సోమవారం, 16 ఫిబ్రవరి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 14 డిశెంబరు 2025 (22:15 IST)

టాలీవుడ్‌కు దిష్టి తగిలింది... మన మధ్య ఐక్యత లేదు : తమన్ ఆవేదన

S.S. Thaman
తెలుగు చిత్రపరిశ్రమకు దిష్టి తగిలిందని, అన్నికంటే ముఖ్యంగా మన మధ్య ఐక్యత లేదని ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ ఆవేదన వ్యక్తం చేశారు. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన అఖండ-2 చిత్రం ఘన విజయం సాధించింది. దీంతో ఆ చిత్ర విజయోత్సవ వేడుకలను హైదరాబాద్ నగరంలో నిర్వహించారు. 
 
ఇందులో థమన్ మాట్లాడుతూ, మన మధ్య ఐక్యత లేకుండా పోతోంది. 'మనం' అనుకుంటే అందరం కలిసి ముందుకు వెళ్తాం. చాలా మంది వివిధ స్టూడియోలకు వెళ్లి సలహాలు ఇచ్చారు. అదేదో ప్రొడక్షన్ హౌస్‌కు వచ్చి ఇచ్చి ఉంటే నిర్మాతకు ఇంకాస్త భరోసాగా ఉండేది. ఇండస్ట్రీలో ఐక్యత లేదు. అందరూ కలిసి ఉండాలి. తెలుగు సినీ పరిశ్రమ అంటే బయట ఎంతో పేరు ఉంది. ఇంత మంది హీరోలు, ఈ స్థాయి అభిమానులు ప్రపంచంలో ఎక్కడా లేరు. మన తెలుగు ఇండస్ట్రీకి దిష్టి తగిలింది. యూట్యూబ్‌, సోషల్‌మీడియా ఓపెన్‌ చేస్తే, ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. చాలా నెగెటివిటీ పెరిగిపోయింది' వాపోయారు. 
 
'ప్రతి సినిమా మన సినిమా అనుకోవాలి. అందరూ కలిసి మాట్లాడుకుని చేతులు కలుపుకొని వెళ్లాలి. ఎవరికైనా దెబ్బ తగిలితే బ్యాండ్‌-ఎయిడ్‌ వేయండి. దాని గురించి బయటకు వెళ్లి బ్యాండ్‌ వేయకండి. సినిమా వాయిదా పడటం వల్ల నిర్మాతలు ఎంత కుమిలిపోయి ఉంటారు? వాళ్లకూ కుటుంబం, పిల్లలు ఉంటారు కదా. ఈ సినిమా ఎప్పుడొచ్చినా హిట్ అవుతుందని ధైర్యంగా ఉన్నాం. మేము దేవుడిని నమ్ముకుని ఉన్నాం. అందుకు వారం ఆలస్యమైనా హిట్‌ కొట్టాం. బోయపాటి శ్రీను చెప్పిన కథ అర్థం చేసుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. అందుకే కొంత ఆలస్యమైంది. సంక్రాంతికి రాబోయే సినిమాలన్నీ మంచి విజయం సాధించాలి. నేను ఏ సినిమానైనా ప్రమోట్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పటికైనా అందరూ కలిసి ముందుకు వెళ్లాలి' అని థమన్ కోరారు.  
 
ఇకపోతే, చిత్రానికి సంగీతం సమకూర్చడంపై ఆయన మాట్లాడుతూ, 'శివుడి ఇచ్చిన శక్తి వల్లే ఈ సినిమా కోసం ఎంతో ఎనర్జీగా పనిచేశాం. ఒక్కరోజు కూడా అలసిపోలేదు. నా మ్యూజిక్‌ వెనుక ఎంతో మంది గాయకులు, గేయ రచయితలు, సంగీత వాయిద్యకారుల శ్రమ ఉంది. ఈ సినిమా కోసం నాతో అహర్నిశలు పనిచేసిన వారందరికీ థ్యాంక్స్‌. సాధారణంగా హీరో, హీరోయిన్‌ మధ్య కెమిస్ట్రీ చూస్తాం. కానీ, బాలకృష్ణ, బోయపాటి కలిస్తే అదొక కెమిస్ట్రీ. అది ఫిజిక్స్‌ రూపంలో తెరపై కనిపిస్తుంది' అని పేర్కొన్నారు.