శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: బుధవారం, 18 మే 2016 (16:36 IST)

కథలో పేరు రాయను... బయట పేరు పెట్టి పిలవను... ఆయన దర్శకుల హీరో... 'బ్రహ్మోత్సవం' దర్శకుడు శ్రీకాంత్‌ ఇంటర్వ్యూ

టీనేజ్‌ యువత నేపథ్యంలో 'కొత్త బంగారులోకం'లో యూత్‌ను విహరింపజేసిన దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల. ఆ తరువాత కుటుంబ విలువలతో కూడిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', తదుపరి 'ముకుంద' చిత్రాలతో అన్నివర్గాలకు దగ్గరయ్యాడు. పెద్ద కుటుంబాల్లో వ్యక్తుల పేర్లను చి

టీనేజ్‌ యువత నేపథ్యంలో 'కొత్త బంగారులోకం'లో యూత్‌ను విహరింపజేసిన దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల. ఆ తరువాత కుటుంబ విలువలతో కూడిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', తదుపరి 'ముకుంద' చిత్రాలతో అన్నివర్గాలకు దగ్గరయ్యాడు. పెద్ద కుటుంబాల్లో వ్యక్తుల పేర్లను చిన్నోడా!, పెద్దోడా! వంటి సంబోధించినట్లే. 'సీతమ్మ వాకిట్లో..'లో కథానాయకులకు ఆ పేర్లే పెట్టేశాడు. మిగతాపాత్రలను 'ఆ విజయవాడోళ్ళు..' అంటూ పలికేట్లుగా చేసిన శ్రీకాంత్‌. 
 
తను కథలు రాసేటప్పుడే క్యారెక్టర్లకు పేర్లు పెట్టననీ.. ఎందుకనో అలా అలవాటయిందనీ.. తనను కూడా ఇంట్లో చిన్నా! అని సంబోధిస్తారని... చెబుతున్న శ్రీకాంత్‌ అడ్డాల.. మహేష్‌ బాబుతో 'బ్రహ్మోత్సవం' చిత్రానికి దర్శకత్వం వహించాడు. అయితే మహేష్‌ క్యారెక్టర్‌ పేరు కూడా మొదట రాయలేదనీ.. మిగతా ఆర్టిస్టుల పేర్లు కూడా కథలో చెప్పలేదనీ.. కథంతా విన్నాక.. ఇంతకీ.. నా పాత్ర పేరు ఏమిటి? అని అడుగుతుంటారని.. అని చెబుతున్న శ్రీకాంత్‌... ఈ శుక్రవారమే విడుదల కాబోతున్న ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియజేస్తున్నారు.
 
ఎక్కువమంది నటీనటుల వల్ల మీరు ఒత్తిడి ఫీలయ్యారు కనుకనే సినిమా కాస్త ఆలస్యం జరిగిందనే టాక్‌ ఉంది. మీరేమంటారు?
కొన్ని సన్నివేశాలను మరలా తెరకెక్కించాల్సి వచ్చినప్పుడు కాంబినేషన్‌ కుదరడం కష్టం. ఆ కాంబినేషన్‌ సెట్‌ అయ్యేవరకు వెయిట్‌ చేయాల్సి వచ్చిందే తప్ప ప్రత్యేకించి ఒత్తిడి వల్ల ఏమీ కాదు.
 
'బ్రహ్మోత్సవం' ఎలా ఉండబోతోంది?
మంచి కుటుంబాలు కలిసి తరచుగా చేసుకుంటే ఉత్సవాలు అవుతాయి. అదే ఆ ఉత్సవాలు ఓ స్థాయిని దాటితే అది బ్రహ్మోత్సవం అవుతుంది. శ్రీవారి కోసం చేసే ఉత్సవాలే ఉత్కృష్టమైనవి. దానికంటే గొప్ప ఉత్సవాలు లేవు. కథంతా పూర్తయ్యాక.. టైటిల్‌ కరెక్ట్‌గా సరిపోతుందనిపించింది.
 
తిరుపతి బ్రహ్మోత్సవాలను చూపిస్తున్నారా?
తిరుపతి బ్యాక్‌డ్రాప్‌కాదు. ఓ ఊరిలో జరిగే ఉత్సవాలను చూపిస్తున్నాం.
 
ఏ నేపథ్యంలో సాగుతుంది?
విజయవాడ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఓ సందర్భం కోసం కలుసుకున్న నాలుగైదు కుటుంబాలకు సంబంధించిన కథతో చేశాం.
 
రేవతి, సత్యరాజ్‌‌లను ఎంపిక చేసుకోవడంలో ప్రత్యేకమైన ఉద్దేశాలున్నాయా?
కొత్తదనం కోసమే. వారి కాంబినేషన్‌ ఫ్రెష్‌గా వుంటుంది. అలాగే జయసుధ పాత్ర కూడా.
 
