బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ప్రస్తుత సిరీస్
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 23 ఫిబ్రవరి 2017 (04:16 IST)

ఉత్సాహంతో కోహ్లి సేన.. తీవ్ర ఒత్తిడిలో కంగారూలు: నేడే తొలిటెస్టు

యావత్ క్రికెట్ ప్రపంచం దిగ్భ్రమతో కొనియాడుతున్న మేటి బ్యాట్స్‌మన్, జట్టు విజయాన్ని మొత్తంగా తమమీద వేసుకుని చెమటోడ్చే మేటి జంట బౌలర్లు.. దుర్భేద్యమైన బ్యాటింగ్ లైన్.. 13 ఏళ్లుగా ప్రత్యర్థికి మ్యాచ్ జారవిడవని అద్భుత చరిత్ర గణాంకాలు..

యావత్ క్రికెట్ ప్రపంచం దిగ్భ్రమతో కొనియాడుతున్న మేటి బ్యాట్స్‌మన్, జట్టు విజయాన్ని మొత్తంగా తమమీద వేసుకుని చెమటోడ్చే మేటి జంట బౌలర్లు.. దుర్భేద్యమైన బ్యాటింగ్ లైన్.. 13 ఏళ్లుగా ప్రత్యర్థికి మ్యాచ్ జారవిడవని అద్భుత చరిత్ర గణాంకాలు.. మరోవైపు స్పిన్ పిచ్‌పై ఏమాత్రం అనుభవం లేని యువ ఆటగాళ్లతో భయపడుతూనే వచ్చిన ప్రత్యర్థి జట్టు. వెరసి.. నేటి నుంచే భారత్-ఆసీస్ టెస్ట్ సీరీస్ ప్రారంభం. 
 
టెస్ట్ క్రికెట్ చరిత్రలో అద్వితీయమైన సీరీస్‌గా ఇదెందుకు గుర్తింపబడుతోంది అంటే చెప్పడానికి బోలెడు కారణాలు. భారత్ ఘనవిజయాల చరిత్రకు అద్దంపట్టే గణాంక సహిత వివరాలివి. వేదిక ఏదైనా వరుసగా 19 టెస్టుల్లో పరాజయం దగ్గరికే రాలేదు. సొంతగడ్డపై అయితే గత 20 మ్యాచ్‌లలో 17 విజయాలు సాధించగా ఒక్క ఓటమి కూడా లేదు. నాలుగేళ్ల క్రితం ఇక్కడే కలిసికట్టుగా 53 వికెట్లు తీసి ఆసీస్‌ను చిత్తు చేయడంలో కీలక పాత్ర పోషించిన ఇద్దరు బౌలర్లు ఇప్పుడు ర్యాంకింగ్స్‌లో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఇక ఎదురులేని బ్యాటింగ్‌తో ప్రత్యర్థుల పని పడుతున్న ఆటగాడు ముందుండి నడిపిస్తుండగా జట్టులో ప్రతీ ఒక్కరు మరొకరితో పోటీ పడుతూ అద్భుత ప్రదర్శన ఇస్తున్నారు. ఇదీ వరల్డ్‌ నంబర్‌వన్‌ భారత్‌ తాజా స్థితి. 
 
మరోవైపు.. ఎప్పుడో 13 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా జట్టు భారత గడ్డపై టెస్టు సిరీస్‌ గెలుచుకుంది. ఆ తర్వాత ఇక్కడ ఆడిన పది టెస్టుల్లో ఎనిమిది ఓడి అతి కష్టంగా రెండింటిలో ‘డ్రా’తో బయటపడింది. అనేక మంది దిగ్గజాలు ఉన్న నాటి ఆసీస్‌ జట్లు కూడా భారత్‌ ధాటికి నిలువలేకపోయాయి. ఇప్పుడు స్పిన్‌ పిచ్‌లపై ఆడటంలో ఏ మాత్రం అనుభవం లేని యువ ఆటగాళ్లను నమ్ముకొని ఆసీస్‌ భారత్‌లో అడుగు పెట్టింది. ఉపఖండంలో గత తొమ్మిది టెస్టుల్లో నూ చిత్తుగా ఓడిన ఆ జట్టు, అసలు నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో అసలు ఏమాత్రమైనా నిలబడగలదా లేక పట్టుదలతో పోరాడుతుందా?
 
పుణే న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌ తర్వాత ఇప్పుడు ఆస్ట్రేలియా వంతు వచ్చింది. సొంతగడ్డపై తిరుగులేని ప్రదర్శనతో వరుస విజయాలు సాధిస్తున్న జట్టుతో తలపడేందుకు ఇప్పుడు కంగారూల బృందం సన్నద్ధమైంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే నాలుగు టెస్టుల సిరీస్‌ లో భాగంగా నేడు (గురువారం) తొలి టెస్టు ప్రారంభమవుతుంది. భారత్‌ వరుసగా ఆరు టెస్టు సిరీస్‌లు గెలిచి ఊపు మీదుండగా, ఆసీస్‌ ఇటీవలే స్వదేశంలో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. 
 
అయితే అక్కడికంటే పూర్తి భిన్నమైన పరిస్థితుల్లో జరిగే ఈ మ్యాచ్‌లలో ఆసీస్‌ అదే తరహా ఆటతీరును ప్రదర్శించడం అంత సులువు కాదు. మరోవైపు జట్టులో ప్రతీ ఆటగాడు ఫామ్‌లో ఉండటంతో వరుస విజయాలు సాధించిన కోహ్లి సేన మరో సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఇరు జట్ల మధ్య భారత గడ్డపై 2013లో జరిగిన సిరీస్‌లో ఆసీస్‌ 0–4తో ఓడగా, ఆఖరిసారిగా ఈ రెండు జట్లు ఆస్ట్రేలియాలో 2014లో తలపడిన సిరీస్‌లో ఆసీస్‌ 2–0తో నెగ్గింది.
మరోసారి ప్రత్యర్థిని కుప్పకూల్చేందుకు అస్త్రాలతో సిద్ధమైంది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా ఉన్న అశ్విన్, నంబర్‌టూ జడేజా మరోసారి భారత భాగ్యచక్రాన్ని పరుగెత్తించడంలో కీలక పాత్ర పోషించనున్నారు. గత 13 టెస్టుల్లో అశ్విన్‌ ఏకంగా 78 వికెట్లు తీయగా, 10 టెస్టుల్లో జడేజాకు 49 వికెట్లు దక్కాయి. జడేజా కెరీర్‌లో తీసిన 117 వికెట్లలో 96 భారత గడ్డపైనే వచ్చాయంటే అతను ఇక్కడ ఎంత ప్రమాదకరమో అర్థమవుతుంది.
 
తుది జట్లు (అంచనా)
భారత్‌ కోహ్లి (కెప్టెన్‌), విజయ్, రాహుల్, పుజారా, రహానే, సాహా, అశ్విన్, జడేజా, జయంత్, ఉమేశ్, ఇషాంత్‌భువనేశ్వర్‌.
ఆస్ట్రేలియా స్మిత్‌ (కెప్టెన్‌), వార్నర్, రెన్‌షా, షాన్‌ మార్‌ష, హ్యాండ్స్‌కోంబ్, మిషెల్‌ మార్ అగర్, వేడ్, స్టార్క్, కీఫ్, లియోన్, హాజల్‌వుడ్‌.