1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

కాబోయే ముఖ్యమంత్రి మెగాస్టార్: నూతన్ ప్రసాద్

ఆగస్టు 22 చిరంజీవి పుట్టిన రోజు నూతన్ ప్రసాద్
ఆగస్టు 22 మెగాస్టార్ చిరంజీవి జన్మదిన సందర్భంగా నటుడు నూతన ప్రసాద్‌కు చిరంజీవి కుటుంబ సభ్యులు పద్మశ్రీ 'అల్లు రామలింగయ్య అవార్డు'ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నూతన్ ప్రసాద్ మాట్లాడుతూ.. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా శిల్పకళా వేదికకు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. గతంలో ఓ షూటింగ్ నిమిత్తం 40 రోజులు ఆయనతో కలిసి ఒకే హోటల్ గదిలో గడిపాననీ, ఎన్నో విషయాలు పాలుపంచుకున్నాననీ చెప్పారు.

చిరు డాన్స్ అంటే.. యూత్‌కు ఎంతో ఇష్టమనీ, డాన్సర్‌గా ఇండస్ట్రీలో చిరంజీవి తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారని అన్నారు. తాను చిరంజీవి కలిసి వరుసగా రెండు సార్లు నంది అవార్డులు అందుకున్నామన్నారు. మాస్టర్ సినిమాలో ఆయనతో కలసి నటించే అవకాశం వచ్చిందని చెప్పారు. ఆ టైమ్‌లో అమితాబ్, గోవిందలు నటిస్తున్న చిత్రం షూటింగ్ పక్కన ఉన్న ఫ్లోర్‌లో జరిగేదని, అమితాబ్ రెగ్యులర్‌గా చిరంజీవిని కలుసుకునేవారని గుర్తుచేసుకున్నారు.

గోవింద చిరంజీవికి పాదాభివందనం చేస్తూ.. తన అభిమానాన్ని చాటుకునేవారనీ, అయినా గోవింద పాదాభివందనానికి చిరంజీవి ఒప్పుకునేవారుకాదనీ, సాటి మనిషిగా గౌరవించండి చాలు అని మాత్రమే అనేవారనీ నూతన్ ప్రసాద్ అన్నారు. అటువంటి మానవత్వం కలిగిన వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ముఖ్యమంత్రి అవడం ఖాయమనీ, ఇంతమంది అభిమానులు కలిసి చేస్తున్న వేడుకలు కాబోయే సీఎంకు చేస్తున్నట్టుగా ఉందని నూతన్ ప్రసాద్ వ్యాఖ్యానించారు.
About Writer
PNR