హీరో చెప్పులు తొడిగే సన్నివేశాన్ని... కమర్షియల్‌ యాడ్‌ కోసమే చొప్పించినట్టున్నారు?
కానేకాదు. ఎంతో ప్యూరిటీగా ఉంటే తప్ప ఇలాంటి విషయాలలో హీరో నటించలేరు. తండ్రి మీద ఉన్న ప్రేమను నిర్వచించడానికి అలాంటి సన్నివేశాన్ని పెట్టాను. అంతేగానీ యాడ్స్‌ కోసం కాదు. తండ్రి పట్ల గౌరవాన్ని, వినయాన్ని ఎలా డిఫైన్‌ చేయాలని ఆలోచించి.. ఫంక్షన్‌ కోసం హడావిడిగా వెళ్ళిపోతున్న తండ్రికి కొడుకు చెప్పులు తొడుగుతాడు. అంతకంటే తండ్రికిచ్చే గౌరవం లేదనుకున్నాం. హీరో కూడా అంగీకరించారు. అదే పోస్టర్‌‌గా రిలీజ్‌ చేశాం. దానికి మంచి రెస్పాన్స్‌ వస్తోంది.
 
ఇందులో బంధాలను కొత్తగా నిర్వచిస్తున్నారా?
ఉన్న బంధాన్ని కొత్తగా చెప్పడమే కానీ, బంధాలను నిర్వచించే సాహసాలేం చేయలేదు.
 
నేపథ్య సంగీతం ఎవరితో చేయించారు?
గోపీసుందర్‌ చేశారు. తను 'ఊపిరి'కి చేశాక బాగుందని అందరం అనుకునే అతనితో చేయించాం.
 
ఏడు తరాల గురించి చర్చించారా?
అవును. ఏడు తరాల కాన్సెప్ట్‌ ఒకటి ఉంటుంది. కథను ముందుకు తీసుకు వెళ్ళడంలో అది మెయిన్‌ రోల్‌ ప్లే చేస్తుంది.
 
ప్రత్యేకించి యాస ఏమైనా ఉపయోగించారా?
మామూలు భాషే ఉంటుంది.
 
గణేష్‌‌పాత్రోని మిస్‌ అయ్యారా?
సీతారామయ్యగారి మనవరాలు సినిమా చూశాక.. ఆయనతో పనిచేయాలనిపించింది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా ఆ సమయంలో నా స్థాయి కంటే ఎక్కువగా డీల్‌ చేయాల్సిన కథ. అప్పుడు గణేష్‌ పాత్రో గారు నాకు సహాయం చేస్తారని ఆయన దగ్గరకు వెళ్లాను. ఆయన అనుభవం సినిమాకు ఎంతో ఉపయోగపడింది. 'ముకుంద' సమయంలోనే 'బ్రహ్మోత్సవం' సినిమా చేస్తున్నానని ఆయనకు చెప్పాను. కథ విని రెండు, మూడు పేజీలు స్క్రీన్‌ ప్లే రాసిచ్చారు. ఆయనిప్పుడు లేకపోవడం బాధాకరం. బ్రహ్మోత్సవం సినిమాకు ఓంకారం చేసింది ఆయనే. ఆయన్ను కోల్పోవడం బాధాకరం.
 
సినిమా ద్వారా మీరేం చెప్పదలచుకున్నారు?
నాకు మనుషులంటే చాలా ఇష్టం. ఒక్కరిగా వున్నప్పుడు ఎన్నో చేయాలనుకుంటాం. ఏవో ఆలోచనలు వస్తాయి. అవన్నీ సాధ్యపడవు. వాటినుంచి కాస్త బయటకు రావాలంటే.. నలుగురి మధ్య ఉంటే బాధలన్నిటినీ మర్చిపోతాం. అలాగా నలుగురు కుటుంబాల మధ్య ఉన్న అంశాలతో ఈ సినిమాను చేశాం. పండుగలా ఉంటుంది.
 
స్క్రిప్ట్‌ విషయంలో ఎవరి సాయం తీసుకున్నారు?
శ్రీరమణ, ఖాదీర్‌ బాబు, కిశోర్‌, కృష్ణ చైతన్య, పరుచూరి బ్రదర్స్‌ సహకారం ఎంతో వుంది.
 
ఇందులో హీరోకి పేరేమిటి?
నేనెప్పుడూ కథల్లో హీరోకి పేరు రాసుకోను. నేను కూడా ఎవరినీ పేరు పెట్టి పెద్దగా పిలవను. బయట అందరూ ఏరా! అరె! అంటూ పిలుస్తారు. అమ్మ అయితే చిన్నా! అంటోంది.  కాబట్టి ఆ అవసరం అనిపించదు.
 
