తరుణ్ గగోయ్‌కు మట్టికరిపించిన శిష్యుడు... శరబానంద్ సోనోవాల్
రాజకీయాల్లో ప్రత్యర్థుల చేతిలో ఓడిపోవడం సహజం. కానీ, అస్సోం రాష్ట్ర ముఖ్యమంత్రి తరుణ్ గగోయ్ మాత్రం తన వద్ద రాజకీయ ఓనమాలు నేర్చుకున్న శిష్యుడి చేతిలోనే ఓటమి చవిచూసి.. ముఖ్యమంత్రి పీఠాన్ని త్యజించాల్సి వస్తుందని కలలో కూడా ఊహించివుండరు.
కానీ, గురువారం వెల్లడైన ఆ రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో అక్షరాలా ఇదే జరిగింది. తన వద్ద రాజకీయ పాఠాలు నేర్చుకున్న యువ నేత చేతిలో అధికారానికి దూరమయ్యారు. ఆయన పేరు శరబానంద్ సోనోవాల్. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కేంద్ర క్రీడల మంత్రిగా పని చేస్తున్నారు.
ఈయన 2015 ఆగస్టులో భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన చేరికతో బీజేపీ బలోపేతమైంది. ఈయనతో పాటు హిమంత బిశ్వ శర్మ కూడా ఉన్నారు. వీరిద్దరు బీజేపీకి జవసత్వాలు సమకూరడానికి గొప్ప కృషి చేశారు.
2014 సాధారణ ఎన్నికల్లో అస్సోంలో అద్భుత విజయం సాధించే విధంగా బీజేపీని సోనోవాల్ నడిపించారు. బీజేపీకి సానుకూల పవనాలు ఉన్నప్పటికీ ఆధిక్యత వచ్చే విధంగా చేయగలిగారు. అందుకే ఒక్కసారి జాతీయ స్థాయిలో రాజకీయ హీరో అయిపోయారు. అంతేనా.. అస్సోం రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.