Nitish Kumar, ముస్లిం మహిళ హిజాబ్‌ను ముఖం నుంచి లాగి వివాదంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ (video)
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వివాదంలో చిక్కుకున్నారు. ఆయనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో నితీష్ కుమార్ బహిరంగ వేదికపై ముస్లిం మహిళ ముఖం నుండి హిజాబ్‌ను లాగుతున్నట్లు కనిపిస్తోంది. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన ఆర్జేడీ ఇలా రాసింది, నితీష్‌జీకి ఏమైంది? అతని మానసిక స్థితి సరిగానే వుందా అంటూ ప్రశ్నించింది.
వైరల్ అయిన వీడియోలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఒక ముస్లిం మహిళకు అపాయింట్‌మెంట్ లెటర్ అందజేస్తూ ఆమె ముఖం నుండి హిజాబ్‌ను లాగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. వేదికపై ఉన్న ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి నితీష్ కుమార్‌ను ఆపడానికి ప్రయత్నించారు. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయింది. నితీష్ కుమార్ అప్పటికే మహిళా డాక్టర్ హిజాబ్‌ను లాగేసారు. ఈ ఘటన సోమవారం బీహార్ రాజధాని పాట్నాలో జరిగింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆయుష్ వైద్యులకు నియామక లేఖలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, రాష్ట్ర మంత్రులు విజయ్ కుమార్ సిన్హా, మంత్రి విజయ్ కుమార్ చౌదరి, మంగళ్ పాండే పాల్గొన్నారు.