మహేష్‌తో రెండో అవకాశం ఎలా ఫీలయ్యారు?
మహేష్‌ బాబుగారితో ఇది రెండోసారి చేశాను. ఆయనెప్పుడు టాప్‌లోనే ఉంటారు. ఒక సెన్సిటివ్‌ స్టొరీను అర్థం చేసుకొని నాకు రెండోసారి అవకాశం ఇవ్వడమనేది గొప్ప విషయం. ఆయన నటుడికంటే ముందు మంచి మనసున్న మనిషి. ఆయన దర్శకుల హీరో. ఏ సినిమా చేసినప్పుడైనా.. ఒత్తిడి అనేది కామన్‌. ఈ సినిమాకు ఎక్కువమంది నటీనటులతో కలిసి పని చేయడం. అందరికి డేట్స్‌ అడ్జెస్ట్‌ కాకపోవడం ఇలా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అయితే మహేష్‌ ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నప్పుడే నేనేదైనా ఎదుర్కోగలననే నమ్మకం కలిగింది. ఆయనే నా బలం. సినిమా చేస్తున్నప్పుడు ఎగుడుదిగుడులు అన్ని వస్తుంటాయి. అవన్నీ పట్టించుకుంటే సినిమా చేయలేం.
 
'సీతమ్మలోనే..' బంధాల గురించి చెప్పేశారు. మరి ఇందులో..?
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'బ్రహ్మోత్సవం' రెండు వేర్వేరు కథలు. ఆ సినిమా ఇద్దరి అన్నదమ్ముల కథ. మధ్యతరగతి కుటుంబం వారి మధ్య నడిచే కథ. 'బ్రహ్మోత్సవం' కథ పూర్తిగా భిన్నమైంది. ఒక సంపన్న కుటుంబానికి చెందిన కథ. విజయవాడ బ్యాక్‌‌డ్రాప్‌లో నడుస్తుంది. నాలుగైదు కుటుంబాలు కలిసుండే వాతావరణం. ఇక.. సమకాలీన ప్రపంచంలో మనం అనుకున్నది జరుగుతుందా..? లేదా..? ఇలా రకరకాల కన్ఫ్యూజన్స్‌లో మనుషుల మధ్య ప్రశాంతత లేకుండా పోతుంది. ఆ ప్రశాంతత ఎక్కడో బయటకు టూర్లకు వెళ్తేనో.. ఇంకేమైనా చేస్తేనో.. రాదు. మనుషుల మధ్యనే ఆ ప్రశాంతత దొరుకుతుంది. అదే పాయింట్‌ను కుటుంబ పరంగా చెప్పాలని ఈ సినిమా చేశాను. నాకు మనుషులంటే ఇష్టం. ఈ పాయింట్‌‌ను మహేష్‌ బాబుకు చెప్పగానే సినిమా చేద్దామన్నారు.
 
తోట తరిణితో పనిచేయడం ఎలా అనిపించింది?
ఇలాంటి కథను ప్రెజంట్‌ చేయాలనుకున్నప్పుడు పెద్ద టెక్నీషియన్స్‌ అయితే బావుంటుందని రత్నవేలు గారిని సెలెక్ట్‌ చేసుకున్నాం. అలానే తోట తరణి గారి సెట్స్‌ అధ్బుతంగా ఉంటాయి. ప్రతి సెట్‌ చాలా బాగా వేశారు. ఆయనతో పనిచేస్తున్నాననగానే.. మా ఫ్రెండ్స్‌.. ఆయన పక్కన నీపేరుంటే చాలన్నారు. ఆయన మేథావి. ఒక సెట్‌ వేసి ఓ సీన్‌ను ఇలా తీయవచ్చని చూపించారు. అదే సెట్‌ను కాస్త తిప్పితే.. మరోలా తీయవచ్చు.. ఆయన్నుంచి చాలా నేర్చుకున్నాను.
 
మీ నుంచి యాక్షన్‌ సినిమా ఆశించవచ్చా?
అన్నీ ఒకే రకమైన చిత్రాలు చేయాలంటే ప్రేక్షకులకు చూడటానికి బోర్‌ కొడుతుంది. సమయం బట్టి జోనర్స్‌ను మారుస్తూ ఉండాలి. చాలా కథలు రాసుకున్నాను. అయితే నెక్స్ట్‌ ఎలాంటి జోనర్‌ చేస్తానో.. ఇంకా చెప్పలేను. ఈ సినిమా తరువాత ఆలోచిస్తాను.
 
'శ్రీమంతుడు' తర్వాత మహేష్‌తో సినిమా భారంగా అనిపించిందా?
ఏ సినిమా అయినా.. హిట్‌ అవ్వాలనే చేస్తారు. 'శ్రీమంతుడు' విజయం తరువాత వచ్చే సినిమా అనే ఫీలింగ్‌ ఖచ్చితంగా ఉంటుంది. ఆ సినిమాతో పోల్చుకోకూడదు కానీ మహేష్‌ కెరీర్‌లో చాలా గొప్ప సినిమాలు ఉన్నాయి. ఈ సినిమా కూడా ఆ స్థాయిలో ఉండాలనే ప్రయత్నంతో చేశాను అని తెలిపారు.