శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 సెప్టెంబరు 2020 (14:33 IST)

హైదరాబాద్‌లో మెట్రో రైల్ సేవల ప్రారంభానికి సర్వం సిద్ధం...

కరోనా లాక్డౌన్ తర్వాత మెట్రో రైల్ సర్వీసులకు కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో ఈ నెల ఏడో తేదీ నుంచి ఈ సర్వీసులు ప్రారంభంకానున్నాయి. తొలి విడతగా 7వ తేదీన మియాపూర్‌ నుంచి ఎల్బీనగర్‌ మార్గంలో ప్రారంభించి, దశల వారీగా మూడు కారిడార్లలో మెట్రో సేవలను అందుబాటులోకి తీసుకువస్తారు. 8న నాగోల్‌ నుంచి రాయదుర్గం, 9 నుంచి జేబీఎస్-ఎంజీబీఎస్‌ మార్గాల్లో రైళ్లను నడుపుతారు.
 
అయితే, ఈ రైళ్లను ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే మెట్రో రైలు నడుస్తాయని తెలిపారు. కరోనా కంటోన్మెంట్ జోన్లలోని మెట్రో స్టేషన్లను మూసివేస్తున్నారు. గాంధీ ఆస్పత్రి, భరత్‌నగర్‌, మూసాపేట, ముషీరాబాద్‌, యూసు్‌ఫగూడ స్టేషన్లలో మెట్రో రైళ్లు ఆగవు.
 
కరోనా తీవ్రత నేపథ్యంలో భౌతిక దూరాన్ని పాటించడానికి మెట్రో స్టేషన్లు, మెట్రో రైలు లోపల కూడా గుర్తులను మార్క్‌ చేస్తున్నారు. ఆ మార్క్‌ ప్రాంతంలోనే ప్రయాణికులు నిల్చోవాల్సి ఉంటుంది. ప్రత్యామ్నాయ సీటు రైలు లోపల ఎక్స్‌గా గుర్తించిన చోట ఖాళీగా ఉంటుంది. ఆ సీటులో కూర్చోవడం నిషేధం.
 
ఇకపోతే, ప్రయాణికులు, సిబ్బంది తప్పనిసరిగా ఫేస్‌మా్‌స్కలు ధరించాలి. ఫేస్‌ మాస్క్‌ లేకుంటే మెట్రో స్టేషన్లలో విక్రయించే ఏర్పాటు చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తారు.
 
హైదరాబాద్‌ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి స్పందిస్తూ, సోమవారం నుంచి మెట్రో రైళ్లు నడిపించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు. ఎక్కడిక్కడే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ, శానిటైజ్‌ చేస్తూ, ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మెట్రో రైళ్లు నడిపించనున్నట్లు తెలిపారు.