దేవేందర్ గౌడ్‌కు రాజ్యసభ : అలకపాన్పుపై తలసాని!

talasani srinvas yadav
PNR|
File
FILE
తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ టిక్కెట్ల పందారం పెను చిచ్చుకు దారితీసేలా తెలుస్తోంది. ఇప్పటికే... ఉప ఎన్నికల ఫలితాలతో ఢీలా పడిన తెలుగు తమ్ముళ్లు.. రాజ్యసభ టిక్కెట్ల కేటాయింపులో జరిగిన అన్యాయంపై ఏ క్షణంలోనైనా ఫైర్ అయ్యందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా.. గ్రేటర్ హైదరాబాద్‌లో మంచి పట్టున్న మాజీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా అలకపాన్పునెక్కినట్టు వినికిడి.

రాజ్యసభకు జరిగిన ద్వైవార్షిక ఎన్నికల్లో టీడీపీకి రెండు సీట్లు దక్కాయి. ఈ రెండింటిలో ఒక సీటుపై తలసాని గంపెడాశలు పెట్టుకున్నారు. అంతేకాకుండా తనకు సీటు ఇవ్వక పోయినా ఫర్వాలేదని, పార్టీలు మారి తిరిగి సొంతగూటికి వచ్చిన తెలంగాణ నేత, మాజీ మంత్రి దేవేందర్ గౌడ్‌కు మాత్రం టిక్కెట్ ఇవ్వరాదని చంద్రబాబు వద్ద మొత్తుకున్నారు. ఇదే విషయంపై ఆయన బహిరంగ వ్యాఖ్యలు కూడా చేశారు.

అయితే, చంద్రబాబు మాత్రం.. ఇవేమీ పట్టించుకోకుండా రెండు టిక్కెట్లను తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలకే కేటాయించారు. వారిలో ఒకరు టి.దేవేందర్ గౌడ్‌ ఒకరు. ఇది తలసానితో పాటు.. అనేక మంది సీనియర్ నేతలకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. పార్టీతో పాటు... అధినేతను దూషించి, కొత్త పార్టీని పెట్టి.. మరో పార్టీలో విలీనమై.. 2009లో టీడీపీ అధికారంలోకి రాకుండా ఉండేందుకు ఎవరైతే కారణభూతులయ్యారో... అలాంటి దేవేందర్ గౌడ్‌కు ఎలా టిక్కెట్ ఇస్తారని చంద్రబాబును తలసాని నిలదీసినట్టు సమాచారం.

ఈ ప్రశ్నలకు అధినేత సంతృప్తికరమైన సమాధానం ఇవ్వక పోవడంతో తలసాని ఒకింత అవమానంగా భావిస్తున్నట్టు సమాచారం. ఇదే అంశంపై అవసరమైతే పార్టీ అధినేత తీరును ఎండగట్టాలని ఆయన భావిస్తున్నారు. ఇందుకోసం తలసాని అదును కోసం వేచి చూస్తూ.. ప్రస్తుతానికి అలకపాన్పునెక్కినట్టు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది.


దీనిపై మరింత చదవండి :