శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (07:58 IST)

సింగరేణి కార్మికులకు 28 శాతం బోనస్

నల్ల సూరీళ్ల శ్రమకు ఫలితం లభించింది! సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్‌ దసరా కానుక అందించారు. సింగరేణి లాభాల్లో కార్మికులకు 28 శాతం బోనస్‌ ఇస్తున్నట్లు గురువారం శాసనసభలో ప్రకటించారు. ఈ నిర్ణయంతో 49 వేల మంది లబ్ధి పొందనున్నారు.

గత ఏడాది లాభాల్లో కార్మికులకు 27 శాతం వాటా ఇచ్చామని, ఈ ఏడాది ఒక శాతం పెంచామని తెలిపారు. తద్వారా, ఈ ఏడాది ఒక్కో కార్మికుడు రూ.1,00,899 బోనస్‌ పొందనున్నట్లు వెల్లడించారు. గత ఏడాది కన్నా ఇది రూ.40,530 అదనమని తెలిపారు.

ప్రభుత్వం అందిస్తున్న ఈ ప్రోత్సాహాన్ని స్ఫూర్తిగా తీసుకుని కార్మికులు, సిబ్బంది మరింత అంకిత భావంతో పనిచేసి, సింగరేణికి మరిన్ని లాభాలు, విజయాలు సాధించి పెట్టాలని సీఎం ఆకాంక్షించారు. సింగరేణి విజయ ప్రస్థానంలో ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్న కార్మికులదే ముఖ్యమైన భూమిక అని.. అపారమైన ఖనిజ సంపదను వెలికి తీయడానికి వారు పడుతున్న శ్రమ వెలకట్టలేనిదని వ్యాఖ్యానించారు.

ప్రతి నిత్యం మృత్యు ఒడికి వెళ్లి వచ్చే కార్మికుల స్వేదం.. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికుల త్యాగనిరతికి ఏ మాత్రం తీసిపోనిదని అభివర్ణించారు. 2013-14లో సింగరేణికి రూ.418 కోట్ల లాభాలు రాగా.. ఏటేటా పెరుగుతూ 2018-19లో రూ.1,765 కోట్ల లాభాలు వచ్చాయన్నారు.

కోల్‌ ఇండియాతో పోలిస్తే సింగరేణి ఎంతోమెరుగ్గా ఉండడం మనందరికీ గర్వకారణమన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహకారం, కార్మికుల సంక్షేమానికి తీసుకున్న చర్యల ఫలితంగా సింగరేణి సంస్థాగతంగా బలోపేతమైందన్నారు.
 
సమైక్య రాష్ట్రంలో 2013-14లో రూ.13,540 మాత్రమే బోనస్‌ చెల్లించారని; రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం వారి బోన్‌సను క్రమంగా పెంచుతూ 2017-18లో ఒక్కో కార్మికుడికి రూ.60,369 బోనస్‌ అందించిందని గుర్తు చేశారు. సింగరేణి కార్మికులకు బోనస్‌ ప్రకటనపై మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

కార్మికుల తరఫున సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సింగరేణి లాభాలకు కార్మికులే కారణమని, వారికి లాభాల వాటాను బోన్‌సగా ప్రకటించడం హర్షణీయమని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు.