తింపు ఇచ్చిందో, మళ్లీ అటువంటి గుర్తింపు ఈ చిత్రంద్వారా వస్తుందని గట్టిగా చెప్పగలను. ఓ కార్పొరేట్ సంస్థలో ఉద్యోగిగా నటిస్తున్నాను. ప్రవాస భారతీయుకాలిని ఆకట్టుకునే పాత్ర నాది. షూటింగ్ పూర్తయి నిర్మాణానంతరం కార్యక్రమాలు జరుగుతున్నాయి. డిసెంబరులో సినిమా విడుదల కానుంది.