న్యూజెర్సీలో "ఒబిలి"కి ఎన్నారైల ఘన సన్మానం

Ganesh|
అమెరికాలోని తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ (టీఎఫ్ఎఎస్) సేవల్లోనూ.. తెలుగువారి అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన "ఒబిలి గ్రూప్ ఛైర్మన్" ఒబిలి రామచంద్రారెడ్డిని న్యూజెర్సీలో ప్రవాస భారతీయులు ఘనంగా సన్మానించారు. హైదరాబాద్‌కు చెందిన ఒబిలి చేసిన సేవలకు గుర్తింపుగా టీఎఫ్ఎఎస్ ఆయనను అమెరికాకు ఆహ్వానించి ఘనంగా సత్కరించింది.

టీఎఫ్ఎఎస్ సంస్థ కార్యక్రమాలకు హైదరాబాద్ నుంచి పలువురు సినీ కళాకారులను తీసుకురావటంలో కూడా ఒబిలి ముఖ్య పాత్ర పోషించారని ఈ సందర్భంగా ఆ సంస్థ కొనియాడింది. న్యూజెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్ నగరంలోగల కోరియాండల్ రెస్టారెంట్‌లో జరిగిన ఒబిలి సన్మాన సభకు పెద్ద ఎత్తున ప్రవాస భారతీయ ప్రముఖులు హాజరై.. ఆయనను అభినందనల్లో ముంచెత్తారు.

ఈ సందర్భంగా ఒబిలి రామచంద్రారెడ్డికి టీఎఫ్ఎఎస్ అధ్యక్షుడు దాము గేదెల సన్మాన పత్రాన్ని, శాలువను అందజేశారు. ఇదిలా ఉంటే.. టీఎఫ్ఎఎస్ కార్యదర్శి ఆనంద్ పాలూరి మాట్లాడుతూ.. అక్టోబర్ 24న తమ సంస్థ నిర్వహించిన దీపావళి వేడుకలను విజయవంతం చేయటంలో వలంటీర్ల కృషి మరువరానిదని కొనియాడారు. చక్కని సేవలు అందించిన వలంటీర్లకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

ఇంకా ఈ సన్మాన సభలో టీఎఫ్ఎఎస్ కార్యనిర్వాహక వర్గ సభ్యులు ఆనంద్ పాలూరి, రోహిణీకుమార్, మంజు భార్గవ, ఇందిర యలమంచి, సత్య నేమన, గిరిజ కొల్లూరి.. తదితరులతో పాటు విశేష సంఖ్యలో అతిధులు హాజరయ్యారు. సన్మాన గ్రహీత ఒబిలి మాట్లాడుతూ.. ప్రవాస భారతీయులకు తనపై ఉన్న అభిమానం చూస్తే చాలా సంతోషంగా ఉందని అన్నారు.


దీనిపై మరింత చదవండి :