శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 జనవరి 2021 (13:12 IST)

దేశంలో గణనీయంగా తగ్గిన క్రియాశీలక కేసులు

దేశంలో ఒకవైపు కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి కోసం ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. మరోవైపు దేశంలో గత కొన్ని రోజులుగా 20 వేల లోపే పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమశాఖ నివేదిక ప్రకారం.. నిన్న దేశవ్యాప్తంగా 8,36,227 కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 15,968 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. 
 
దీంతో మొత్తం కేసుల సంఖ్య కోటి నాలుగు లక్షల 95వేలకు చేరింది. వీరిలో ఇప్పటివరకు 1,01,29,111 మంది కోలుకోగా, నిన్న ఒక్కరోజే 17,817 మంది డిశ్ఛార్జి అయ్యారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 202 కొవిడ్‌ మరణాలు నమోదుకావడంతో మొత్తం మృతుల సంఖ్య 1,51,529కి చేరింది. ప్రస్తుతం 2,14,507 క్రియాశీల కేసులు(2.04శాతం) ఉన్నాయి.
 
మరోవైపు, కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రజలు అలసత్వం వహించకూడదని కేంద్ర ఆరోగ్యశాఖ దేశ ప్రజలకు సూచించింది. వ్యాక్సిన్‌ తీసుకున్నాక 14 రోజుల తర్వాతే వాటి ప్రభావం ప్రారంభం అవుతుండడంతో అప్పటివరకు కొవిడ్‌ నిబంధనలు పాటించాలని కోరింది. 
 
రెండు డోసుల వ్యాక్సిన్‌ను 28 రోజుల వ్యవధిలో తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా జనవరి 16నుంచి వ్యాక్సిన్‌ పంపిణీ ప్రక్రియ మొదలుకానున్న విషయం తెలిసిందే. ఇందుకోసం అవసరమైన వ్యాక్సిన్లను గట్టి భద్రత నడుమ, సురక్షితంగా అన్ని రాష్ట్రాలకు చేరవేసింది.