బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. గృహాలంకరణ
Written By PNR
Last Updated : గురువారం, 18 సెప్టెంబరు 2014 (10:29 IST)

గృహంలో పుష్పాలంకరణకు కొన్ని చిట్కాలు!

గృహంలో పూలను రకరకాలైన కుండీల్లో ఉంచి అమర్చుకోవడం వల్ల ఇంటికి ఎంతో ఆకర్షణ చేకూరుతుంది. మొక్కల కుండీలను కింద, పైన వేలాడదీస్తున్న చందాన పూల కుండీలను కూడా పలురకాల డెకరేషన్‌లతో ఉంచితే ఇల్లు పొందికగా ఉంటుంది. కలర్‌ఫుల్ పవర్ డెకరేషన్‌కు కలర్‌ ఫుల్ ప్లవర్ పాట్‌లు కూడా అవసరమని చెప్పనక్కరలేదు.
 
పొడవాటి పూలను ఎత్తుగా అలంకరించాలంటే వెడల్పుగా, ఎత్తు తక్కువగా ఉన్న బాటిల్ లేదా కుదురు లాంటివి తీసుకోవాలి. బాటిల్ లేదా కుదురులో పావు వంతు నీరు పోసి, రంగు రాళ్లను, గోళీలను అందులో అందంగా అమర్చాలి. బాటిల్ అడుగున పేర్చే రాళ్లు, గోలీలు పరిసరాల రంగుతో మ్యాచ్ అయితే మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. 
 
ఈ ఫ్లవర్ పాట్‌ను టీపాయ్ మీద పెట్టేటట్లయితే సోఫా సెట్ కలర్ లేదా గోడల రంగును దృష్టిలో పెట్టుకోవాలి. అలా సాధ్యం కానప్పుడు ఆ గదిలో ఉండే మరో వస్తువుల మీదకు చూపు సారించాలి. ఫ్రిజ్, పుస్తకాల షెల్ప్, వాల్ హేంగింగ్, పెయింటింగ్, కర్టెన్‌లు వంటి వాటి మీద కూడా పెట్టవచ్చు.
 
ఫ్లవర్ డెకరేషన్‌కు ప్రత్యేకమైన పూలను సేకరించనక్కరలేదు. ఇంట్లో దొరికే అన్నిరకాల క్రోటాన్ ఆకులను, పూలను, జినియా, దాలియా, మందార, ఉమ్మెత్త ఇలా అందుబాటులో ఉన్న పూలను వాడవచ్చు. అయితే పూలను అమర్చడంలోనే అందం వస్తుందని గ్రహించాలి.