1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
  4. Homework Help Tips for Parents

పిల్లల హోమ్‌వర్క్‌లలో పెద్దవాళ్ల జోక్యం ఎంతవరకు ఉండాలి?

Homework Help Tips for Parents
చదువులో, స్కూల్లో పిల్లల పురోగతి ఎలా ఉందో పెద్దవాళ్ళు తెలుసుకోవడానికి హోమ్ వర్కులు ఉపకరిస్తాయి. చాలా ఇళ్ళల్లో హోమ్ వర్క్‌లకు సంబంధించి పిల్లలకు, పెద్దవాళ్ళకు నడుమ వాగ్వివాదాలు జరుగుతూ ఉంటాయి. పిల్లలు హోమ్ వర్క్ సరిగ్గా చేయలేదని టీచర్స్ చెబుతుంటే.. తదేకంగా పిల్లల్ని తిట్టడం మంచిది కాదు. హోమ్ వర్క్‌లపై అనుక్షణం ప్రశ్నిస్తుండటం వల్ల పిల్లలు ఇంట్లోని వారికి అన్నట్లు పుస్తకాల ముందు చేరుతారు కానీ పూర్తిస్థాయి ఏకాగ్రత చూపలేరు. కాబట్టి వారంతట వారు ఆసక్తిగా హోమ్ వర్కులు పూర్తిచేసుకునే అవకాశాలు కల్పించాలి. 
 
ఏదో ఒకటి చేశాం అన్నట్లు కాకుండా అసైన్‌మెంట్స్ అభ్యాస ప్రక్రియతో కలిపి పూర్తి చేయడం అవసరం. ఇందుకు అవసరమైన సాయం చేయడం, తెలియనివి వివరించడం చేయాలే తప్ప ప్రతి అంశంలోనూ జోక్యం చేసుకోకూడదు. ప్రతిరోజూ ఓ వేళ ప్రకారం హోమ్ వర్కులకు కూర్చోబెట్టాల్సిన బాధ్యత పెద్ద వాళ్ళదే. వారు హోమ్ వర్కులకు కూర్చునే సమయంలో ఇంట్లోని మిగతావారు టీవీ ముందు కూర్చోవడం, ఫోన్లలో బాతాఖానీ, కుటుంబసభ్యులతో కబుర్లు మొదలు పెడితే వారికి ఆసక్తి ఉండదు. కాబట్టి ఓ గదిలో హోమ్ వర్కులు పూర్తి చేసుకోవడానికి అనువైన వాతావరణం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. 
 
వారికి కావాల్సిన వాతావరణం కల్పించడం, తెలియనివి చేయించడం, పూర్తి చేసినవాటికి ప్రశంసల వరకే పెద్దవారు పరిమితం కావాలి. ప్రతిదానికీ వెనక ఉండి సలహాలు ఇస్తుంటే, పిల్లలలో స్వయం అభ్యాస లక్షణం తగ్గిపోయి ప్రతిదానికీ ఆధారపడే తత్త్వం పెరిగిపోతుంది. ఇది  సమంజసనీయ ధోరణి కాదు. 
About Writer
Selvi