1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

బాలాదిత్య సరసన ముగ్గురు హీరోయిన్లు

యువహీరో బాలాదిత్య
WD PhotoWD
యువహీరో బాలాదిత్య, రవళి, గీతాసింగ్, ప్రవళిక హీరోహీరోయిన్లుగా 'పిల్ల దొరికితే పెళ్ళి' అనే చిత్రాన్ని గాయత్రీ ఫిలిమ్స్ నిర్మిస్తోంది. ఎమ్మెస్.వాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజయకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్పీ.పట్నాయక్ థియేటర్‌లో ఈ చిత్రంలోని తొలిపాటను ఇటీవల రికార్డ్ చేశారు. ఈ చిత్రంపై దర్శకుడు విజయకృష్ణ మాట్లాడుతూ.. పలువురి వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన అనుభవంతో తొలిసారిగా దర్శకత్వ బాధ్యతలను చేపడుతున్నట్టు చెప్పారు.

నూటికి నూరు పాళ్లు వినోదభరితంగా ఈ చిత్ర కథ సాగుతుందన్నారు. తన ఊహలకు, ఆశయాలకు తగిన అమ్మాయి దొరికితే పెళ్ళి చేసుకోవాలన్నదే చిత్ర కథానాయకుడి ఆలోచన. ఈనెల ఆరో తేదీ నుంచి విజయవాడ సమీపంలోని కంచికచర్లలో షూటింగ్ ప్రారంభిస్తామని చెప్పారు. నిర్మాత వాసు మాట్లాడుతూ.. కథ బాగా నచ్చడం వల్లే చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు చెప్పారు.

మొత్తం ఐదు పాటలు ఉంటాయని, ప్రతి పాట కొత్త వైవిద్యంతో ముందుకు సాగుతుందన్నారు. బొంబై బోలే సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ చిత్రంలో ఏవీఎస్, రాళ్ళపల్లి, కొండవలస, కోట శంకరరావు, సన, కవిత, తెలంగాణా శకుంతల, జూ.రేలంగి, గౌతంరాజు, చిట్టిబాబు తదితరులు నటిస్తున్నారని చెప్పారు. ఈ చిత్రానికి రచన.. బొల్లిముంత నాగేశ్వరరావు, కెమరా.. దివాకర్, పాటలు.. కందికొండ, ఎడిటింగ్.. ముత్యాల నాని.
About Writer
PNR