కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు 2014 ఫీవర్: జగన్ వైపు జంప్ జిలానీలు

Jagan
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT|
WD
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్‌పై ప్రభావం చూపవని ఒకవైపు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ గులాంనబీ ఆజాద్ చెప్పినప్పటికీ పరిస్థితి అలా ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీలో సింహభాగం ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నట్లు సమాచారం.

రాబోయే ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలడం ఖాయమనీ, 2014లో కూడా ఇదే పరిస్థితి పునరావృతమయ్యే అవకాశం ఉన్నదనీ, కనుక జంప్ చేయడమే బెటరనే అభిప్రాయానికి వస్తున్నట్లు సమాచారం. యూపీలో అఖిలేష్ సృష్టించిన హవానే ఏపీలో జగన్ కూడా సృష్టిస్తాడని మీడియా కథనాలు ఊపందుకోవడంతో ఎమ్మెల్యేలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ముందస్తుగా లోపాయికారి ఒప్పందాలను కుదుర్చుకుంటున్నట్లు సమాచారం.

మాజీమంత్రి, బాపట్ల ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి తన కుమారుడికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం ఇప్పించి ఆ పార్టీ తరపున పోటీ చేయించాలని వైకాపాతో చర్చిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా సీమ ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి అయితే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని ప్రకటించేశారు. అంటే.. బంధువులు, అనుయాయులు జగన్ పార్టీ తరపున బరిలో దిగుతారు కనుకనే జేసీ అలా స్పందించారన్న వాదనలు వినబడుతున్నాయి.

ఇంకా రాంరెడ్డి దామోదర్ రెడ్డి కుమారులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. దామోదర్ రెడ్డి కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయరనే ప్రచారం జరుగుతోంది. ఇకపోతే రాష్ట్రమంత్రి జానారెడ్డి కూడా కుమారునితో సహా ప్రస్తుత నియోజకవర్గాన్ని వదిలి వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆయన పోటీ చేసేది కాంగ్రెస్ పార్టీ తరపునా లేదంటే తెరాస తరపునా అనే ప్రశ్నలను కూడా కొంతమంది లేవనెత్తుతున్నారు.

మొత్తమ్మీద రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కుక్కలు చింపిన విస్తరి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి కాంగ్రెస్ హైకమాండ్ ఏపీలో పట్టు సాధిస్తుందో లేదంటే గుడ్లప్పగించి అలా చూస్తూ ఉంటుందో వెయిట్ అండ్ సీ.

మొత్తమ్మీద కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మెల్యేలకు ఇప్పట్నుంచి 2014 ఎన్నికల భయం పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ భయంతోనే వారు ఇతర పార్టీలవైపు దృష్టి సారిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.


దీనిపై మరింత చదవండి :