శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Updated : సోమవారం, 6 జులై 2015 (06:58 IST)

తిరుమలలో విపరీతమైన రద్దీ.. తోపులాట...2 కి.మీ వెలుపలకు వచ్చిన క్యూలైను

తిరుమల కిటకిటలాడుతోంది. ఎక్కడ చూసినా జనమే జనం. ఇసుక వేస్తే రాలనంత జనం అనే నానుడికి ప్రస్తుతం తిరుమలలో ఉన్న జనం నూటికి నూరుపాళ్లు సరిపోతుంది. వారాంతపు రోజులు కావడంతో తిరుమలలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఆదివారం కొండపై ఎటుచూసినా బారులు తీరిన భక్తులే కనిపించారు. ఆలయ పరిసర ప్రాంతాలు, లడ్డూ కౌంటర్లు, మాడవీధులు, వాణిజ్య సముదాయాలు జనంతో నిండిపోయాయి.
 
వైకుంఠం క్యూకాంప్లెక్సులో సర్వదర్శన భక్తులు 31 కంపార్టుమెంట్లలో నిండిపోవడమే గాక.. వెలుపల నారాయణగిరి ఉద్యానవనంలోని క్యూలైన్లలో రెండు కిలోమీటర్ల మేరకు బారులు తీరారు. దివ్యదర్శన భక్తులు కూడా 14 కంపార్టుమెంట్లు నిండి మూడు కిలోమీటర్ల మేరకు ఉద్యానవనంలోకి చేరుకున్నారు. దీంతో సర్వదర్శనానికి 15, దివ్యదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. 
 
శనివారం ఒక్కరోజే దాదాపు 89 వేలమంది స్వామివారిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, నారాయణిగిరి ఉద్యానవనంలోకి చేరుకున్న తాత్కాలిక క్యూలైన్‌లోకి.. దివ్యదర్శన భక్తులను వదలడంతో ఒక్కసారిగా.. తోపులాట చోటుచేసుకుంది. అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది కొంతసేపటికి క్యూలైన్లను క్రమబద్ధీకరించారు. ఈ రద్దీ సోమవారం కూడా కొనసాగే అవకాశం ఉంది.