శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 5 మార్చి 2019 (12:38 IST)

పుల్వామా దాడులపై సినిమా .. ఇప్పటికే పలు టైటిల్స్ రిజిస్టర్

గతంలో పలు యుద్ధ సంఘటనలు వెండితెరపై దృశ్యకావ్యంగా వచ్చాయి. ముఖ్యంగా, భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య 1962, 1971 సంవత్సరాలతో పాటు.. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధాలపై చిత్రాలు వచ్చాయి. అలాగే, 2008లో ముంబైలో నవంబరు 26వ తేదీన(26/11 దాడులు) జరిగిన దాడులపై కూడా చిత్రం వచ్చింది. తాజాగా 'యురి' సెక్టార్‌లో జరిగిన దాడులపై కూడా "యురి" పేరుతో ఓ చిత్రం వచ్చింది. 
 
ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. పైగా, అతి తక్కువ బడ్జెట్‌తో నిర్మతమై భా
రీ కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రం బాలీవుడ్ బడా చిత్రాలను కలెక్షన్లను షేక్ చేస్తూ రూ.200 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఈ క్రమంలో తాజాగా జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లా లాథ్‌పురాలో భారత సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని జైషే మొహమ్మద్ తీవ్రవాద సంస్థకు చెందిన ఆత్మాహుతి దళ సభ్యుడు దాడికి తెగబడ్డాడు.
 
ఈ దాడిలో 46 మంది సీఆర్‌పీఎప్ జవాన్లతో పాటు ఆత్మాహుతి దళ సభ్యుడు ప్రాణాలు కోల్పోయాడు. దీనికి ప్రతిగా భారత్ ప్రతిదాడులు చేసింది. ఆక్రమిత కాశ్మీర్‌లోని జైషే తీవ్రవాద స్థావరాలపై భారత్ వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడులను జీర్ణించుకోలేని పాకిస్థాన్ కూడా ప్రతిదాడులకు దిగింది. ఈ క్రమంలో భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ పాక్ ఆర్మీకి బందీగా చిక్కాడు. కానీ, భారత దౌత్యనీతితో పాటు అంతర్జాతీయ సమాజం నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా అభినందన్‌ను పాకిస్థాన్ యుద్ధ ఖైదీగా క్షేమంగా అప్పగించింది. 
 
ఈ పుల్వామా ఉగ్రదాడిని ఇతివృత్తంగా చేసుకుని పలువురు నిర్మాతలు చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే వారంతా తమకు తోచిన, నచ్చిన టైటిల్స్‌ను రిజిస్టర్ కూడా చేయించారు. ముఖ్యంగా, ఇప్పటివరకు యుద్ధం నేపథ్యంతో వచ్చిన చిత్రాలన్నీ మంచి సక్సెస్‌ను సాధించాయి. ఇదే జోష్‌తో పలువురు నిర్మాతలు పుల్వామా ఉగ్రదాడి అంశంతో చిత్రాన్ని నిర్మించేందుకు అమితాసక్తిని చూపుతున్నారు. ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ నిర్మించనున్నట్టు వార్తలు వస్తున్నాయి.